ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల కానున్న 'రెనో కైగర్'.. టెస్టింగ్ దశలో కనిపించిన ఫోటోలు
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకి డిమాండ్ భారీగా పెరుగుతోంది, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనాల్ట్ దేశీయ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రెనాల్ట్ తన క్విడ్ మరియు కైగర్ వంటి వాటిని ఈ విభాగంలో విడుదల చేయనుంది.
ఇటీవల రెనాల్ట్ కైగర్ ఎలక్ట్రిక్ SUV టెస్టింగ్ సమయంలో బెంగళూరులో కనిపించింది. ఇది కూడా బెంగళూరులోని స్వదేశీ EV స్టార్ట్ అప్ కంపెనీ అయినా ప్రవైగ్ డైనమిక్స్ సౌకర్యం వద్ద దర్శనమిచ్చింది. కంపెనీ ఈ సంవత్సరం తప్పకుండా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశినాచనున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది. ఇప్పటికే రెనాల్ట్ ఎలక్ట్రిక్ కార్లు గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి, అయితే ఇప్పుడు భారతదేశంలో విడుదలకావడానికి సిద్ధమవుతోంది.

ప్రస్తుతం రెనాల్ట్ కంపెనీ రెండు ఎలక్ట్రిక్ కార్ల (క్విడ్ మరియు కైగర్) మీద పనిచేస్తోంది. కావున ఇందులో ఏది ముందుగా దేశీయ మార్కెట్లో విడుదలవుతుంది అనేది ఖచ్చితంగా తెలియదు. ఇప్పుడు కైగర్ టెస్టింగ్ దశలో ఉంది కావున బహుశా ఇదే దేశీయ విఫణిలో ముందుగా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. టెస్టింగ్ సమయంలో కనిపించిన రెనాల్ట్ కైగర్ ఎలక్ట్రిక్ చూడటానికి దాని స్టాండర్డ్ పెట్రోల్ మోడల్ మాదిరిగానే ఉంటుంది.
చూడటానికి కైగర్ దాని పెట్రోల్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ దాని ఫ్రంట్ లోగో కింద ఛార్జింగ్ సాకెట్ ఉంది. ఇప్పటికే వెలువడిన చిత్రాలలో దీనిని గమనించవచ్చు. ఇంటీరియర్ కూడా దాదాపు దాని పెట్రోల్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు. ఇప్పుడు ఇందులో డ్రైవ్ మోడ్ ఎంచుకోవడానికి బటన్లు మరియు రొటేటింగ్ నాబ్ వంటివి కనిపిస్తాయి. అదే సమయంలో హ్యాండ్ బ్రేక్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.
రెనాల్ట్ కైగర్ ఎలక్ట్రిక్ డోర్ ప్యానెల్స్, స్టీరింగ్ వీల్, సీట్ ఫ్యాబ్రిక్ మొదలైనవన్నీ కూడా పెట్రోల్ కైగర్ ను పోలి ఉంటాయి. ఇంకా దీనికి సంబంధించిన చాలా సమాచారం తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా త్వరలోనే తెలుస్తాయి. గత ఏడాది (2022) కంపెనీ ఆశించిన అమ్మకాలను పొందలేదు. కావున ఈ 2023 లో తప్పకుండా కంపెనీ తన ఉనికిని చాటుకోవడానికి అలాగే ఎలక్ట్రిక్ వాహన విభాగంలో చోటు సంపాదించుకోవడం కోసం ప్రయత్నిస్తోంది.
రెనాల్ట్ కైగర్ ఈవి చైనాలో అందుబాటులో ఉన్న క్విడ్ ఎలక్ట్రిక్ లో ఉన్న అదే బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ వంటి వాటిని పొందుతుంది. కావున ఇందులో 26.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ మరియు 44 బిహెచ్‌పి పవర్ మరియు 125 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. అయితే క్విడ్ కంటే కూడా కైగర్ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది కావున బ్యాటరీ ప్యాక్ కొంత పెద్దదిగా ఉండే అవకాశం కూడా ఉంది.
రెనాల్ట్ కైగర్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 350 కిమీ పరిధిని అందించే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రెనాల్ట్ క్విడ్, కైగర్ మరియు ట్రైబర్ వంటివి పెట్రోల్ ఇంజిన్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఈ మూడు కార్లు కూడా ఒకే ప్లాట్ ఫామ్ మీద నిర్మించబడి ఉంటాయి. కావున కంపెనీ రానున్న రోజుల్లో ట్రైబర్ ని కూడా పెట్రోల్ వెర్షన్ లో లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం రెనాల్ట్ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారుని విడుదల చేస్తే 2023 రెనాల్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ విడుదల చేసిన సంవత్సరంగా నిలుస్తుంది. ప్రస్తుతం టాటా పంచ్ మరియు సిట్రోయెన్ సి3 వంటివి కూడా ఎలక్ట్రిక్ విభాగంలో విడుదలకానున్నాయి. ఇవన్నీ ఇంకో రెండు రోజుల్లో జరగనున్న 2023 ఆటో ఎక్స్పోలో విడుదలవుతాయి. రెనాల్ట్ కైగర్ ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, అయినప్పటికీ దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








