PM E-Bus Seva Scheme దేశవ్యాప్తంగా త్వరలో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు.. కేంద్ర కేబినెట్ ఆమోదం
దేశంలో కాలుష్య రహిత వాతావరణం సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఆటో మొబైల్ కంపెనీలకు సబ్సిడీలు అందిస్తోంది. కాగా ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు, టూ వీలర్స్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం ప్రధానమంత్రి ఈ-బస్ సేవా పథకానికి ఆమోదం తెలిపింది.
ప్రధానమంత్రి ఈ-బస్ సర్వీస్(PM E-Bus Seva Scheme) పథకం కింద పట్టణ రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుంది. త్వరలో దేశంలోని ప్రధాన నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. దీనిపై విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడారు. పీఎం ఈ-బస్ సర్వీస్ స్కీమ్‌కు ఆమోదం లభించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.57,613 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో సుమారు 10,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు సేవలందించనున్నాయి. 3 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు మరియు సరైన రవాణా సౌకర్యాలు లేని పట్టణాల్లో ఈ పథకం ప్రాధాన్యత ప్రకారం కేంద్రం ఈ పథకం అమలు చేస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కూడా ఈ పథకంలో చేర్చనున్నట్లు మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఈ భారీ ప్రాజెక్టును రూ.57,613 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు అనురాగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.20,000 కోట్ల సహాయం అందిస్తుందన్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు పబ్లిక్ ప్రైవేట్ (PPP) భాగస్వామ్యంలో నడుస్తున్నాయని వెల్లడించారు. రాబోయే పదేళ్లపాటు ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తి సహకారం లభిస్తుందన్నారు. దీని ద్వారా దాదాపు 45,000 నుంచి 55,000 వరకు కొత్త ఉద్యోగాలు వస్తాయని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు విభాగాలుగా అమలు చేయనుంది. అవి, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ మరియు గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్స్. పట్టణ రవాణా సేవ కింద ఎలక్ట్రిక్ బస్సులు PPP మోడల్‌లో సర్వీసులు అందిస్తాయి. ఇంకా ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుంది. గ్రీన్ అర్బన్ మొబిలిటీ ఇనిషియేటివ్స్ కింద బస్సు మరమ్మతులతో సహా వివిధ ప్రాజెక్టులు ఈ పరిధిలోకి వస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ఈ భారీ ప్రకటన చేయడంతో ఆటోమొబైల్ రంగంలో ఉత్కంఠ నెలకొంది. ఆటోమోటివ్ రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీల షేర్ విలువ ఒక్కసారిగా పెరిగింది. JBM ఆటో షేర్లు 10 శాతానికి పైగా పెరిగాయి. టాటా మోటార్స్ షేర్లు 1.9 శాతం, అశోక్ లేలాండ్ 0.9 శాతం లాభపడ్డాయి.

కేవలం బస్సులే కాకుండా రైల్వేలను సైతం కాలుష్య రహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. అందులో భాగంగానే హైడ్రోజన్ రైళ్లను నడపాలని యోచిస్తోంది. సుదీర్ఘ సాధ్యాసాధ్యాల అధ్యయనం తర్వాత, రైల్వే శాఖ హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రాజెక్ట్‌పై పనులను ప్రారంభించింది. వారసత్వ ప్రదేశాలకు కలుపుతూ వెళ్లే కొండ మార్గాల్లో ఈ హైడ్రోజన్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు హైడ్రోజన్ రైలు ప్రాజెక్టులో లోక్‌సభ స్టాండింగ్ కమిటీ నివేదికను వెల్లడించింది.
డార్జిలింగ్, కల్కా సిమ్లా, కాంగ్రా వ్యాలీ, బిల్మోరా వాఘై, పటపాల్పాని కలకుండ్‌తో సహా ప్రధాన వారసత్వ ప్రదేశాల్లో సేవలందించనున్నాయి. ఒక్కో రైలుకు రూ.80 కోట్ల చొప్పున 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని ప్రతిపాదించింది. దీంతోపాటు ఒక్కో రూట్ అభివృద్ధికి రూ.70 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే కొన్నేళ్లలో హైడ్రోజన్ రైళ్లు త్వరలోనే పరుగులు పెట్టనున్నాయి.


Click it and Unblock the Notifications








