Volvo C40 Recharge ఎలక్ట్రిక్ కారు విడుదల.. సింగిల్ ఛార్జ్‌తో 530 కి.మీ రేంజ్..
దేశీయ మార్కెట్లో ఎంతగానో ఎదురుచూస్తున్నవోల్వో సీ40 రీఛార్జ్(Volvo C40 Recharge) కారును ఈ రోజు వోల్వో సంస్థ విడుదల చేసింది. గత జూన్‌లో వోల్వో ఈ కారును ఆవిష్కరించింది. స్వీడిష్ కంపెనీ అయిన వోల్వో భారత్‌లో కార్ల తయారీ మరియు విక్రయాల్లో అగ్రగామిగా ఉంది.
వోల్వో తన సీ40 రీఛార్జ్ కారును దేశీయ మార్కెట్లో రూ.61.25 లక్షలకు విడుదల చేసింది. వోల్వో తన కార్లను ప్రీమియం సెగ్మెంట్లో మాత్రమే విడుదల చేస్తోంది. దీని ప్రకారం, కంపెనీ ఇప్పుడు భారతదేశంలో c40 రీఛార్జ్ అనే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు మార్కెట్లో హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6 మరియు వోల్వో XC40 రీఛార్జ్‌లతో నేరుగా పోటీపడుతోంది.

వోల్వో కంపెనీ కార్లు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ కలిగి ఉన్నాయి. కంపెనీ కార్లు దాని యజమానులకు హుందాతనాన్ని ఇస్తాయని మార్కెట్‌లో గట్టి నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో వోల్వో విడుదలు చేసిన సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు గురించిన పూర్తి సమాచారం ఈ కథనంలో మీ కోసం..
వోల్వో సీ40 రీఛార్జ్ కారు పొడవు 4440 mm, వెడల్పు 1910 mm మరియు ఎత్తు 1591 mm. ఈ కారులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ఈ కారు 42 బిహెచ్‌పి వద్ద 660 ఎన్ఎమ్ గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

కారు రియర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారు బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8 గంటల సమయం పడుతుంది. ఇందుకోసం ఈ కారులో 78 కిలోవాట్ అవర్ లిథియం బ్యాటరీని అమర్చినట్లు కంపెనీ ప్రకటించింది.
ఇక వోల్వో సీ40 రీఛార్జ్ డిజైన్ పరిశీలిస్తే ముందు భాగంలో కంపెనీ సిగ్నేచర్ హామర్ ఆకారంలో DRL ఉంది. ముందు భాగంలో నల్లటి గ్రిల్ ఉంది. 19 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక డోర్‌లో బ్లాక్ లిప్స్ స్పాయిలర్‌లు, టెయిల్ లైట్ విషయానికి వస్తే, LED టెయిల్ లైట్ అమర్చారు.

వోల్వో సీ40 రీఛార్జ్ కారులో ఇంటీరియర్ ఆకర్షణీయంగా ఉంది. 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు.. ఈ కారులో పనోరమిక్ సన్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ADAS సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

ఈ కారు పికప్ చూస్తే.. ఇది కేవలం 4.7 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. పూర్తిగా ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఈ కారును రూపొందించారు. ఈ కారును సులభంగా రీఛార్జ్ చేసుకుని దూర ప్రయాణాలకు తీసుకెళ్లవచ్చు.
వోల్వో సీ 40 రీఛార్జ్ మూడు సంవత్సరాల వారంటీ, ఎనిమిదేళ్ల బ్యాటరీ వారంటీ మరియు ఐదు సంవత్సరాల డిజిటల్ సర్వీస్ వారంటీతో వస్తుంది. ఈ కారు 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెంట్ మరియు వాల్ బాక్స్ ఛార్జర్‌తో వస్తుంది.

వోల్వో సీ40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారు మొత్తం 6 కలర్స్‌లో అందుబాటులో ఉంది. క్రిస్టల్ వైట్, ఆక్సిక్స్ బ్లాక్, ఫ్యూజన్ రెడ్, క్లైవుడ్ బ్లూ, సేజ్ గ్రీన్, ఫ్జోర్డ్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు ఇష్టమైన రంగును ఎంచుకునే వెసులుబాటు ఉంది.
వోల్వో సీ40 రీఛార్జ్ కారు రూ.61.25 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ముందుగా బుక్ చేసుకున్న 500 మందికి మాత్రమే ఈ కారును ఈ ధరకు విక్రయించనున్నారు. భవిష్యత్తులో ఈ కారు ధరను పెంచే అవకాశం ఉంది. బుకింగ్‌కు సంబంధించి, ఆన్‌లైన్ బుకింగ్ రేపు (సెప్టెంబర్ 5న) సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications








