ఎక్కువ మైలేజీ ఇచ్చే టాప్ 10 కార్లు.. వీటిని తెచ్చుకోండి, ఖర్చులు ఆదా చేసుకోండి!
దేశంలో కార్ల వినియోగం పెరిగింది. ఇందులోనూ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్‌ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇవి ఢిఫరెంట్ బాడీ స్టైలింగ్, టాప్ క్లాస్ ఫర్ఫామెన్స్‌తో వస్తాయి. అందువల్ల ఈ సెగ్మెంట్ కార్లు అమ్మకాల్లో దుమ్మురేపుతున్నాయి. ఎక్కువ ఇంటీరియర్ స్పేస్, స్మార్ట్ ఫీచర్లు, భారీ మైలేజీ ఇచ్చే ఎస్‌యూవీలు వివిధ కంపెనీల నుంచి అందుబాటులో ఉన్నాయి. కాస్త ధర ఎక్కువైనా కానీ కంఫర్ట్, సేఫ్టీకి ప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సేఫ్టీలోనూ ఈ మైక్రో ఎస్‌యూవీలు అదరగొడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మంచి మైలేజీతో అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల వివరాలు మీకోసం..
ఈ లిస్ట్‌లో ముందుగా చర్చించాల్సిన ఎస్‌యూవీ మారుతి బ్రెజా. ఇది పెట్రోల్ మాన్యువల్ వెర్షన్‌లో లీటర్‌కి 17.38 నుంచి 19.89 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక ఆటోమేటిక్ వేరియంట్స్ 19.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. బ్రెజా సీఎన్‌జీ వెర్షన్ కిలోకి 25.51 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇది నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఆ తర్వాత మారుతి సుజుకి ఫ్రాంక్స్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీటరుకు 21.8 కిలోమీటర్లు, టర్బో ఇంజిన్ మాన్యువల్ వెర్షన్ లీటరుకు 21.5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫ్రాంక్స్ NA పెట్రోల్, టర్బో ఇంజిన్‌లు వరుసగా 22.89, 20.02 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఇది సైడ్ ఫ్రొఫైల్‌లో ప్రీమియం లుక్‌తో వస్తుంది.
టాటా పంచ్ పెట్రోల్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లీటర్‌కి 20 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 19 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో వచ్చే పంచ్ సీఎన్‌జీ వెర్షన్ కిలోకు 27 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ లభిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే కావడం గమనార్హం.

టాటా నెక్సాన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటర్‌కి 17.5 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ 17 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అలాగే డీజిల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లు లీటరుకు 23 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. ఇక నెక్సాన్ సీఎన్‌జీ కిలోకి 24 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన మొట్ట మొదటి సీఎన్‌జీ కారుగా నెక్సాన్ నిలిచింది.
ప్రస్తుతం అమ్మకాల్లో దూసుకెళ్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 18.89 నుంచి 20.1 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.2 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇక డీజిల్ వెర్షన్స్ లీటర్‌కి 20.6 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ వేరియంట్‌ని బట్టి 3 నెలల నుంచి ఏడాదిగా ఉంది.

ఈ జాబితాలోని హ్యుందాయ్ వెన్యూ NA పెట్రోల్, టర్బో పెట్రోల్, టర్బో డీజీల్ ఇంజిన్ ఆప్షన్‌లతో వస్తుంది. వెన్యూ NA పెట్రోల్ మాన్యువల్ లీటరుకు 17.5 కిలోమీటర్లు, టర్బో మాన్యువల్ 18 కిలోమీటర్ల మైలేజీని అందిస్తాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది 18 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. టర్బో డీజిల్ వెర్షన్ లీటరుకు 23.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఇవే కాకుండా హ్యుందాయ్ ఎక్స్‌స్టర్ 19.2 కిలోమీటర్లు, సీఎన్‌జీ వెర్షన్ కిలోకి 27 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. కియా సోనెట్ లీటరుకు 17.5 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక నిస్సాన్ నుంచి మాగ్నైట్ లీటరుకు 19 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. అదే విధంగా రెనాల్ట్ కిగర్ 17 నుంచి 20.7 మైలేజీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








