New EV Policy భారత్‌లో టెస్లా ఎంట్రీకి లైన్ క్లియర్.. కొత్త ఈవీ పాలసీకి మోదీ సర్కార్ ఆమోదం
విదేశీ ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. తమ దేశాల్లో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లను భారత్‌లోకి దిగుమతి(New EV Policy) చేసుకునేందుకు కొత్త ఎలక్ట్రిక్ వాహన విధానానికి మోదీ సర్కార్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను మార్చి 15న(శుక్రవారం) కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో FAME సబ్సిడీ ద్వారా దేశంలో ఈవీ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను అందిస్తూ ప్రోత్సహిస్తోంది. అయితే భారత్‌లో విదేశీ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించడానికి మరియు తయారు చేయడానికి వాటిపై అధిక దిగుమతి సుంకం విధించబడుతుంది. ఈ దిగుమతి సుంకాలు ప్రస్తుతం 100 శాతం వరకు ఉన్నాయి.

కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి, అనేక దేశాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని పెంచడానికి మరియు వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఆటోమొబైల్ కంపెనీలు కూడా రాయితీలు పొందుతున్నాయి.
ఈ క్రమంలో, విదేశాల్లో తయారు చేయబడిన ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లోకి దిగుమతి చేసుకోవడానికి అధిక పన్ను మినహాయింపు కోసం చాలా సంవత్సరాలుగా డిమాండ్ కొనసాగుతుంది. కనీసం షరతులతోనైనా పన్నుపై రాయితీని అందించాలని విదేశీ ఈవీ సంస్థలు కోరుతున్నాయి. అయితే ప్రపంచంలోనే అతి పెద్ద ఈవీ తయారీ సంస్థ టెస్లా(Tesla Entry To India) కూడా భారత్‌లో కూడా అడుగుపెట్టాలని చూస్తోంది.

ఈ క్రమంలో భారత్‌కు టెస్లా(Tesla) కార్ల దిగుమతి పన్నులపై రాయితీలు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టెస్లా కోరుతోంది. దీనికి మోదీ సర్కార్ అంగీకరించలేదు. విదేశీ ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు రాయితీలు ప్రకటిస్తే.. దేశీయ తయారీదారులు నష్టపోతారని వెల్లడించింది. దీనికోసం ప్రత్యేకంగా చట్టాలను తీసుకురాలేమని స్పష్టం చేసింది.
కేంద్రం ఈ ప్రకటన చేసిన కొద్ది రోజులకే మరో కీలక ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా విదేశీ ఈవీ తయారీ కంపెనీలకు భారీ ఊరట కలుగుతోంది. దీంతో భారత్‌కు వచ్చేందుకు(New Electrical Vehicle Policy) టెస్లాకు మార్గం సుగమమైంది. భారత్‌లో తక్కువ దిగుమతి సుంకంతో ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి మరియు అమ్మకం కోసం కొత్త షరతులతో కూడిన డ్రాఫ్ట్‌ను కేంద్రం రూపొందించింది.

భారత్‌లో దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ కార్లపై పన్ను ప్రయోజనాన్ని పొందడానికి మార్గదర్శకాలు, అర్హతలను వివరిస్తూ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం విదేశాల నుంచి ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకొని భారతదేశంలో తక్కువ ధరలకు విక్రయించాలంటే కంపెనీలు కొన్ని ముఖ్యమైన షరతులు పాటించాల్సి ఉంటుంది.
ప్రధానంగా, విదేశీ కంపెనీ భారతదేశంలోకి దిగుమతులు ప్రారంభించిన మూడేళ్లలోపు రూ. 4,150 కోట్ల పెట్టుబడిని భారతదేశానికి తీసుకురావాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అటువంటి దిగుమతి ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత మాత్రమే తక్కువ ట్యాక్స్‌తో ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఈ తక్కువ ఇంపోర్ట్ ట్యాక్స్‌తో సంవత్సరానికి కేవలం 8000 ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే దిగుమతి చేసుకోవాలని వెల్లడించింది.

అంతకు మించి వాహనాలను భారత్‌కు దిగుమతి చేసుకోలేరు. మూడేళ్లలోగా కంపెనీ భారత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసి వాహనాలను భారత్‌లోనే తయారు చేసి విక్రయించాల్సి ఉంటుంది. దీని ద్వారా కంపెనీ భారతదేశంలో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత, వాహనాన్ని తయారు చేయడానికి 35 శాతం విడిభాగాలను పూర్తిగా భారతదేశంలోనే కొనుగోలు చేయాలి. వచ్చే ఐదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాల్సి ఉంటుంది.
ఈ షరతులకు అంగీకరిస్తేనే తక్కువ డ్యూటీతో వాహనాలను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఈ షరతులన్నీ అంగీకరించిన తర్వాత వాహనాన్ని దిగుమతి చేసుకుంటే ఆ వాహనం ధర రూ. 35 వేల అమెరికన్ డాలర్లలోపు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.29 లక్షలు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే ఆ వాహనంపై కేవలం 15 శాతం మాత్రమే దిగుమతి పన్ను వసూలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతి మరియు విక్రయాలపై 70 నుండి 100 శాతం పన్ను విధిస్తున్నారు. భవిష్యత్తులో భారత్‌లోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ తరహా పన్ను తగ్గింపులు ప్రకటించింది. దీని వల్ల తక్కువ కాలంలోనే భారత్‌లో భారీ పెట్టుబడులు రానున్నాయి. తాజా నిర్ణయంతో భారత్‌లో టెస్లా ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది.


Click it and Unblock the Notifications








