ఫేమస్ కారుని రీకాల్ చేసిన ఆ సంస్థ.. కారణం ఏంటో తెలుసా?
భారత్‌లో ఫేమస్ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి నుంచి వచ్చిన ఫ్రాంక్స్ కారు గురించి మీరు వినే ఉంటారు. మార్కెట్‌లోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ కారు అమ్మకాల్లో.. తన హవా చూపించింది. భారత్‌లో పెద్దఎత్తున దీన్ని కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపారు. అందుబాటు ధరలో ఉండటం.. ఎక్సలెంట్ పర్ఫామెన్స్.. మంచి మైలేజీ కారణంగా దీని అమ్మకాలు అదరగొట్టాయి.
అంతేకాదు ఫ్రాంక్స్ రగ్డ్ లుక్ దీనికి అదనపు ఆకర్షణ. ఈ బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ నుంచి చూస్తే గ్రాండ్ విటారా లుక్‌ను తలపిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారును సంస్థ రీకాల్ చేసింది. అయితే ఇది మన దేశంలో కాదండోయ్..! సుజుకీ సంస్థ మాతృదేశమైన జపాన్‌లో. అసలెందుకు.. ఈ కారును సుజుకి రీకాల్ చేసింది? మరి భారత్‌లో వాడుతున్న ఫ్రాంక్స్ పరిస్థితి ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రాంక్స్ అమ్మకాలు భారత్‌లో ఏ విధంగానైతే జోరు చూపించాయో జపాన్‌లోనూ అదే స్థాయిలో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో జపనీస్ మార్కెట్లోకి ఫ్రాంక్స్ కారును విడుదల చేశారు. దీని ప్రత్యేకత ఏంటంటే జపాన్‌కు ఎగుమతి చేసిన సుజుకి ఎస్‌యూవీలో ఇదే మొదటిది కావడం గమనార్హం. అయినప్పటికీ ఈ కారు ఆ కంపెనీ ఊహించిన దాని కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ అమ్మకాలతో అదరగొట్టింది.
అంతా బానే ఉంది కానీ ఈమధ్య ఆ సంస్థ తమ కారులో కొన్ని లోపాలను గుర్తించింది. బ్రేక్ సంబంధిత సమస్యల కారణంగా సుజుకి సంస్థ ఫ్రాంక్స్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆ దేశ మౌలిక వసతులు, రవాణా పర్యాటక మంత్రిత్వ శాఖకు కంపెనీ.. ఓ ఫైల్‌ను సమర్పించినట్లు సమాచారం. రేర్ బ్రేక్ కాలిపర్‌కు సంబంధించిన బోల్టులు సరిగా బిగించకపోవడమే రీకాల్ చేయడానికి ప్రధాన కారణం.

2024 సెప్టెంబర్ 13 నుంచి నవంబర్ 8 మధ్య తయారుచేసిన 1,911 యూనిట్ల ఫ్రాంక్స్ కార్లను ఆ సంస్థ రీకాల్ చేసింది. వాటి బ్రేక్‌కు సంబంధించిన బోల్టులను అలాగే ఉంచినట్లయితే రానున్న రోజుల్లో అది సమస్యలకు దారితీస్తుందని తెలిపింది. కొన్ని రోజుల తర్వాత అవి లూజ్ అయ్యే అవకాశం ఉందని.. దీని కారణంగా ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణించేటప్పుడు అసాధారణ శబ్దాలు వినిపిస్తాయని చెప్పింది.
కొన్ని సందర్భాల్లో బోల్టులు పూర్తిగా వదులైపోయి.. బ్రేక్స్ వేసేటప్పుడు సమస్యలు ఎదురు కావచ్చని హెచ్చరించింది. ఈ సమస్యను పరిష్కరించాలంటే అన్ని వాహనాలను వెనక్కి రప్పించి, బోల్టులు పరిశీలించడం తప్పనిసరని సంస్థ భావించింది. ఏదైనా కారుకు సంబంధించి బోల్టులు సరిగా బిగించలేదని గమనిస్తే గనుక వాటిని సంస్థ రీప్లేస్ చేస్తుంది. అంతేకాదు రీకాల్‌లో భాగంగా.. ఈ సర్వీస్ అంతా ఉచితంగా అందివ్వనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
భారత్‌లో పరిస్థితి ఏంటి?: జపాన్‌లో సుజుకీ సంస్థ ఫ్రాంక్స్ కార్లను రీకాల్ చేయడం వార్త విన్న భారత్‌లోని చాలామంది ఫ్రాంక్స్ వినియోగదారులు టెన్షన్‌లో పడ్డారు. భారత్‌లో ఫ్రాంక్స్ కార్లలో ఎలాంటి సమస్యలు ఇప్పటివరకు ఎదురు కాలేదు. ఎవరైతే భారత్‌లో ఈ కారు కొన్నారో దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇండియాలో 2023 ఏప్రిల్‌లో ఈ కారు మార్కెట్లోకి విడుదలైంది. ఇప్పటికే దాదాపు రెండు లక్షల వరకు వినియోగదారులు దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఎన్‌సీఆర్, దిల్లీ, ముంబయి, కొచ్చి, బెంగళూరు వంటి నగరాల్లో ఫ్రాంక్స్ అమ్మకాలు విపరీతంగా జరిగాయి. రూ.7.52 లక్షల నుంచి రూ.13.04 లక్షల మధ్య (ఎక్స్- షోరూమ్) ధరలో ఫ్రాంక్స్ కారు అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








