మీ కల నిజం కానుంది.. తక్కువ ధరలో బోలెడన్నీ లగ్జరీ ఫీచర్లతో నిండిన కారు ఇదే! ఆ మోడల్ ఏంటో తెలుసా
ప్రపంచవ్యాప్తంగా భారత మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. అన్ని దేశాల కంటే కూడా ఇక్కడ వ్యాపారం మంచి లాభసాటిగా ఉండటంతో ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీలన్ని కూడా భారత్‌కు క్యూ కట్టి మరి తమ పెట్టుబడులను ఇక్కడ పెడుతూ తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీ హోండా ఇండియాలో చాలా ఏళ్లుగా తన కార్లను విక్రయిస్తూ, తన మార్కెట్‌ను పెంచుకుంటుంది. హోండా(Honda) కార్స్ ఇండియా పేరిట దేశంలో వ్యాపారాన్ని నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త మోడళ్లను తీసుకొస్తుంది. ఇప్పటికే చాలా కార్లను లోకల్‌గా విక్రయిస్తుండగా, మరో కొత్త మోడల్‌ను త్వరలో తీసుకురాబోతుంది. దాని పేరే 'అమేజ్ (Amaze)'. ఇదే సిరీస్‌లో పాత మోడళ్లు ఉండగా, ఇప్పుడు రాబోతున్నది మూడవ తరం అమేజ్. ఇది ఒక సెడాన్ కారు.
దేశీయ వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ కారును కంపెనీ డిసెంబర్ 4న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. హోండా అమేజ్ మొదటిసారిగా 2013లో మార్కెట్లోకి విడుదల అయింది. దీని ఆకట్టుకునే డిజైన్‌తో లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే చాలా మంది వినియోగదారులను ఆకట్టుకుంది. దీంతో హోండా దీని కొత్త తరం కారును తరువాత విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా మూడో తరాన్ని తీసుకువస్తుంది.

కొత్తగా రాబోతున్న హోండా అమేజ్ సబ్ కాంపాక్ట్ సెడాన్‌లో ప్రముఖ మోడల‌్‌గా ఉండబోతుంది. దీని డిజైన్ పాత వాటి కంటే మరింత కొత్తగా ఉంది. ఇది అధునాతనమైన ఫీచర్లతో వస్తుంది. ఇంజిన్ విషయానికి వస్తే, 1.2-లీటర్, 4-సిలిండర్, నేచురల్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తుంది. ఇది 89 bhp పవర్‌ను, 110 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్/ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండవచ్చు.
ఈ కొత్త సెడాన్ స్పోర్టీ లుక్‌ని కలిగిస్తుంది. కారు ముందు భాగంలో ఉన్నటువంటి గ్రిల్ అధునాతనంగా ఉంది. ఇది వెడల్పుగా ఉంటుంది. కారు టీజర్‌ను చూసినట్లయితే హెడ్‌లైట్ యూనిట్‌లు స్టైలీష్‌గా ఉన్నాయి. మధ్య భాగంలో హోండా లోగో కనిపిస్తుంది. ముందు బంపర్ స్పోర్టియర్ డిజైన్‌తో కనిపిస్తుంది. పాత మోడళ్లతో పోలిస్తే 2024 అమేజ్‌లో కొన్ని మార్పులు చేసినట్లు కనిపిస్తుంది. దీని ధర రూ.10 లక్షల లోపు ఉండవచ్చు.

హోండా కంపెనీ ఇండియాలో డీజిల్ ఇంజిన్ వాహనాలను నిలిపివేస్తున్నట్లు గతంలో ప్రకటించగా, ఇప్పుడు రాబోతున్న 2024 అమేజ్‌ను పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌లో మాత్రమే తీసుకురాబోతుంది. ఈ కొత్త సెడాన్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లగ్జరీ కారు లాంటి అనుభూతిని ఇది అందిస్తుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుంది. లోపల కూర్చున్న ప్రయాణికులకు సీటింగ్ ఆకట్టుకుంటుంది.
కారు ఇంటీరియర్ ఫీచర్ల విషయానికి వస్తే, లేత గోధుమరంగు, బ్లాక్ థీమ్‌తో వస్తుంది. స్టీరింగ్ వీల్ కూడా పాత వాటికంటే మరింత కొత్తగా ఉంటుంది. లోపల 8-అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, కొత్త అప్హోల్స్టరీ, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేటెస్ట్ డాష్‌బోర్డ్, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రయాణికుల భద్రత కోసం చైల్డ్ సీట్ యాంకర్స్‌తో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్, ప్రయాణంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే హెచ్చరించడానికి అలర్ట్‌లు, రివర్స్ కెమెరా, ADAS సూట్ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ హోండా అమేజ్ కారుకు ఇండియాలో మారుతీ సుజుకీ డిజైర్ మోడల్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications








