హోండా కొత్త అమేజ్ లాంచ్.. రూ.8 లక్షలకే 19 కి.మీల మైలేజ్.. అదిరిపోతున్న డిజైన్, ఊహించని ఫీచర్లు
దిగ్గజ వాహన తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా(Honda Cars India) దేశీయ మార్కెట్లో తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, అలాగే ప్రత్యర్థి వాహన తయారీ దారులకు పోటీగా కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా తీసుకువచ్చిన ఈ మోడల్ పేరు 'అమేజ్(Amaze)'. ఇప్పటికే దీని పాత మోడల్ మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు వచ్చిన సెడాన్ మూడవ తరం కారు. ఈ కొత్త తరం అమేజ్ డిజైన్ చాలా స్టైలీష్‌గా ఉంది. పాత వాటి కంటే ఇది అధునాతన ఫీచర్లతో వచ్చింది. గతంలోనే కంపెనీ టీజర్‌ను విడుదల చేయగా, దీని ఆకట్టుకునే డిజైన్ చాలా మంది వినియోగదారులను ఆకట్టుకుంది. ఎప్పుడెప్పుడు ఇది మార్కెట్లోకి వస్తుందా అని ఎదురు చూడగా తాజాగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
కొత్త తరం హోండా అమేజ్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 8 లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి అందుబాటులో ఉంటుంది. దీని టాప్ వేరియంట్ ధర రూ.10.90 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ఉంది. సరికొత్త హోండా అమేజ్ సెడాన్ ప్రధానంగా ఇది V, VX, ZX మూడు వేరియంట్లలో లభిస్తుంది. పాత వాటితో పోలిస్తే లేటెస్ట్ ఫీచర్లు ఈ సెడాన్‌లో చాలా ఉన్నాయి. దీని గురించిన వివరాలను క్రింది కథనంలో చూద్దాం.

డిజైన్: మూడవ తరం హోండా అమేజ్ సెడాన్‌లో ముందు వెనుక సరికొత్త బంపర్‌లు ఉన్నాయి. కొత్త గ్రిల్, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, LED హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్ లైట్లు, LED ఫాగ్ లైట్లు, LED DRLలు వంటివి ఉన్నాయి. కారు 172 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది. ముందు, వెనుక నుంచి ఈ సెడాన్ అందంగా కనిపిస్తుంది. ముందు ఉన్న కంపెనీ లోగో కూడా ప్రత్యేకంగా ఉంటుంది.
ఇంజిన్: ఈ కొత్త కారులో 1.2-లీటర్ 4 సిలీండర్ నేచురల్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది 90 PS హార్స్ పవర్, 110 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ మాన్యువల్, CVT గేర్‌బాక్స్ సెటప్‌ను జోడించారు. ఈ కొత్త అమేజ్ లీటర్ పెట్రోల్‌కు 18.65 నుండి 19.46 కి.మీల వరకు మైలేజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంటుంది.

ఇంటీరియర్: కారు లోపల చాలా అందంగా ఉంటుంది. క్యాబిన్‌లో అన్ని అధునాతన ఫీచర్లనే కంపెనీ అందించింది. లోపల బ్లాక్, లేత గోధుమ కలర్ థీమ్‌ను అలంకరించారు. సీట్లకు లేత గోధుమరంగు లెథెరెట్ అప్హోల్స్టరీ, మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, డ్యాష్‌బోర్డ్‌లో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పాడిల్ షిఫ్టర్‌లు, 3-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.
భద్రతా ఫీచర్లు: ప్రయాణికుల భద్రతకు సంబంధించి హోండా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త సెడాన్‌లో మరింత రక్షణ ప్రమాణాలను అందించింది. ప్రమాద సమయంలో రక్షణ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటి వాటితో పాటు మరిన్ని ఫీచర్లను హోండా తన సెడాన్‌లో అందించింది.

ధరల విషయానికి వస్తే, కొత్త అమేజ్ సెడాన్ వీ మాన్యువల్ గేర్‌బాక్స్ ధర రూ.8 లక్షలు, సీవీటీ గేర్‌బాక్స్ ధర రూ.9.20 లక్షలు, వీఎక్స్ ఎమ్‌టీ గేర్‌బాక్స్ ధర రూ.9.10 లక్షలు, వీఎక్స్ సీవీటీ ధర రూ.10 లక్షలు, అమేజ్ జెడ్‌ఎక్స్ ఎమ్‌టీ ధర రూ.9.70 లక్షలు, జెడ్‌ఎక్స్ సీవీటీ ధర రూ.10.90 లక్షలు. కొత్త హోండా అమేజ్ సెడాన్ డెలివరీలు జనవరి 2025 నుండి మొదలవుతాయని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








