CNG కార్లకు పెరుగుతున్న క్రేజ్.. ఆ కంపెనీ ఇంట సిరుల పంట.. మార్కెట్లో పోటీ మరింత రసవత్తరం!
భారత్‌లో సీఎన్‌జీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 4.3 లక్షల సీఎన్‌జీ కార్లు అమ్ముడయ్యాయి. మంచి మైలేజీ, తక్కువ మెయింటైనెన్స్, కాలుష్య రహితంగా సీఎన్‌జీ కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ అంశాలు కస్టమర్లను CNG కార్లను కొనుగోలు చేసేలా చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి టాప్‌లో కొనసాగుతోంది. హ్యుందాయ్, టాటా మోటార్స్‌కి కూడా గట్టి పోటీని ఇస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ నుంచి అక్టోబర్) వరకు సేల్స్‌లో హ్యుందాయ్ సీఎన్‌జీ కార్లు అదరగొట్టాయి. ఇదివరకు లేని విధంగా వీటి అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్‌లో ఆ సంస్థ రికార్డు స్థాయిలో సీఎన్‌జీ కార్లను సేల్ చేసింది. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఎక్స్‌టర్, ఆరా, నియోస్ మంచి సేల్స్‌ని రాబట్టాయి. ఆ వివరాలు మీకోసం..
ప్రస్తుతం హ్యుందాయ్ విక్రయిస్తున్న సీఎన్‌జీ కార్లలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ 40 శాతం వృద్ధితో సేల్స్‌లో టాప్‌లో కొనసాగుతోంది. దీంతో హ్యుందాయ్ ఓవరాల్ CNG వెహికిల్స్ అమ్మకాలు 14.9 శాతానికి చేరాయి. డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీ వల్ల భారీ బూట్ స్పేస్, ఫ్యూయల్ ఎఫీషియన్సీ, అధిక మైలేజీ లభిస్తుంది. అన్ని కార్లలో ఈ సౌలభ్యాన్ని అందిస్తుండటంతో సేల్స్ పెరిగేందుకు ఉపయోగపడ్డాయి.

ఒక్క అక్టోబర్ నెలలోనే ఆ సంస్థ మొత్తం అమ్మకాల్లో గ్రాండ్ i10 నియోస్ CNG వేరియంట్ సేల్స్ 17.4 శాతం, ఎక్స్‌టర్ 39.7 శాతం, ఆరా 90.6% వృద్ధిని సాధించాయి. ఈ ట్రెండ్ కస్టమర్లలో CNG వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ ను చూపెడుతోంది. ఈ సేల్స్ క్రమంగా పెరగడం వల్ల కంపెనీ ఓవరాల్ సేల్స్ కూడా అమాంతం పెరిగాయి.
పట్టణాల్లో కంటే గ్రామాల్లోనే అధికంగా: CNG వాహనాలపై డిమాండ్ పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉండడం విశేషం. పుణె, దిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లో హ్యూందాయ్ CNG కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం అమ్మకాల్లో CNG కార్ల వాటా 11.4శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 12.8 శాతంగా నమోదవడం గమనార్హం.

పెరుగుతున్న CNG స్టేషన్లు: దేశవ్యాప్తంగా CNG స్టేషన్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో.. ఈ అమ్మకాలు కూడా పెరుగుతున్నాయని హ్యుందాయ్ ఇండియా సీఈవో తరుణ్ గార్గ్ అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రస్తుతం 7,000 కంటే ఎక్కువ CNG స్టేషన్లు ఉన్నాయని.. 2030 నాటికి సుమారు ఈ సంఖ్య 17,500కి పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇది CNG డిమాండ్‌కి మరింత మద్దతు కల్పిస్తుందని ఆయన చెప్పారు.
మార్కెట్లో సీఎన్ జీ పోటీ ఎలా ఉందంటే: ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో 72% వాటాతో మారుతీ సుజుకి సీఎన్‌జీ సెగ్మెంట్‌లో ముందు వరుసలో ఉంది. ఈ కంపెనీ నుంచి దాదాపు 12 CNG మోడళ్లు మార్కెట్‌ని శాసిస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే మారుతి మొత్తం అమ్మకాల్లో దాదాపు 28% సీఎన్‌జీ నుంచే రావడం గమనార్హం. ఇక ఈ సంవత్సరం 6 లక్షల యూనిట్లను విక్రయించాలని మారుతి లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక టాటా మోటార్స్ కూడా సీఎన్‌జీ అమ్మకాల్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆ సంస్థ సేల్స్ 21 శాతానికి చేరాయి. గతేడాది ఇదే సమయంలో ఆ సంస్థ అమ్మకాల వాటా కేవలం 16 శాతంగానే ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే రెగ్యూలర్ ఫ్యూయల్ వెహికిల్స్, ఎలక్ట్రిక్ వాహనాల కంటే సీఎన్‌జీ కార్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








