హ్యుందాయ్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు.. టీ తాగేలోపు మీ ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేసుకోవచ్చు.!!
ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors).. భారత్‌లో తన అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచింది. ఇందుకు సంబంధించిన నివేదికను వెల్లడించిన హ్యుందాయ్ మోటార్స్.. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సేవలను విస్తరిస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఐసీఈ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లను కొనడానికి ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. పెరుగుతున్న ఇంధన ఖర్చులు ఓ కారణమైతే.. ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉండటంతో.. క్రమంగా వీటికి ఆదరణ పెరుగుతోంది.

అయితే ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలులో ఉన్న ప్రధాన సమస్య ఛార్జింగ్. వాహనాలకు ఛార్జింగ్ పెట్టేందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో కొందరు వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు హ్యుందాయ్ మోటార్స్ దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్లను పెంచడంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను తీసుకువచ్చింది. ఇక నుంచి హ్యుందాయ్ కస్టమర్లు ఛార్జింగ్ కోసం గంటలు తరబడి వెయిట్ చేయాల్సి ఉండదు.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్‌కు భారత్‌లో అత్యధిక డిమాండ్ ఉంది. ఈ సంస్థ కార్ మోడళ్లను ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ఐసీఈ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ రంగంలో కూడా అడుగుపెట్టిన హ్యుందాయ్ మోటార్స్.. మొదటగా కోనా ఈవీతో ఎలక్ట్రిక్ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ విషయంలో, భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టిన మొదటి కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి.
ఆ తర్వాత భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లు క్రమంగా విస్తరించాయి. ప్రస్తుతం భారతదేశంలో చాలా ఎలక్ట్రిక్ కార్లు అమ్మకానికి ఉన్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో హవా కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్న హ్యుందాయ్ మోటార్స్.. ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్‌ను వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలను విస్తరిస్తోంది. దీని ప్రకారం, హ్యుందాయ్ మోటార్స్ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 11 హ్యుందాయ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను సంస్థ తీసుకువచ్చింది. ఈ అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు 3 విభిన్న ఛార్జింగ్ పాయింట్‌లను కలిగి ఉండగా.. వీటిలో ఒకటి 150 kW ఛార్జర్. ఈ బ్యాటరీ ద్వారా ఛార్జింగ్ చాలా స్పీడ్ అవుతుంది. మిగిలిన రెండు ఛార్జర్లు 60 kW మరియు 30 kW సామర్థ్యం కలిగి ఉంటాయని సంస్థ తెలిపింది.
అయితే ఛార్జర్ సామర్థ్యం తక్కువగా ఉంటే.. చార్జింగ్ పూర్తవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సమస్యను నివారించేందుకు ఈ 3 రకాల డీసీ ఛార్జర్లను ప్రవేశపెట్టింది. 30 KW ఛార్జర్‌పై యూనిట్‌కు రూ. 18, 60 KW ఛార్జర్‌పై రూ. 21 మరియు 150 KW ఛార్జర్‌పై రూ. 24 ఖర్చు అవుతుంది.
మొదటగా హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, పూణే, అహ్మదాబాద్ మరియు గురుగ్రామ్ నగరాల్లో హ్యుందాయ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉంది. అదేవిధంగా.. ఢిల్లీ-చండీగఢ్, ఢిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబయి-సూరత్ మరియు ముంబయి-నాసిక్ ఇలా 5 జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు హ్యుందాయ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ల యొక్క మరో విశేషం ఏమిటంటే, ఇవి హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కాకుండా ఇతర బ్రాండ్ల ఎలక్ట్రిక్ కార్లను కూడా ఛార్జ్ చేస్తుంది. కాఫీ షాప్‌లు మరియు రెస్టారెంట్ల దగ్గర తగినంత మంది సిబ్బందితో ఇటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాలను పెద్ద సంఖ్యలో తెరవాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా యోచిస్తోంది.
దీని ద్వారా వాహనదారులు కాఫీ, టీ లేదా భోజనం ముగించేలోపు వారు తమ కారును ఛార్జ్ చేసుకోవచ్చని హ్యుందాయ్ వెల్లడించింది. హ్యుందాయ్ యొక్క ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఐయోనిక్ 5 ఈ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 21 నిమిషాల్లో 10 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని స్పష్టం చేసింది.
వాహనదారులు MyHyundai యాప్ ద్వారా తాము వెళ్లే రూట్లలో ఛార్జింగ్ స్టేషన్‌లను కనుగొనడానికి, వాటికి నావిగేట్ చేయడానికి, ఇంకా ఛార్జింగ్ స్లాట్‌లను ముందే బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసుకోవడంతో పాటు.. ఛార్జింగ్ స్టేటస్‌ను పర్యవేక్షించుకోవచ్చు. ఈ ఏడాది, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను మరో పది పెంచాలని చూస్తున్న సంస్థ.. 2027 నాటికి 100 ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని యోచిస్తోంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే, దేశవ్యాప్తంగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లు ఉండాల్సిన అవసరం ఉంది. తద్వారా.. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసి సుదూర ప్రయాణాలు చేయగలరు. ఈ విషయంలో, హ్యుందాయ్ మోటార్ ఇండియా 11 కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.


Click it and Unblock the Notifications








