దసరా, దీపావళికి ఇతర కంపెనీలకు ముచ్చెమటలు పట్టించిన హ్యుందాయ్.. కంపెనీ చరిత్రలో మూడో రికార్డు
దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్(Hyundai Motors India Limited) పండుగల సీజన్‌ను ఉపయోగించుకుని మెరుగైన అమ్మకాలను నమోదు చేసింది. దేశంలో దసరా, దీపావళి సందర్భంగా అక్టోబర్ నెలలో కంపెనీ అమ్మకాల ద్వారా భారీ లాభాలను సాధించింది. ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, హ్యుందాయ్ అక్టోబర్ నెలలో మొత్తం 70,078 వాహనాలను విక్రయించింది. ఇది కంపెనీ చరిత్రలో నెలవారీ అత్యధిక విక్రయాల్లో మూడోది. ఇప్పటికే ఇతర కంపెనీలు కూడా ఈ సీజన్‌లో మెరుగైన విక్రయాలను నమోదు చేయగా వాటికి గట్టి పోటీ నిస్తూ, హ్యుందాయ్ మోటార్స్ వాటి కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది.
హ్యుందాయ్ డేటాను పరిశీలించినట్లయితే అక్టోబర్ 2024లో దేశీయ విక్రయాలు 55,568 యూనిట్లుగా ఉన్నాయి. కంపెనీ ఇండియాలో కార్యకలాపాలు మొదలుపెట్టిన తరువాత రికార్డు స్థాయిలో ఇది మూడవ అత్యధిక రేటు కావడం గమనార్హం. ఇది అక్టోబర్ 2023తో పోలిస్తే 0.8 శాతం స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. దేశీయంగానే కాకుండా ఎగుమతులు సైతం పుంజుకున్నాయి. అక్టోబర్ నెలలో మొత్తం 14,510 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది.

ఇవి గత ఏడాదితో పోలిస్తే ఎగుమతుల విక్రయాలు 8.6 శాతం వృద్ధిని సాధించాయి. ఇతర దేశాల్లో హ్యుందాయ్‌కు ఉన్న డిమాండ్‌ను ఇది ప్రతిబింబిస్తుంది. ఇతర కంపెనీలతో పాటు భారత్‌లో తయారైన వేరియంట్లకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం కారణంగా ఇక్కడి నుంచి ఎగుమతులు గత కొంత కాలంగా భారీగా వృద్ధి చెందుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎగుమతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వాహనాలతో పాటు అక్టోబర్ 2024లో కంపెనీ మొత్తం 8,261 యూనిట్ల కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్‌జీ) మోడల్‌లను విక్రయించింది. దేశీయ విక్రయాలకు ఇది దాదాపు 14.9 శాతం తోడ్పాటు అందించింది. ఇతర కంపెనీలు పండుగ సీజన్‌తో పాటు అనేక ప్రత్యేక ఎడిషన్ మోడళ్లను విడుదల చేయగా, హ్యుందాయ్ మాత్రం ఎలాంటి సీఎన్‌జీలను విడుదల చేయలేదు. అయినప్పటికి పాత మోడల్ అమ్మకాలు మాత్రం బాగా పెరిగాయి.

ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, కంపెనీ అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా 20,000 ఈవీలను విక్రయించింది. అదే సమయంలో SUV అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నెలవారీ SUV అమ్మకాలు 37,902 యూనిట్లుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా ఇతర కంపెనీలు అయినటువంటి మారుతీ గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి వాటికి పోటీగా, మిడ్-సైజ్ SUV క్రెటా మాత్రమే గత నెలలో 17,497 యూనిట్లను విక్రయించింది.
ప్రస్తుతం, హ్యుందాయ్ క్రెటా(creta) బ్రాండ్ అత్యధికంగా అమ్ముడవుతున్న వేరియంట్‌గా ఉంది. స్టాండర్డ్, ఎన్-లైన్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న మిడ్-సైజ్ SUV ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం రూ. 11 లక్షల నుండి రూ. 20.15 లక్షల మధ్య ఉంది. దీని ఆకట్టుకునే డిజైన్, ఫీచర్ల కారణంగా ఇది కస్టమర్ల ఫెవరేట్‌గా ఉంది. ఇది 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ నాలుగు-సిలిండర్ డీజిల్, కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ క్రెటాలో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా త్వరలో విడుదల కాబోతుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈవీ మోడల్ వచ్చే ఏడాది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారును టెస్టింగ్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీని గురించిన మరిన్ని ఫీచర్లు, ధర గురించి వెల్లడించే అవకాశం ఉంది. కంపెనీ త్వరలో మరిన్ని కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.



Click it and Unblock the Notifications








