ఫెస్టివల్స్ లేకున్నా.. ఈ కార్లపై రూ.2 లక్షల వరకు తగ్గింపు.. ఆఫర్లతో ఊరిస్తున్న హ్యుందాయ్
ఇండియాలో ఇటీవల పండుగల సీజన్ ముగిసింది. అక్టోబర్, నవంబర్ నెలలో దేశంలోని చాలా ఆటోమొబైల్ తయారీ కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోడానికి కార్లపై భారీ ఎత్తున తగ్గింపులు, డిస్కౌంట్స్‌ను అందించాయి. దీంతో కొత్త కార్లను కొనుగోలు చేయాలని చూసిన వినియోగదారులు ఈ ఆఫర్లను ఉపయోగించుకుని తక్కువ ధరలో కార్లను తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే పండుగలు ముగిసిన నేపథ్యంలో ఈ ఆఫర్లు ఉండవని భావించినప్పటికీ చాలా కంపెనీలు ఇంకా వాటిని కొనసాగిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి పలు కంపెనీలు ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. ఇప్పటికే దేశీయ దిగ్గజ కంపెనీలు తమ కార్లపై భారీ ఎత్తున తగ్గింపులు అందిస్తున్నాయి.
ఇప్పుడు ఈ జాబితాలో మరో ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ తన పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఎంపిక చేసిన పలు మోడళ్లపై రూ.50,000 నుంచి రూ.2 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. పండగల టైంలో కార్లను కొనుగోలు చేయని వారు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుని బడ్జెట్ ధరలో హ్యుందాయ్ కార్లను సొంతం చేసుకోవచ్చు. కంపెనీ ప్రస్తుతం గ్రాండ్ ఐ10(grand i10), ఐయానిక్ 5(Ioniq 5) వంటి కార్లపై తగ్గింపులను అందిస్తుంది.

హ్యుందాయ్ నుంచి అత్యధికంగా డిమాండ్ కలిగిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడల్ గ్రాండ్ ఐ10పై కంపెనీ దాదాపు రూ.58,000 వరకు తగ్గింపులు అందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈ కారుకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఇది ప్రధానంగా టాటా టియాగో, మారుతి స్విఫ్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది. ఇటీవలి ఫెస్టివల్ టైంలో కారు మంచి అమ్మకాలను నమోదు చేయగా, 2024 స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీ ఈ తగ్గింపును అందిస్తుంది.
ఈ మోడల్‌తో పాటు కంపెనీ ఆరా(Aura)పై కూడా ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. ఇది ఎక్కువగా ట్యాక్సీలాగా ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. దీనిపై హ్యుందాయ్ దాదాపు రూ.33,000 విలువైన తగ్గింపు ప్రయోజనాలు అందిస్తుంది. దేశంలో ఆరా కారుకు మంచి డిమాండ్ ఉంటుంది. పండుగ టైంలో దీన్ని కొనుగోలు చేయడం మిస్ అయిన వారు కొత్త ఏడాదికి ముందు ఆఫర్‌ను వాడుకుని తక్కువ ధరకే ఆరాను సొంతం చేసుకోవచ్చు.
హ్యుందాయ్ మైక్రో-SUVగా పేరుగాంచిన ఎక్సెటర్(Exter) ఈ ఏడాది ముగింపు నెలలో రూ.48,000 విలువైన తగ్గింపు ప్రయోజనాలతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. అలాగే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20(i20)మోడల్‌పై కూడా తగ్గింపులు ఉన్నాయి. కంపెనీ పేర్కొన్న దాని ప్రకారం, ఈ మోడల్‌పై దాదాపు రూ.55,000 విలువైన తగ్గింపు ఆఫర్ ఉంది. ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది కూడా ప్రధానమైనది.
ఇంకా, ఎలక్ట్రిక్ కారుపై కూడా కంపెనీ తగ్గింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. హ్యుందాయ్ ఐయానిక్ 5(Ioniq 5) పై దాదాపు రూ.2 లక్షల క్యాష్ తగ్గింపును అందిస్తుంది. ప్రస్తుతం ఈవీ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ మొత్తంలో తగ్గింపును అందించడం ద్వారా ఈ మోడల్ అమ్మకాలు పుంజుకుంటాయని కంపెనీ భావిస్తోంది. ఈ కారు విషయానికి వస్తే, ఇది ఇండియాలో ప్రముఖ ఈవీగా ఉంది.
దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఇది రూ. 46.05 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బ్యాటరీ పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులో శక్తివంతమైన 72.6 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది పూర్తి ఛార్జింగ్‌తో దాదాపు 631 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ 18 నిమిషాల్లో 10-80 శాతం నుండి ఛార్జ్ అవుతుంది.


Click it and Unblock the Notifications








