హ్యుందాయ్ సంచలనం.. అతి తక్కువ ధరలో ఏకంగా 4 ఈవీ కార్లు
హ్యుందాయ్ మోటార్స్ భారత్‌లో తన అమ్మకాలను పెంచుకోడానికి ఇతర కంపెనీలకు పోటీగా అదిరిపోయే ఫీచర్లతో కొత్తగా ఎలక్ట్రిక్(Ev) కార్లను విడుదల చేయాలని చూస్తుంది. ప్రస్తుతం కంపెనీ దేశంలో ఐయోనిక్ 5 అనే ఈవీ కారును విక్రయిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 46.05 లక్షల వద్ద ఉంది. అయితే దీని ధర ఎక్కువగా ఉండటం వలన ధనవంతులు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. సాధారణ ప్రజలు ఇంత మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాస్ మార్కెట్‌లో అడుగుపెట్టి సామాన్య ప్రజలకు సైతం తక్కువ ధరలో తన ఈవీ వాహనాలను అందించడానికి త్వరలో నాలుగు ఈవీ కార్లను లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది.
హ్యుందాయ్ 2019లో కోనా ఎలక్ట్రిక్‌ను తీసుకొచ్చింది. ఆ తరువాత ఈ ఏడాది జూన్‌లో దాన్ని నిలిపివేసింది. దీని తరువాత ఐయోనిక్ 5ను 2023లో లాంచ్ చేసింది. కానీ భారత మాస్ మార్కెట్‌లో ఈవీ విభాగంలో కంపెనీ ఇప్పటివరకు తన స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. దీంతో ఇప్పుడు మధ్యతరగతి ప్రజల్లో ఆదరణ పెంచుకోవడానికి క్రెటా EV కార్లను తీసుకురావాలని చూస్తుంది.

భారీ అంచనాలతో వస్తున్న హ్యుందాయ్ క్రెటా EV దేశంలో 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రారంభ ధర సుమారు రూ. 18 లక్షల వరకు ఉంటుందని సమాచారం. దీని తరువాత హ్యుందాయ్ చాలా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారును అమ్మకానికి తీసుకొస్తుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఇది హ్యుందాయ్ ఎక్స్‌టర్ EV. ఈ ఎలక్ట్రిక్ కారును కేవలం రూ.10 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ ఎలక్ట్రిక్ కారు 2026 ద్వితీయార్థంలో విడుదల అవుతుంది. ఇది కాకుండా హ్యుందాయ్ మరో 2 ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. వీటిలో హ్యుందాయ్ వెన్యూ EV ఒకటి. దీని ప్రారంభ ధర రూ.12 లక్షల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

దీనితో పాటు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఎలక్ట్రిక్ కారు కూడా త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ముఖ్యంగా ఈ మోడల్ ప్రారంభ ధర రూ.8 లక్షల వరకు ఉండనుంది. ప్రస్తుతం విక్రయిస్తున్న 4 మోడల్‌లు హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ ఎక్స్‌టర్, హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌లోనే వీటికి కొనసాగింపుగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లను భారత్‌లో అమ్మకానికి తీసుకురాబోతుంది.
క్రెటా EVతో ప్రారంభించి, తర్వాత విడతల వారీగా మిగిలిన ఈవీలను హ్యుందాయ్ విడుదల చేస్తుంది. టాటా మోటార్స్ కూడా సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాలను లాంచ్ చేస్తూ, వాటికి కొనసాగింపుగా ఈవీలను లాంచ్ చేస్తుండగా, ఇదే వ్యూహాన్ని హ్యుందాయ్ సైతం పాటిస్తుంది.
ముఖ్యంగా హ్యుందాయ్ టాటా మోటార్స్‌తో పోటీ పడాలని యోచిస్తోంది. కంపెనీ విడుదల చేయబోయే నాలుగు ఈవీ కార్లు కూడా టాటా కంపెనీకి చెందిన ప్రముఖ కార్లకు పోటీగా వస్తున్నాయి. హ్యుందాయ్ వెన్యూ EV-టాటా నెక్సాన్ EVతో, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ EV-టాటా టియాగో EVతో పోటీపడుతుంది. అలాగే, హ్యుందాయ్ క్రెటా EV- టాటా కర్వ్ EVతో, హ్యుందాయ్ Xter EV-టాటా పంచ్ EVతో పోటీపడనుంది.
భారత్‌లో ఈవీల విభాగంలో హ్యుందాయ్ మోటార్స్ అగ్రస్థానం సంపాదించడానికి తక్కువ ధరలో ఈవీలను లాంచ్ చేయడం కంపెనీకి కీలకం. దేశీయ మార్కెట్‌తో పాటు, భారతదేశంలో తయారు చేసిన EVలను విదేశీ మార్కెట్‌లకు కూడా ఎగుమతి చేయాలని హ్యుందాయ్ యోచిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రలో జనరల్ మోటార్స్ తలేగావ్ ఆధారిత కేంద్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత భారతదేశాన్ని EV తయారీ కేంద్రాలలో ఒకటిగా మార్చాలని హ్యుందాయ్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications








