దీపావళికి మనోళ్ళు చుక్కలు చూపించారు.. రోజుకు లక్షకు పైనే.. భారతీయుల రేంజ్ అంటే ఇది..
దేశంలో దసరా, దీపావళి సెలబ్రేషన్స్ మాములుగా ఉండవు. ఈ టైంలో చాలా మంది కొత్త వాహనాలు కొనుగోలు చేయడం ద్వారా తమకు కలిసి వస్తుందని భావిస్తారు. అందుకే ఇతర సీజన్‌తో పోలిస్తే, అక్టోబర్, నవంబర్ టైంలో వాహనాల విక్రయాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. ముఖ్యంగా దీపావళికి దేశంలో అధిక సంఖ్యలో వాహనాలు అమ్ముడుపోతుంటాయి. ఈ ధోరణి ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై భారీ మొత్తంలో తగ్గింపులు, డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందించడం వంటి కారణాల వలన ఈ అక్టోబర్ నెలలో విక్రయాలు గత ఏడాది కంటే అధికంగా నమోదయ్యాయి. 2023 ఏడాది కంటే కూడా 2024లో ఎక్కువ మంది తమకు నచ్చిన వాహనాలు కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లారు.
ఇటీవల అక్టోబర్ టైంలో జరిగిన వాహన అమ్మకాల గణంకాలను తాజాగా ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ వెల్లడించింది. దీని ప్రకారం చూసినట్లయితే 2024 దీపావళి సందర్భంగా, భారీ మొత్తంలో కొత్త వాహనాలు అమ్ముడుపోయాయి. అనగా, 42 రోజుల్లో దేశవ్యాప్తంగా 43 లక్షల కొత్త వాహనాల విక్రయాలు జరిగాయి. ఈ రేంజ్‌లో అమ్మకాలు నమోదు కావడం అంటే సాధారణ విషయం కాదు.

కచ్చితమైన డేటా ప్రకారం, అక్టోబర్ 3 నుంచి నవంబర్ 13వ వరకు దేశంలో 42,88,248 యూనిట్ల వాహనాలు అమ్ముడుపోయాయి. కొద్ది రోజుల్లోనే ఈ సంఖ్యలో వాహనాల కొనుగోళ్లు నమోదు కావడంతో దేశీయ ఆటోమొబైల్ రంగం ఆశ్చర్యపోయింది. ఇది గత ఏడాది దీపావళి సమయంలో అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 25 వరకు జరిగిన 38.37 లక్షల యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 11.76 శాతం ఎక్కువ.
టూవీలర్స్, త్రీ వీలర్లు, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు వంటి అన్ని విభాగాల్లో కూడా మెరుగైన వృద్ధి కనబడింది. అయితే ట్రాక్టర్ సెగ్మెంట్‌లో మాత్రం విక్రయాలు గత ఏడాది కంటే తగ్గాయి. ప్రధానంగా టూవీలర్ వాహనాలు మాత్రం అధికంగా అమ్ముడుపోయాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ ఎక్కువగా రావడంతో టూ వీలర్ సేల్స్ గత ఏడాది కంటే 11.76 శాతం ఎక్కువ పెరిగాయి.
2023 అక్టోబర్ దీపావళి సమయంలో టూవీలర్ సేల్స్ 29,10,141 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది ఇదే సమయంలో 33,11,325 యూనిట్ల వరకు అమ్మకాలు జరిగినట్లు ఇండస్ట్రీ బాడీ ఫాడా తెలిపింది. ఈ లెక్కన 33 లక్షల మందికిపైగా కొత్తగా టూవీలర్స్‌ను తమ ఇంటికి తీసుకెళ్లారు. వీటి తరువాత ప్యాసింజర్ కార్ల విభాగం కూడా ఎక్కువ అమ్మకాలు నమోదు చేసింది.
ఈ అక్టోబర్ నెలలో 6,03,009 యూనిట్ల ప్యాసింజర్ కార్ల విక్రయాలు జరగ్గా, గత ఏడాది ఇదే నెలలో ఇది 5,63,059 యూనిట్లుగా నమోదైంది. కార్ల అమ్మకాల తర్వాత త్రీవీలర్ విక్రయాలు మూడో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాది ఇవి 1,59,960 యూనిట్ల వరకు అమ్ముడు కాగా, గత ఏడాది ఇది 1,49,764 యూనిట్లుగా నమోదైంది.
వాణిజ్య వాహనాల విక్రయానికి వస్తే, ఈ విభాగం అమ్మకాలు అక్టోబర్ నెలలో మెరుగ్గా ఉన్నాయి. 2023 లో ఇదే నెలలో అమ్మకాలు 1,27,436 యూనిట్ల నుంచి ఇప్పుడు 1,28,738 యూనిట్లకు పెరిగినట్లు ఫాడా వెల్లడించిన డేటా తేలింది. దాదాపు అన్ని విభాగాలు విక్రయాలు గణనీయంగా పెరిగినప్పటికీ వ్యవసాయం రంగంలో కీలకమైన ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం భారీగా తగ్గాయి.
ట్రాక్టర్ విక్రయాలు గత ఏడాది అక్టోబర్‌లో 86,640 యూనిట్లుగా నమోదు కాగా, ఈ సారి మాత్రం 1.64 శాతం తగ్గి 85,216 యూనిట్లకు చేరుకున్నట్లు డేటాలో వెల్లడైంది. మొత్తంగా చూసినట్లయితే ఈ దీపావళి ఆటోమొబైల్ తయారీ దారులకు గుర్తిండిపోయే విధంగా నిలిచింది. రానున్న రోజుల్లో కూడా ఇదే అమ్మకాల ధోరణి కొనసాగే అవకాశం ఉందని ఫాడా ప్రతినిధులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








