భారత్‌లో టెస్లాపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు.. ఆ విషయంలో తగ్గేదే లేదన్న కేంద్ర మంత్రి
అమెరికాకు చెందిన దిగ్గజ ఈవీ తయారీ సంస్థ టెస్లాకు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. టెస్లా కోసం(Piyush Goyal On Tesla) ప్రత్యేకంగా పాలసీలను రూపొందించేది లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. చట్టంలో ఎలాంటి మార్పులు చేయబోమని వెల్లడించారు. ఇంతకీ పీయూష్ గోయల్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
ఆటోమొబైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ ఇప్పుడు మూడో అతిపెద్ద సెక్టార్‌గా అవతరించింది. అమెరికా, చైనాల తర్వాత భారత్‌లోనే అత్యధికంగా వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా దిగ్గజ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా.. భారత మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో టెస్లా(Tesla Cars) విషయంలో భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో టెస్లా అగ్రగామిగా ఉంది. కాగా కంపెనీ కొన్నేళ్ల క్రితం భారత్‌లో కార్లను విక్రయించాలని ప్రయత్నించినా అది కార్యాచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ ఇండియాలో అడుగుపెట్టేందుకు యత్నిస్తోంది. టెస్లా తన కార్లను భారత్‌లో దిగుమతి చేసుకునేందుకు మరియు విక్రయించడానికి ప్రభుత్వ అనుమతి కోరుతోంది. దీంతో పాటు దిగుమతి సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేస్తోంది.
దీంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal On Tesla Cars) కీలక వ్యాఖ్యలు చేశారు. టెస్లా కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా పాలసీలను రూపొందించబోదని ఓ ఇంటర్వ్యూలో గోయల్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులందరినీ ఆకర్షించేలా భారత్‌లో చట్టాలు, టారిఫ్ నిబంధనలను రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.

దేశంలో బ్యాటరీతో నడిచే వాహనాలను ఎక్కువగా వినియోగించడం ద్వారా కర్బన ఉద్గారాలతో పాటు ముడి చమురు ధర బిల్లు తగ్గుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. బలమైన ఈవీ ఎకోసిస్టమ్ అవసరాన్ని ప్రధాని మోదీ ప్రభుత్వం అర్థం చేసుకుందని.. తద్వారా ఏ ఒక్క కంపెనీకి ఉపయోగపడేలా పాలసీలను ప్రభుత్వం తయారు చేయదని స్పష్టం చేశారు.
కాగా విదేశీ కంపెనీలు పూర్తిగా అసెంబుల్ చేసిన ఎలక్ట్రిక్ కారు(Tesla Import Tax)ను భారత్‌లోకి తీసుకువచ్చేందుకు.. 100 శాతం దిగుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే టెస్లా కంపెనీ తక్కువ దిగుమతి సుంకాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే.. వచ్చే కొన్నేళ్లలో భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు టెస్లా సిద్ధంగా ఉంది. ఈ విషయంపై గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది.

దీనిపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏ వ్యక్తిగత కంపెనీకి సంబంధించి ప్రభుత్వం తన చట్టపరమైన నిబంధనలను మార్చదని, అయితే అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహిస్తూనే ఉంటుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
కాగా టెస్లా భారతదేశంలో వాహనాలను విక్రయించాలనుకుంటే, టెస్లా వాహనాలను భారత ప్రజలు ఆమోదిస్తారో లేదో ఇక్కడ పరీక్షించాల్సి ఉంటోంది. ఇందుకోసం తక్కువ-ధర ఎలక్ట్రిక్ వాహనాలను దిగుమతి చేసి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోంది. కానీ కేవలం టెస్లాకు మాత్రమే ఇలాంటి రాయితీలు ఇస్తే దేశీయ తయారీదారులు తీవ్రంగా నష్టపోతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సందర్భంలో, తమకు నిర్దిష్ట కాలానికి మాత్రమే పన్ను రాయితీలు ఇస్తేనే తాము భారతదేశంలో పెట్టుబడులు పెడతామని టెస్లా కంపెనీ పేర్కొంది. దీంతో భవిష్యత్తులో ఎదురయ్యే నష్టాలను దృష్టిలో ఉంచుకుని టెస్లాకు ఎలాంటి దిగుమతి సుంకం రాయితీ ఇవ్వలేమని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
అయితే టెస్లా భారత్‌లో ప్లాంట్‌ను నెలకొల్పాలని భావిస్తే.. దానికి రాయితీలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పీయూష్ గోయల్ అన్నారు. భారత్‌లోకి టెస్లా అడుగుపెడితే.. ఇది ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి ఆరో ప్లాంట్ కానుంది. విదేశీ దేశాల నుంచి పెట్టుబడులుగా భారత్‌కు డబ్బు తీసుకురావడం, ద్రవ్యోల్బణం తగ్గించడం, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించడం, దేశీయ వాణిజ్య సమస్యలను పరిష్కరించడం వంటి పలు ప్రయోజనాలను టెస్లా పొందవచ్చని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications








