ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్‌మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
దేశంలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ.. ప్రజలు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లను కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా అత్యాధునిక సాంకేతికతను కార్లలో ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ.. మాన్యువల్ గేర్‌బాక్స్‌ను ఇప్పటికీ ప్రజలు ఇష్టపడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. పూర్తి సమాచారం ఈ కథనంలో..
భారత్‌లో చాలా మంది కస్టమర్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ల కంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో కార్లనే కొనుగోలు చేస్తున్నారట. ఎందుకంటే ఆటోమేటిక్‌తో పోలిస్తే మాన్యువల్ వేరియంట్ కార్లలో డ్రైవింగ్ అంత సౌలభ్యంగా ఉండదు. ప్రత్యేకించి అధిక ట్రాఫిక్ ఉండే పట్టణ ప్రాంతాల్లో గేర్లు మార్చడం మరియు క్లచింగ్ తరచుగా అవసరం పడుతుంది.

అయినప్పటికీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్(Automatic Gearbox Over Manual Transmission) టెక్నాలజీలో పురోగతి ఉన్నా.. వాహనాల విక్రయాల్లో అత్యధిక భాగం మాన్యువల్ గేర్‌బాక్స్‌లతో కూడిన కార్లదేనట. ఆటోమేటిక్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ, దేశంలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లు ఇప్పటికీ ప్రజాదరణ పొందటానికి కొన్ని కారణాలను ఇక్కడ తెలుసుకుందాం..
ధర: భారత మార్కెట్లో MT తో పోలిస్తే.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో ఉన్న కార్ల ధర ఎక్కువగా ఉంటుంది. డ్యూయల్-పెడల్ టెక్నాలజీతో మాస్-మార్కెట్ మోడల్‌లను అభివృద్ధి చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది. మాన్యువల్ గేర్‌బాక్స్ వేరియంట్ ధరతో పోలిస్తే.. ఏదైనా కారు యొక్క ఎంట్రీ-లెవల్ AMT వేరియంట్ ధర సుమారు రూ. 80,000 ఎక్కువగా ఉంటుంది.

బీమా: ధర పెరిగితే ఆటోమేటిక్‌గా బీమా ఖర్చులు కూడా పెరుగుతాయి. వీటన్నిటి ద్వారా చివరికి కారు చేతికొచ్చేసరికి ఆ కారు ధర కూడా పెరిగిపోతుంది. ప్రధానంగా ఈ వ్యత్యాసం ఎంట్రీ-లెవెల్ వాహనాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఫలితంగా చివరికి కస్టమర్లు.. స్టిక్కర్ ధర మరియు బీమా ఖర్చులపై డబ్బు ఆదా చేసుకునేందుకు మాన్యువల్ వేరియంట్‌లను ఎంచుకుంటున్నారని స్పిన్నీ నివేదిక చెబుతోంది.
మెయింటెనెన్స్: దీంతో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కార్ల నిర్వహణ ఖర్చు.. మాన్యువల్ గేర్‌బాక్స్ వాహనాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ల కంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ల మెకానికల్ సిస్టమ్ కఠినంగా ఉంటుంది. తద్వారా యజమానికి నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంకా మాన్యువల్ గేర్‌బాక్స్ కంటే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌పై ప్రజల్లో నమ్మకం కూడా తక్కువగా ఉంటుంది.

విశ్వసనీయత: ఆటోమొబైల్ రంగంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పోలిస్తే మాన్యువల్ గేర్‌బాక్స్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అందుకే.. ఆ విశ్వసనీయత కారణంగా కస్టమర్లు మాన్యువల్ గేర్‌బాక్స్ కార్లను కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారట. ఇంకా గేర్‌బాక్స్ సమస్య ఏర్పడినప్పుడు, AT కోసం సాంకేతిక నిపుణుడిని కనుగొనడం కంటే MT కోసం మెకానిక్‌ని సంప్రదించడం సులభం.
సమస్యలు: వీటితో పాటు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో వేడెక్కడం మరియు జెర్కీ రైడ్‌లు లాంటి రెండు సాధారణ సమస్యలు తలెత్తుతాయి. రద్దీగా ఉండే ట్రాఫిక్ పరిస్థితుల్లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ని నడిపినప్పుడు ట్రాన్స్‌మిషన్ వేడెక్కుతుంది. ఇంకా డ్రైవ్ మోడ్‌లో ఉన్నప్పుడు డ్రైవర్ బ్రేక్‌పై తన పాదాలను ఉంచడం ద్వారా వేగాన్ని తగ్గించాలి. అయితే మాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న కార్లలో ఈ సమస్యలు ఏర్పడవు.

చివరగా, చాలా మంది కస్టమర్లు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పోలిస్తే మాన్యువల్ గేర్‌బాక్స్‌లనే ఎక్కువగా ఇష్టపడతారని వెల్లడైంది. ఎందుకంటే MT ద్వారా కారు మెకానిజంపై డ్రైవర్‌కు నియంత్రణ ఏర్పడుతుంది. తద్వారా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సులభంగా హ్యాండిల్ చేయగలరు. అందుకే కారు ప్రియులు ఆటోమేటిక్స్ కంటే మాన్యువల్ ట్రాన్స్‌మిషన్లను ఇష్టపడతారని తేలింది. చాలా మంది స్పోర్ట్స్ కారు తయారీదారులు తమ హై-ఎండ్ మోడళ్లలో కూడా మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లను ప్రవేశపెట్టడమే ఇందుకు నిదర్శనం.


Click it and Unblock the Notifications








