చరిత్ర సృష్టించబోతున్న స్టాక్‌మార్కెట్.. దేశంలోనే అతిపెద్ద IPOకు రెడీ
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యూందాయ్ మోటార్ ఇండియా(Hyundai Motor India) దేశంలో అతిపెద్ద ఐపీఓకు(IPO) రావడానికి సిద్ధమైంది. ఇది అక్టోబర్ 14, 2024 నుంచి ప్రారంభమై 17న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.27,870 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు దేశీయ దిగ్గజ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)భారత్‌లో రూ.21 వేల కోట్లతో అతిపెద్ద ఐపీఓ(IPO)గా నిలవగా, ఇప్పుడు దానిని హ్యూందాయ్ మోటార్స్ ఇండియా అధిగమించనుంది. ఈ ఐపీఓలో ఒక్కో షేర్ ధరను రూ.1865-1960 గా నిర్ణయించారు. ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కనీసం ఒక లాట్‌ను రూ.13,720 పెట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్‌లో ఏడు షేర్లు ఉంటాయి.
గరిష్టంగా 14 లాట్లను కొనుగోలు చేయవచ్చు. ముందుగా యాంకర్ ఇన్వెస్టర్లకు అక్టోబర్ 14న సబ్‌స్క్రిప్షన్(subscription) ఓపెన్ అవుతుంది. ఆ తరువాత రిటైల్, ఇతర ఇన్వెస్లర్లు తమ బిడ్‌లను అక్టోబర్ 15 నుండి 17 వరకు దాఖలు చేయవచ్చు. షేర్లను కేటాయింపు అక్టోబర్ 18 నాటికి ఖరారు చేస్తారు.

మొత్తంగా ఈ ఐపీఓలో 14,21,94,700 ఈక్విటీ షేర్లను ఇన్వెస్టర్ల కోసం అందుబాటులో ఉంచారు. దీనిలో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బిడ్డర్లు (QIBలు), 15 శాతం నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NIIలు), 35 శాతం ఇష్యూ రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. ముఖ్యంగా కంపెనీ తన ఉద్యోగులకు సైతం ప్రత్యేకంగా షేర్లను రిజర్వ్ చేసింది. అర్హులైన ఉద్యోగుల కోసం 7,78,400 ఈక్విటీ షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుంది.
ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను కంపెనీ తన రుణాలు, ఇతర అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఇటీవల కాలంలో ఐపీఓకు వచ్చి సక్సెస్ అయ్యాయి. తాజాగా వచ్చిన ఎలక్ట్రిక్(EV) బైక్‌ల తయారీ కంపెనీ ఓలా(OLA)సక్సెస్ కాగా, ఈ నేపథ్యంలో హ్యూందాయ్ మోటార్స్ ఇండియా సైతం అదే బాటలో విజయవంతంగా నిధులను సమీకరించడానికి సిద్ధమైంది.
ఇప్పటికే ఇండియా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉండటంతో ఇతర దేశాలకు చెందిన కంపెనీలు తమ పెట్టుబడులను భారత్‌లో పెట్టడానికి సిద్దమయ్యాయి. ఇలాంటి తరుణంలో హ్యందాయ్ మోటార్ ఇండియా సైతం దేశంలో తన వ్యాపారాన్ని మరింత పెంచుకోడానికి, విస్తరణలో ప్రణాళికలో భాగంగా ఈ ఐపీఓను ఎంచుకుంది.
మార్కెట్లో లిస్టింగ్ అయిన తర్వాత రెండు దశాబ్దాలలో పబ్లిక్ సంస్థగా మారిన మొదటి కంపెనీగా హ్యుందాయ్ మోటార్ ఇండియా నిలవనుంది. భారత్‌లో ఎన్నికల తరువాత స్టాక్ మార్కెట్లు సూచీలు సరికొత్త గరిష్టాలకు చేరుతున్న సమయంలో కంపెనీ మార్కెట్లో లిస్టింగ్‌కు వస్తుండటంతో ఇది కూడా సక్పెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దక్షిణకొరియాకు చెందిన హ్యూందాయ్ మోటార్స్ ఇండియాలో 1996లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇండియాలో ప్యాసింజర్ వాహనాల విక్రయాల పరిమాణంలో మారుతి సుజుకీ తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉంది. కంపెనీ FY23లో రూ.60 వేల కోట్ల ఆదాయం, రూ.4,653 కోట్ల లాభాలతో ముగిసింది.
కంపెనీ దేశంలో 13 మోడళ్లను విక్రయిస్తుంది. అలాగే, 1336 సేల్స్ సెంటర్లు, 1550 సర్వీస్ పాయింట్లను కలిగి ఉంది. దేశీయంగా అమ్మకాలతో పాటు కంపెనీ తన వాహనాలను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంది. తాజాగా వచ్చిన డేటా ప్రకారం, 2024 మార్చి 31 నాటికి దాదాపు 12 మిలియన్ పాసింజర్ వాహనాలను (ఎగుమతులతో కలిపి) విక్రయించింది.


Click it and Unblock the Notifications