స్వదేశీ బ్రాండ్ల సత్తా చాటిన టాటా, మహీంద్రా.. జనవరి కార్ల విక్రయాల్లో హ్యుందాయ్‌కు దిమ్మ తిరిగే షాక్
ఈ ఏడాది జనవరి(January 2024 Cars Sales) నెల కార్ల విక్రయాల గణాంకాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. ప్రత్యర్థులు లేకుండా నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. కాగా ఈ జనవరిలో భారత ఆటో బ్రాండ్లు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రికార్డు సృష్టించాయి.
కరోనా మహమ్మారి తర్వాత ఆటో మొబైల్ రంగం ఊపందుకుంది. వాహనాల విక్రయాలు గణనీయంగా నమోదవతున్నాయి. కొత్త సంవత్సరంలో మొదటి నెలలో దాదాపు 4 లక్షల వాహనాలను విక్రయించడం ద్వారా భారత కార్ల మార్కెట్.. బ్లాక్ బస్టర్ సంవత్సరాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో దాదాపు 2 లక్షల యూనిట్ల సేల్స్‌తో మారుతి సుజుకి(Maruti Suzuki) ఎప్పటిలాగే మొదటి స్థానంలో నిలిచింది.

అయితే గత కొన్నేళ్లుగా కార్ల విక్రయాల్లో రెండవ స్థానంలో కొనసాగుతున్న హ్యుందాయ్ మోటార్స్(Hyundai Motors)ను.. టాటా మోటార్స్, మహీంద్రా మహిమతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ గణాంకాలతో భారతీయ బ్రాండ్లకు స్వదేశంలో ఆదరణ పెరుగుతుండటం శుభ పరిణామంగా చెప్పవచ్చు. కాగా మార్కెట్లో మారుతి సుజుకి 40 శాతం వాటాను దక్కించుకుంది.
టాటా కార్ల(Tata Motors Sales In January 2024) డామినేషన్‌తో హ్యుందాయ్ నాలుగో స్థానంలో నిలిచినా.. మహీంద్రా ఈ సారి మూడో స్థానంలో నిలిచి సత్తా చాటింది. హ్యుందాయ్ మోటార్స్ సేల్స్ తగ్గింపోవడంతో కొరియన్లకు షాకింగ్‌గా మారింది. కాగా భారత బ్రాండ్లు టాటా, మహీంద్రా.. కొరియన్ బ్రాండ్ దిగ్గజాన్ని అధిగమించడం ఇదే తొలిసారి.

జనవరి 2024లో మారుతి సుజుకి 1.99 లక్షల యూనిట్లను విక్రయించగా.. టాటా మోటార్స్ మొత్తం 84,276 కార్లను విక్రయించింది. ఈ గణాంకాలు మొత్తం ఎగుమతులతో కలిపి ఉన్నాయి. వీటిలో 54,000 కార్లను స్వదేశంలో విక్రయించింది. కాగా జనవరి 2023లో విక్రయించిన 79,681 యూనిట్లతో పోలిస్తే, 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ఈ క్రమంలో అమ్మకాల పరంగా దేశీయ వాహన తయారీదారులకు జనవరి 2024 ఆశాజనకంగా నిలిచింది. కాగా టాటా Nexon మరియు Punch SUVలు టాటా అమ్మకాల్లో ఎక్కువ భాగం అందించాయి. ఈ రెండు ప్రసిద్ధ SUVలు ఈ ఏడాది జనవరిలో 17,000 యూనిట్లకు పైగా సేల్స్‌ను నమోదు చేశాయి.

ఇక మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 2024లో ఎగుమతులతో సహా మొత్తం వాహన విక్రయాలు 73,944 యూనిట్లుగా నమోదైనట్లు ప్రకటించింది. గతేడాది జనవరితో 15 శాతం ఎక్కువ వృద్ధి నమోదు చేసింది. జనవరిలో మహీంద్రా మొత్తం 43,866 యుటిలిటీ వాహనాలను విక్రయించింది. స్కార్పియో N మరియు XUV700 SUVలకు భారీ డిమాండ్ కారణంగా మహీంద్రా మూడో స్థానంలో నిలిచింది.
చివరిగా హ్యుందాయ్ మోటార్స్.. చాలా సంవత్సరాలుగా భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా కొనసాగుతుంది. కాగా ఈ ఏడాది జనవరిలో రెండవ స్థానాన్ని కోల్పోయినప్పటికీ, కొరియన్ కంపెనీ గతేడాది జనవరితో పోలిస్తే ఈసారి 8 శాతానికి పైగా వృద్ధి నమోదు చేసింది. దేశీయ విక్రయాలు మరియు ఎగుమతులతో కలిపి, హ్యుందాయ్ గత నెలలో మొత్తం 67,615 యూనిట్లను విక్రయించింది.

కాగా జనవరి 2023లో హ్యుందాయ్ మోటార్స్ 62,276 యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ 57,115 యూనిట్ల విక్రయాలతో దేశీయ మార్కెట్లో అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేసింది. ఇటీవల లాంచ్ చేసిన క్రెటా ఫేస్‌లిఫ్ట్‌కు ఆదరణ లభించడంతో సంస్థ లాభపడింది. అంతే కాకుండా సబ్-4 మీటర్ల SUV, వెన్యూ కూడా మంచి సేల్స్‌ను సాధించింది.
భారతీయ ఆటో కంపెనీలు టాటా మరియు మహీంద్రా.. ఇటీవలి కాలంలో ఉత్పత్తిని పెంచడం ఇంకా కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా సేల్స్ పరంగా గణనీయమైన వృద్ధిని సాధించాయి. IC ఇంజిన్ మోడళ్లతో పాటు, టాటా ఎలక్ట్రిక్ కార్లు కూడా బాగా అమ్ముడవతున్నాయి. ఇప్పటికే టాటా నాలుగు మోడళ్లను కలిగి ఉండగా.. కాంపాక్ట్ EVల కోసం కొత్త Acti.ev ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని మోడల్‌లు లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.

ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో Curvv ICE మోడల్‌తో పాటు, హారియర్ EV ని టాటా ప్రదర్శించింది. అంతే కాకుండా మహీంద్రా తన లైనప్‌లో చాలా మోడళ్లను కలిగి ఉంది. XUV700, థార్ మరియు స్కార్పియో వంటి అనేక కొత్త-జెన్ SUVలతో సెగ్మెంట్‌ను స్వాధీనం చేసుకుంది. త్వరలో థార్ SUV యొక్క 5-డోర్ వెర్షన్‌తో పాటు, కొన్ని ఎలక్ట్రిక్ కార్లు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








