ప్రతిరోజు 50 మంది బుక్ చేసుకున్న కారు ఇదే.. ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్.. ఇప్పటికే 400 మందికి డెలివరీ..
మార్కెట్లోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే దిగ్గజ కంపెనీలకు పోటీ నిస్తూ, వాటి కంటే ఎక్కువ సేల్స్‌ను సాధిస్తూ భారత్‌లో ప్రముఖ వాహన తయారీ కంపెనీగా అవతరించిన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఈ ఏడాదిలో పలు కొత్త వాహనాలు లాంచ్ చేసి విజయవంతంగా సేల్స్ సాధిస్తుంది. కియా నుంచి వస్తున్న కార్లు నాణ్యమైనవిగా ఉండటం, అన్ని వర్గాల వారికి అనువుగా ఉండే ధరల్లోనే లభించడం వలన ఈ కంపెనీ వాహనాలకు భారత్‌లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇదిలా ఉంటే కియా నుంచి ఇటివల విడుదలైన సరికొత్త కార్నివాల్ లిమోసిన్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. లాంచ్ అయిన కొద్ది కాలంలోనే బెస్ట్ కారుగా నిలిచింది. కస్టమర్ల నుంచి మెరుగైన బుకింగ్స్ సాధించింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో దాదాపు ఆరు నెలల వెయిటింగ్ పిరియడ్‌ను ప్రకటించింది. ఇప్పుడు కంపెనీ వేగంగా కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించింది.
కియా ఇండియా నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం, సరికొత్త కార్నివాల్‌ను రెండు నెలల్లోనే 400 యూనిట్లను కస్టమర్లకు డెలివరీ చేసింది. కారు లాంచ్ అయినప్పటి నుంచి దాదాపు 3500 మంది దీన్ని బుకింగ్ చేసుకున్నారు. వేగంగా డెలివరీ చేయడానికి ప్లాంట్‌లలో ఉత్పత్తిని కూడా పెంచింది. కార్నివాల్ లిమోసిన్ విలాసవంతమైన కారు. కియా కంపెనీ మొదటగా 2019లో సెల్టోస్ కారుతో ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది.

ఈ కారుకు ప్రజల్లో మంచి ఆదరణ రావడంతో ఆ తర్వాత ఏడాది 2020లో కార్నివాల్‌ను తీసుకువచ్చింది. ఇది పెద్దగా ఎక్కువ మంది కలిసి ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఈ మోడల్ కూడా మంచి అమ్మకాలను నమోదు చేసింది. కొన్ని సంవత్సరాల తరువాత ఈ కారు అమ్మకాలను నిలిపివేసి, 2024 అక్టోబర్ నెలలో అప్‌డేటెడ్ కార్నివాల్ పేరుతో తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది పొడుగ్గా ఉంటుంది. అందుకే దీన్ని లిమోసిన్ అంటారు.
సరికొత్త కార్నివాల్ లిమోసిన్ రూ. 63.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల అయింది. ఇది గ్లేజియర్ వైట్ పెర్ల్, డీప్ బ్లాక్ లేదా కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ధర ఎక్కువగా ఉన్నట్లుగానే లోపల కూడా అధునాతన ఫీచర్లను అందించారు. ముఖ్యంగా రెండో వరుస సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కాళ్లకు సపోర్ట్ కోసం విలాసవంతమైన స్థలం ఉంటుంది. ఈ సదుపాయం లగ్జరీ కార్లలో ఉండే విధంగా ఉంటుంది.

సరికొత్త కార్నివాల్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 193 PS పవర్‌ను, 441 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సెటప్‌ను జత చేశారు. లోపల లేటెస్ట్ ఫీచర్లను అందించారు. క్యాబిన్‌లో 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టం, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటివి ఉన్నాయి.
7 సీటర్ ఆప్షన్‌తో వచ్చిన ఈ కారులో మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ పనోరమిక్ కర్వ్డ్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు వంటి సదుపాయాలను అందించారు. ప్రయాణికుల రక్షణ కోసం ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అదనంగా ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, EBDతో కూడిన ABS సిస్టం, పార్కింగ్ సెన్సార్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్, చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ADAS వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

కియా సరికొత్త కార్నివాల్ లిమోసిన్ కారును బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు మరింత వేగంగా డెలివరీ చేయడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది. లాంచ్ అయిన రెండు నెలల కాలంలోనే 400 మందికి కారును అందించడం విశేషం. కియా ఇండియా ఉన్నతాధికారి మాట్లాడుతూ, కస్టమర్లకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తున్నాము. త్వరలో మరిన్ని డెలివరీలు చేస్తామని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications








