Kia Syros కియా నుంచి మరో కొత్త కారు విడుదల.. బుకింగ్స్, డెలివరీలు తేదీలు చెక్ చేశారా?
కియా సైరోస్ నేడు అధికారికంగా మార్కెట్‌లో అడుగుపెట్టింది. కియా సెల్టోస్, సోనెట్, కియా కేరన్స్, కియా కార్నివల్ తర్వాత ఈ సైరోస్ భారతీయ మార్కెట్‌లో నేరుగా విడుదల అయ్యింది. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇప్పటికే కియా కార్లు గట్టి పోటీని ఇస్తున్నాయి. తాజాగా విడుదలైన ఈ సైరోస్ పోటీని మరింత తీవ్రతరం చేయనుంది. ఈ కొత్త మోడల్‌కి సంబంధించిన బుకింగ్స్ జనవరి 3, 2025 న ప్రారంభం కానున్నాయి. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త కారుకి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లతో ఈ సైరోస్ వచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోనెట్‌తో పోలిస్తే ఈ కారు యూత్‌తో పాటు ప్రీమియం ఫీచర్లకు కోరుకునే కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకోనుంది. ఈ రెండు కార్లు ఒకే విధమైన కొలతలను కలిగి ఉన్నప్పటికీ.. సైరోస్ భిన్నమైన స్టైలింగ్‌తో వస్తుంది. ఓ విధంగా ఇది కియా డిజైన్ 2.0 ఫిలాసఫీకి అద్దం పడుతుంది.

డిజైన్: సైరోస్ ఎక్స్‌టీరియర్‌లో వర్టికల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ (DRLs), స్ట్రాంగ్ ఫ్రంట్ బంపర్‌తో ఆకర్షణీయమైన ఫేసింగ్‌ని కలిగి ఉంది. దీని సైడ్ ప్రొఫైల్‌లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్లాట్ రూఫ్‌లైన్‌ని కలిగి ఉంది. ఇక వెనుక భాగంలో హై మౌంటెడ్ L ఆకారంలో ఉండే LED టెయిల్ లైట్స్ చుట్టి రూఫ్‌లైన్‌కి కనెక్ట్ అవుతాయి.
ఇంటీరియర్ ఫీచర్లు: సైరోస్ 30-ఇంచెస్ ట్రినిటీ పనోరమిక్ డ్యూయల్ స్క్రీన్ సెటప్‌ని కలిగి ఉంటుంది. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. ఇవి వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేలను ఈ సిస్టమ్‌కి సపోర్ట్ చేస్తాయి. ముందు అలాగే వెనుక ప్రయాణీకుల కోసం వెంటిలేటెడ్ సీట్స్ మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

వీటితో పాటు స్లైడింగ్, రిక్లైనింగ్ రెండవ వరుస సీట్ల ద్వారా నచ్చిన విధంగా కూర్చోవచ్చు. పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ ఇంజిన్ ఫంక్షనాలిటీ, 360-డిగ్రీల పార్కింగ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్ కెపాసిటీ, ట్విన్ USB-సి పోర్ట్స్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అదనపు ఇంటీరియర్ ఫీచర్లు కారుకి అదనపు లుక్‌ని అందిస్తాయి.
సేఫ్టీ అండ్ స్పెసిఫికేషన్స్: అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) లెవల్ 2 టెక్నాలజీతో ఈ కారు వస్తుంది. కావున ఇందలే లేన్ కీప్ అసిస్ట్‌తో పాటు 16 అడాప్టివ్ ఫీచర్లు కలవు. హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ వంటివి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ సైరోస్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.

పెట్రోల్ వేరియంట్ లోని 1.0-లీటర్ మూడు సిలిండర్ల టర్బో ఇంజిన్ 118 bhp, 172 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ జతచేయబడి ఉంటుంది. ఇక 1.5-లీటర్ డీజల్ ఇంజిన్ 116 bhp పవర్‌ని, 250 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
కియా మోటార్స్ ప్రస్తుతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఈ కారుని సెల్టోస్‌కి ఎక్కువగా సోనెట్‌కి సరిపోయే విధంగా తీసుకువచ్చింది. ఇది మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా లేదా మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇస్తుందని భావిస్తున్నారు. వేరియంట్ల వారిగా దీని ధరలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications








