అస్సలు తగ్గని డిమాండ్.. భారత్‌లో ఇప్పటికీ ఈ కారును ఎగబడి కొంటున్నారు!
మహీంద్రా థార్.. ఈ పేరు వింటేనే చాలామంది ఆఫ్ రోడింగ్ చేసేవారి మనసు పులకించి పోతుంది. ఎందుకంటే ఇది రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా కఠినమైన భూభాగాల్లో కూడా డ్రైవింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీంతో ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటికి కూడా ఈ కారు కోసం వెరీయింగ్ పీరియడ్ భారీగా ఉందంటే.. మార్కెట్లో థార్ SUVకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కథనంలో మహీంద్రా థార్ 'మే 2024' అమ్మకాల గురించి వివరంగా తెలుసుకుందాం..
ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలతో ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించడంలో విజయం సాధించిన మహీంద్రా కంపెనీ యొక్క 'థార్'.. మే 2024లో కూడా మంచి అమ్మకాలను పొందగలిగింది. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం థార్ గత నెలలో ఏకంగా 5750 యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. మార్కెట్లో విడుదలై సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ మంచి అమ్మకాలు పొందుతుందంటే? మార్కెట్లో థార్ SUVకు ఉన్న ఆదరణ అంతా.. ఇంతా కాదు.

మే 2024లో అమ్ముడైన మొత్తం అమ్మకాల్లో 5207 యూనిట్లు డీజిల్ వేరియంట్స్ కాగా.. కేవలం 543 యూనిట్లు మాత్రమే పెట్రోల్ మోడల్స్. గత సంవత్సరం ఇదే నెలలో కంపెనీ 3190 డీజిల్ యూనిట్లను, 1106 పెట్రోల్ యూనిట్లను విక్రయించింది. అమ్మకాల్లో పెరుగుదల కనిపించినప్పటికీ.. మహీంద్రా థార్ యొక్క పెట్రోల్ మోడల్స్ కొనుగోలు చేయడానికి కస్టమర్లు సుముఖత చూపడంలేదని తెలుస్తోంది.
మే 2023 మహీంద్రా థార్ సేల్స్ కొంత తగ్గినప్పటికీ పెట్రోల్ మరియు డీజిల్ మోడళ్లు రెండూ ఓ స్థాయిలో అమ్ముడైనట్లు తెలుస్తోంది. అయితే మే 2024 అమ్మకాల్లో వృద్ధి కనపడినప్పటికీ.. పెట్రోల్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. పెట్రోల్ మరియు డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం థార్ డీజిల్ మోడల్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఇక్కడా స్పష్టంగా అర్థమవుతోంది.

మహీంద్రా థార్ ఉత్పత్తిని కంపెనీ కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం సంస్థ థార్ 5 డోర్ మోడల్ సిద్ధం చేయడానికి సన్నద్ధమవడమే. కంపెనీ మహీంద్రా థార్ 5 డోర్ మోడల్ లాంచ్ చేసిన తరువాత.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న మారుతి సుజుకి జిమ్నీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరిస్తోంది. మారుతి సుజుకి యొక్క జిమ్నీ కూడా ఆఫ్ రోడర్ SUV.
రాబోయే మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ వచ్చే ఆగస్టు 15న.. అంటే భారత్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది చూడటానికి దాదాపు స్టాండర్డ్ మహీంద్రా థార్ మాదిరిగా ఉన్నప్పటికీ.. పరిమాణం పరంగా ఇది కొంత ఎక్కువ పొడవును కలిగి ఉంటుందని తెలుస్తోంది.

భారతదేశంలో ఆఫ్ రోడర్ విభాగంలో మహీంద్రా థార్ చెప్పుకోదగ్గ మోడల్. ఇప్పటి వరకు మార్కెట్లో ఎన్ని ఆఫ్ రోడర్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. థార్ SUVకి మాత్రమే ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. కాబట్టి మహీంద్రా థార్ SUVకి గట్టి పోటీ ఇవ్వాలంటే.. థార్ కారును తలదన్నే మోడల్ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మార్కెట్లో అలాంటి మోడల్ లేదు. భవిష్యత్తులో వస్తుందా? రాదా? అనేది ఖచ్చితంగా చెప్పలేము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








