అస్సలు అర్థం కానీ జనాలు.. సెప్టెంబర్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆ 7-సీటర్ కారుని తెగ కొనేశారు!
గత నెల 2024 సెప్టెంబర్‌లో ఎక్కువగా అమ్ముడైన కార్ల సేల్స్ రిపోర్ట్ విడుదల అయ్యింది. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం మారుతి ఎర్టిగా ఎంపీవీ (Maruti Ertiga) అత్యధింకంగా అమ్ముడైన కారుగా నిలిచింది. 2024 ఆగస్టు నెలలో అత్యధికంగా అమ్ముడైన కారుగా టాటా పంచ్ (Tata Punch) సెప్టెంబర్‌లో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇది ఆటోమొబైల్ రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆగస్టులో టాప్ ప్లేస్‌ని కోల్పోయిన మారుతి సుజుకి తిరిగి సెప్టెంబర్‌లో తిరిగి సింహాసనాన్ని కైవసం చేసుకుంది. కానీ ఈ సారి ఎవ్వరూ ఊహించని విధంగా ఎర్టిగా (Maruti Ertiga) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ స్టోరీలో గత నెలలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల సేల్స్ వివరాలు మీకోసం..
ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన మారుతి ఎర్టిగా7-సీటర్ ఎంపీవీగా ఉంది. మంచి పవర్‌ట్రైన్, భారీ మైలేజ్ అందించడంతో ఇది గత కొన్ని నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది. ఈ మారుతి ఎర్టిగా లీటరుకు 26 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ముఖ్యంగా ఎర్టిగా సీఎన్‌జీ వెర్షన్స్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. సెప్టెంబర్‌లో మొత్తం 17,441 యూనిట్ల అమ్మకాలతో ఇది అగ్రస్థానంలో నిలిచింది.

ఇదే కారు గత ఏడాది సెప్టెంబర్‌లో 13,528 యూనిట్లను మాత్రమే విక్రయించింది. దీని వార్షిక వృద్ధి రేటు 29 శాతంగా ఉంది. టాప్ 10 కార్ల జాబితాలో అత్యధిక వార్షిక వృద్ధిని సాధించిన మోడల్‌గా కూడా మారుతి ఎర్టిగా నిలిచింది. దీని తర్వాత మారుతి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ గత నెలలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కారుగా నిలిచింది. స్విఫ్ట్ అమ్మకాలు 2023 సెప్టెంబరులో 14,703 యూనిట్లు అమ్ముడు పోయాయి.
ఇక ఈ ఏడాది 16,241 యూనిట్లకు దీని సేల్స్ పెరిగాయి. ఈ ఏడాది మే నెలలో న్యూ జనరేషన్ వెర్షన్ విడుదలతో స్విఫ్ట్ అమ్మకాలు 10.46 శాతం వృద్ధిని సాధించాయి. ఈ స్విఫ్ట్‌ని తాజాగా సీఎన్‌జీ వెర్షన్‌లో విడుదల చేశారు. ఇది లీటరుకు 32 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా క్రెటా ఉంది. హ్యుందాయ్ గత నెలలో మొత్తం 15,902 క్రెటా యూనిట్లను విక్రయించింది. 2023 సెప్టెంబర్‌లో విక్రయించిన 12,717 యూనిట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదు చేసింది.
ఈ తర్వాతి స్థానంలో మారుతి బ్రెజా ఈసారి నాల్గవ స్థానంలో నిలిచింది. ఆగస్టులో మొదటి స్థానంలో నిలిచిన బ్రెజా.. సెప్టెంబర్‌లో కేవలం 15,322 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఇదే కారు గత ఏడాది విక్రయించిన 15,001 యూనిట్లతో పోలిస్తే ఇది 2 శాతం అధికం.

మహీంద్రా స్కార్పియో N క్లాసిక్ మోడళ్లు 14,438 యూనిట్ల అమ్మకాలతో ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. గత ఏడాది 11,846 యూనిట్లతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. టాటా మోటార్స్‌ని అధిగమించేందుకు మహీంద్రా మూడో స్థానానికి చేరుకోవడానికి దోహదపడిన మోడళ్లలో స్కార్పియో ఒకటిగా ఉంది.
మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉంది. బాలెనో గత నెలలో 14,292 యూనిట్లను విక్రయించగా.. 2023 సెప్టెంబర్లో 18,417 యూనిట్లను సేల్ చేసింది. దీని అమ్మకాలు 22 శాతం పడిపోయాయి. మరోవైపు ఫ్రాంక్స్ అమ్మకాలను పెంచుకుంటోంది. 21 శాతం వృద్ధితో ఫ్రాంక్స్ సెప్టెంబర్‌లో 13,874 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2023 సెప్టెంబర్‌లో ఫ్రాంక్స్ 11,455 యూనిట్లను విక్రయించింది.

టాటా పంచ్ సెప్టెంబర్‌లో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. టాటా మోటార్స్ గత నెలలో 13,711 పంచ్ కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే వార్షిక వృద్ధి 5 శాతంగా ఉండటం ఉపశమనం కలిగించే అంశం. టాప్ 10లో చోటు దక్కించుకున్న ఏకైక టాటా కారు కూడా పంచ్ మాత్రమే కావడం గమనార్హం. టాటా నెక్సాన్ ఈ జాబితాలో లేదు.
మారుతి వ్యాగన్‌ఆర్, ఈకో ఈ జాబితాలో 9,10 స్థానాల్లో నిలిచాయి. బాలెనో తర్వాత భారీ క్షీణతను చవిచూసిన ఏకైక కారుగా మారుతి వ్యాగన్‌ఆర్ నిలిచింది. సెప్టెంబర్ 2023 లో వ్యాగన్ఆర్ 16,250 యూనిట్లను విక్రయించింది. 2024 సెప్టెంబర్‌లో 13,339 యూనిట్లు మాత్రమే కొనుగోలు చేశారు. అమ్మకాలు 18 శాతం క్షీణించాయి. ఈకో వ్యాన్ 11908 విక్రయించి గత ఏడాదితో పోలిస్తే 7 శాతం సేల్స్‌ని పెంచుకుంది.


Click it and Unblock the Notifications








