2025లో తగ్గేదేలే… భారీ మైలేజీతో వస్తున్న బ్రాండెడ్ కారు.. దీనికోసం అప్పుడే కర్చిఫ్ వేస్తున్న జనాలు!
సినిమాల్లో ముందు సపోర్టింగ్ రోల్‌లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుని హీరోలుగా ఎదిగిన వారున్నారు. చిరంజీవి, రజినీకాంత్, రవితేజ ఇలా మొదలైన వారే! అరే కార్ల గురించి చెబుతూ హీరోల గురించి ఏంటి అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేస్తున్నా.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు కూడా తన జర్నీని ఇలా సపోర్టింగ్ రోల్ గానే మొదలుపెట్టి... ఇప్పుడు స్టార్‌గా ఎదిగింది. వచ్చే ఏడాది మరింత ఎక్కువ మైలేజీతో అప్డేట్ వెర్షన్‌తో రానుంది. ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఫ్రాంక్స్ జర్నీ ఎలా మొదలైందంటే: అది 2023 సంవత్సరం.. ఆ సంవత్సరం ఆటో ఎక్స్పో జరుగుతోంది. మారుతి సుజుకి సంస్థ ప్రవేశపెట్టనున్న జిమ్నీ గురించే అందరూ ఎదురుచూస్తున్నారు. దాని గురించే తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. కానీ ఆ పక్కనే ఉంది మారుతి సుజుకి ఫ్రాంక్స్. జిమ్నీతో పాటే ఆటో ఎక్స్ పోలో దర్శనం ఇచ్చినప్పటికీ ఫ్రాంక్స్ కారు పట్ల పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు.

అందరూ జిమ్నీ చుట్టూ చేరి దాని ఫొటోలు తీసుకున్నారు. కానీ ఎవరూ కూడా ఫ్రాంక్స్ దిక్కు చూడలేదు. అసలు దాన్ని పట్టించుకోనే లేదు. కానీ, కొన్నాళ్ళకి సీన్ రివర్స్ అయింది. ఫ్రాంక్స్ కారు క్రేజ్ పెరిగింది. ఎవరు పట్టించుకోకుండా వదిలేసిన ఆ కారే ఇప్పుడు హీరోగా మారి మారుతీ సంస్థకు బోలెడన్ని లాభాలు తెచ్చిపెట్టింది. 2023లో ఫ్రాంక్స్ కారు మార్కెట్లో విడుదలైన తర్వాత అనతికాలంలోనే ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించింది.
కేవలం 10 నెలల్లోనే లక్ష కార్ల అమ్మకాలు జరిగాయి. మారుతీ సుజుకి బ్రాండ్‌లోనే ఇంత వేగవంతమైన అమ్మకాలు జరిగిన ఘనత ఫ్రాంక్స్ దక్కించుకుంది. ఆ తర్వాత ఏడు నెలల్లోనూ ఫ్రాంక్స్ కారు అదే జోరు కొనసాగించింది. ఈ వ్యవధిలో ఈ కారు అమ్మకాలు డబుల్ అయ్యాయి. ఈ పాపులారిటీతో.. వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసింది. జపాన్‌కు ఎగుమతి చేసిన రెండో మారుతి సుజుకి మోడల్ ఫ్రాంక్స్ కావడం గమనార్హం.

వచ్చే ఏడాది మరింత మెరుగ్గా: వచ్చే ఏడాది మైలేజీతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫ్రాంక్స్‌లో స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌తో మారుతి సంస్థ మార్కెట్లోకి రానుంది. ఆ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే అనేక హైబ్రిడ్ కార్ల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే.. అంతకుమించి మైలేజీ అందించే ఈ హైబ్రిడ్ కారును తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. రానున్న ఈ కారు మైలేజీ 35KMPL కంటే అధికంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
దేశీయంగా తయారైన HEV సిస్టం హై ఫ్యూయల్ ఎఫీషియన్సీతో వాహనాలను అందించేందుకు మారుతి సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రానున్న ఈ హైబ్రిడ్ కార్లలో పెట్రోల్ ఇంజిన్‌ని ఒక రేంజ్ ఎక్స్టెండర్ తరహాలో వినియోగనించనుంది. ఈ కారులో స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని వినియోగించనుంది. దాంతోపాటు ఇందులో మారుతి స్విఫ్ట్ లో తొలిసారి వినియోగించిన Z12E ఇంజిన్‌తో రానుంది. ఈ కారు... హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్న మొదటి సబ్-ఫోర్-మీటర్ SUVగా నిలుస్తుంది.

హైబ్రిడ్ సెటప్‌తో పాటు, Fronx లుక్ లోనూ కొన్ని మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పుడు క్రేజ్ అంతా ఎలక్ట్రిక్ కార్ల చుట్టూ తిరుగుతోంది. పెరుగుతున్న ఫ్యూయల్ ధరల భారం నుంచి తప్పించుకునేందుకు ఈవీలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో మారుతి సుజుకి, టయోటా వంటి దిగ్గజ సంస్థలు 2025లో ఈవీ రంగంలో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
వివిధ ధరల సెగ్మెంట్లలో.. ఫ్యూయల్ టెక్నాలజీ ఆప్షన్, హైబ్రిడ్ ఆప్షన్స్ అందించేందుకు మారుతి సంస్థ తన ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించింది. భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండు లక్షల వరకు వినియోగదారులు ఫ్రాంక్స్ కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు ప్రస్తుత ధర రూ.7.52 లక్షల నుంచి రూ.13.04 లక్షల మధ్య (ఎక్స్- షోరూమ్) ఉంది.


Click it and Unblock the Notifications








