ఒక్కఛార్జింగ్‌తో 220 కి.మీలు.. పెద్ద కుటుంబానికి బెస్ట్ మోడల్.. ధర రూ.9.99 లక్షలు.. బుకింగ్స్ స్టార్ట్
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకూ డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. దేశీయంగా దిగ్గజ వాహన తయారీ కంపెనీలు ఎక్కువగా ఈవీల వైపు ఫోకస్ చేశాయి. దీంతో వరుసగా కొత్త కొత్త ఫీచర్లతో, అధునాతన డిజైన్లను కలిగిన కార్లను విడుదల చేస్తున్నాయి. 2023 ఏడాదితో పోలిస్తే, ఎలక్ట్రిక్ కార్లు 2024లో ఎక్కువగా లాంచ్ అయ్యాయి. ప్రముఖ వాహన తయారీ కంపెనీలు మహీంద్రా (Mahindra), టాటా మోటార్స్ (TaTa Motors), ఎంజీ మోటార్స్ (MG Motors) వంటివి పెట్రోల్, డీజిల్ ఇంధన వాహనాలను ఉత్పత్తి చేస్తూనే అదే సమయంలో ఈవీలను కూడా ఉత్పత్తి చేస్తూ దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి. వీటి సేల్స్ కూడా మెరుగ్గానే ఉన్నాయి. చాలా కంపెనీలు తమ ఫేవరెట్ మోడళ్లను ఎక్కువగా ఈవీ వేరియంట్‌లో తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశపు దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది.
ఈ కంపెనీ కూడా రాబోయే ఏడాదిలో కొత్త ఈవీ లాంచ్‌లు చేయాలని ప్లాన్ చేసింది. అయితే కంపెనీల కంటే ముందుగానే కొన్ని చిన్న మోటార్స్ సంస్థలు అప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పెట్రోల్, డీజిల్ కార్ల ఇంజిన్లను పూర్తిగా మార్చివేసి ఎలక్ట్రిక్ మోటార్ కిట్‌లను అమర్చుతారు. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన పెద్ద ఈకో (eeco) వ్యాన్‌ను ఒక సంస్థ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను తీసుకొచ్చింది.

ఇండియాలో బాగా డిమాండ్ కలిగిన పాత ఐసీఈ (ICE) ఇంజిన్ వాహనాలను ఎలక్ట్రిక్ వెర్షన్లుగా మార్చే ప్రముఖ సంస్థ నార్త్‌వే మోటార్స్ తాజాగా మారుతీ సుజుకీ ఈకో వ్యాన్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌లో విడుదల చేసి అందిరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే ఈ సంస్థ గతంలో మారుతి ఇగ్నిస్ వంటి మోడళ్లను ఎలక్ట్రిక్ మోటారు అమర్చి విడుదల చేసింది. ఇప్పుడు ఈకో వ్యాన్‌ను సైతం ఇదే విధంగా తీసుకొచ్చింది.
ఇలా సాధారణ ఇంధన వాహనాలను ఈవీ వేరియంట్‌లోకి మార్చి విడుదల చేసే సంస్థలు మార్కెట్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం అనుమతితోనే ఇలా ఇంజిన్ మార్పులు చేస్తాయి. ICE ఇంజిన్‌ను తొలగించి వాటిని ఎలక్ట్రిక్ మోటార్‌లో తీసుకురావడం అంటే చాలా కష్టంతో కూడుకుంది. పూణేకు చెందిన నార్త్‌వే మోటార్స్ ఈకో వ్యాన్‌ను రీట్రోఫిటెడ్ EV కిట్‌తో అప్‌డేట్ చేసింది. ఇది ఒక్క ఛార్జింగ్‌తో 220 కి.మీల వరకు ప్రయాణిస్తుంది.

ఈ కారుకు సంబంధించిన వీడియోను NT పవర్ సిస్టమ్స్ య్యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ICE ఇంజిన్ ప్లేస్‌లో 24 bhp పవర్‌ను, 100 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. 22 kWh బ్యాటరీ ప్యాక్ లోపల ఉంటుంది. ఇది 2 గంటల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
కారు ఇంజిన్ భాగాలను మార్చినప్పటికి ఇతర విభాగాల్లో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. ఎలక్ట్రిక్ కారుగా మార్చడంతో ఫ్యూయల్ ట్యాంక్ ప్లేస్‌లో బ్యాటరీ ఛార్జ్ చేయడానికి ప్రత్యేక పోర్ట్‌ను అందించారు. కారు లోపల ఉన్న ఫీచర్లను ICE ఇంజిన్ మోడల్‌లో ఉన్నట్లో దీనిలో కూడా ఉన్నాయి. ఫీచర్లను సంస్థ మార్చలేదు. అదనంగా మరిన్నింటిని ఇచ్చినట్లు తెలుస్తుంది.

మారుతీ సుజుకీ ఈకో వ్యాన్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కావాలనుకునే వారు ముందుగా బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం రూ.49,000 చెల్లించాల్సి ఉంటుంది. దీని ధర రూ.9.99 లక్షలు. దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రాసెస్ నార్త్‌వే ద్వారానే జరుగుతాయి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక బుకింగ్ చేసుకున్న వారికి వాహనాన్ని డెలివరీ చేస్తారు.


Click it and Unblock the Notifications








