కార్ మార్కెట్ షేక్ కాబోతుంది.. మారుతీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు.. మంచులో కూడా దూసుకుపోతుంది
ప్రపంచంలో వాహన తయారీ కంపెనీలు ఇప్పుడు తమ ఉత్పత్తిని క్రమంగా ఈవీల వైపు మళ్లిస్తున్నాయి. భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్, CNG ఇంధన కార్ల కంటే కూడా ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో దేశీయంగా ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలు వరుసగా కొత్త ఈవీ మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా, హ్యూందాయ్, కియా వంటి కార్ల తయారీ కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో పలు మోడళ్లను లాంచ్ చేశాయి. ముఖ్యంగా 2024 ఏడాదిలో ఈవీ హవా ఎక్కువగా కొనసాగింది. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) మాత్రం ఇంకా వెనుకబడి ఉంది. అయితే కంపెనీ తన ధోరణిని మార్చుకుని సాధారణ ఇంధన కార్లను తీసుకొస్తూనే అదే సమయంలో ఎలక్ట్రిక్ మోడళ్లను లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రాబోయే 2025లో భారతీయ ఈవీ మార్కెట్లో కొత్త కార్లను తీసుకురాబోతుంది.
ఈ నేపథ్యంలో సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఇటలీలోని మిలాన్‌లో జరిగిన ఈవెంట్‌లో మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారా(e vitara)ను ఆవిష్కరించింది. దీన్ని ఇండియాలో కొత్త ఏడాది జనవరిలో జరగనున్న 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రారంభిస్తారు. ఈ కారును దేశంలోనే కాకుండా జపాన్, యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లో కూడా విడుదల చేస్తారు. ఈ ఈవీ కారును గుజరాత్‌లోని మారుతీ సుజుకీ ప్లాంట్‌లో తయారు చేస్తారు.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో లాంచ్ చేయడానికి ముందు కంపెనీ తాజాగా కారు పనితీరును వివరించడానికి మంచుల్లో నడిపారు. మంచులో కూడా కారు రయ్ మంటూ దూసుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. దీనిలో ఎలక్ట్రిక్ కారు ఇ విటారా పెర్ఫామెన్స్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. య్యూట్యూబ్ ఛానల్‌లో వీడియో పోస్ట్ చేయగా, పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. భారీ మంచులో ఈ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ చేశారు.
జపాన్‌లోని హక్కైడోలో మంచుతో నిండిన రోడ్డుపై కారును డ్రైవింగ్ చేశారు. అయితే దీన్ని ఇలా మంచుపై ఎందుకు టెస్ట్ చేశారంటే.. సాధారణంగా మంచుపై వాహనాలు జారిపోతుంటాయి. డ్రైవింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకుంది. పైగా చల్లగా ఉన్న ఏరియాల్లో ఎలక్ట్రిక్ మోటార్, కారులో ఉన్న ఫీచర్స్ కొంత ప్రతికూల ప్రభావాలకు లోనవుతాయి. అందుకే ఈ కారు మంచులో ఏ విధంగా పెర్ఫామెన్స్ అందిస్తుందో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేశారు.

వీడియోను చూసినట్లయితే ఇ విటారా మంచులో కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. మంచు మీద డ్రైవింగ్ చేసే సమయంలో అన్ని ఫంక్షన్లు కూడా సరిగ్గానే పనిచేశాయి. కారు స్పీడ్ స్థిరంగా ఉంది. ఇది లేటెస్ట్ BEV పవర్‌ట్రెయిన్ నుంచి శక్తిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్ చాలా అందంగా ఉంటుంది. లోపల ఆకర్షణీయమైన థీమ్‌ను అందించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ suvలో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి.
అందుకే అన్ని ప్రాంతాల్లో కూడా చాలా సునాయసంగా డ్రైవింగ్ చేయడానికి అనువుగా ఉంటుంది. కారులో శక్తివంతమైన లిథియం ఐరన్-ఫాస్ఫేట్ బ్యాటరీల ద్వారా పనిచేసే మోటారు ఉంది. ఇది మరింత సేఫ్టీ ప్రమాణాలను కలిగి ఉంటుంది. ఇ విటారా బాడీ కఠిన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుంటుంది. లోపల అధునాతన ఫీచర్స్ ఉంటాయి. వన్-పీస్ డిస్‌ప్లే,ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి.

మారుతీ సుజుకీ ఇ విటారా రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభించనుంది. 49 kWh బ్యాటరీ వేరియంట్, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది. అంచనాల ప్రకారం, ఇది సింగిల్ ఛార్జ్‌తో 550 కి.మీల పైనే ప్రయాణిస్తుందని సమాచారం. దీని ధర రూ.22 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్యలో ఉండవచ్చు.


Click it and Unblock the Notifications








