దేశంలో 25 ఏళ్ల నుంచి ఇదే కారును కొంటున్న జనాలు.. ఇండియాలోనే అత్యంత డిమాండ్.. సక్సెస్ సీక్రెట్ ఇదే
భారత వాహన తయారీ రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్నటువంటి మారుతీ సుజుకీ (Maruti Suzuki) గురించి తెలియని వారు ఉండరు. దశాబ్దాల కాలంగా కార్లను విక్రయిస్తూ, పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని అనుకూలమైన ధరలో, అధిక మైలేజ్ ఇచ్చే కార్లను లాంచ్ చేస్తూ ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుంది. మారుతీ సుజుకీ నుంచి వచ్చిన కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉంటుంది. బడ్జెట్ ప్రేమికులకు ఇవి బెస్ట్ ఆప్షన్. ఇదిలా ఉంటే ఇదే కంపెనీ నుంచి విడుదల అయిన ఒక మోడల్ తాజాగా ఇండియాలో 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. దేశంలో ఇంత కాలంగా ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుకుంటున్న కారు పేరు 'వ్యాగన్ఆర్ (WagonR)'. ఇది చిన్న కుటుంబానికి సరిపోయే హ్యాచ్‌బ్యాక్. నలుగురు సభ్యులు కలిగిన ఫ్యామిలీకి అత్యంత అనువైన కారు.
భారత్‌లో చిన్న కుటుంబం గల వారు ఈ కారునే అధికంగా కొనుగోలు చేస్తుంటారు. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక కారుకు 25 ఏళ్లుగా డిమాండ్ తగ్గడం లేదు అంటే సాధారణ విషయం కాదు. ఇది ఎప్పటికప్పుడు ట్రేండ్‌కు అనుగుణంగా అప్‌డేట్ అవుతూ మార్కెట్లోకి వస్తూనే ఉంది. ఈ కారు గురించిన వివరాల్లోకి వెళితే, మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ను మొదటి సారిగా ఇండియాలో 1999 డిసెంబర్‌లో లాంచ్ చేసింది.

చూడటానికి చిన్నగా సరికొత్త డిజైన్‌తో లభించడంతో దేశంలో చాలా మంది దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. నలుగురు సభ్యులతో కూడిన ఫ్యామిలీ ప్రయాణాలకు అత్యంత అనువుగా ఉండటంతో లాంచ్ అనతి కాలంలోనే దేశంలో బాగా డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్ మోడల్‌గా అవతరించింది. పైగా ధర కూడా మరి ఎక్కువ కాకుండా సామాన్య మధ్యతరగతి ప్రజలు కొనగలిగే రేంజ్‌లో ఉండటం బాగా కలిసివచ్చింది.
ఇండియాలో 25 ఏళ్ల క్రితం లాంచ్ అయిన ఈ మోడల్ ఇప్పటి వరకు కూడా కొత్త అప్‌డేట్‌లను అందుకుంటూ ప్రస్తుత మార్కెట్లో ఇతర కార్లకు పోటీనిస్తూ అమ్మకాల పరంగా దూసుకుపోతుంది. మారుతీ వ్యాగన్ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఎప్పుడు కూడా మెరుగైన స్థానంలో ఉంటుంది. డేటా ప్రకారం, ఈ కారు విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 30 లక్షల మంది దీన్ని కొనుగోలు చేశారు.

ప్రస్తుతం భారత్‌లో దిగ్గజ వాహన తయారీ కంపెనీలు అధునాతన ఫీచర్లతో కూడిన హ్యాచ్‌బ్యాక్‌లను విడుదల చేస్తూ సేల్స్ పరంగా మార్కెట్లో వాటాను సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూడా మారుతీ దశాబ్దా కాలం నాటి కారు వ్యాగన్‌ఆర్ ఇతర మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుండటం గమనార్హం. భారత మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ.5.55 లక్షలుగా ఉంది. ధర తక్కువ ఉండటం కూడా సేల్స్ పెరగడానికి ప్రధాన కారణం.
దీనిలో టాప్ వేరియంట్ ధర రూ.8.50 లక్షల వరకు ఉంటుంది. మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్ మూడోతర ఇండియా మార్కెట్లో సేల్‌కు అందుబాటులో ఉంది. ఇది 1.0 లీటర్ K సిరీస్ ఇంజిన్, అలాగే, 1.2 లీటర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌లో లభిస్తుంది. లీటర్ పెట్రోల్‌పై దాదాపు 23 నుంచి 24 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది CNG ఆప్షన్‌లో కూడా లభిస్తుంది. దీనిలో 33.47 కి.మీ మైలేజ్ వస్తుంది.

వ్యాగన్‌ఆర్ అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. క్యాబిన్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నాలుగు స్పీకర్ల మ్యూజిక్ సిస్టం, ప్రయాణికుల సేఫ్టీ పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS సిస్టం, అదనంగా రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








