హాట్ కేకుల్లా కొత్త కియా కారు బుకింగ్స్.. కేవలం 20 రోజుల్లోనే సునామీ.. ఏడాది తరువాతే డెలివరీ..
కొద్ది రోజుల క్రితం ఇండియాలో విడుదలైన 2024 కియా కార్నివాల్(Kia Carnival) ఎంపీవీ కారు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో నవంబర్ నెల నుంచి అమ్మకానికి వచ్చిన ఈ కారు 20 రోజుల క్రితం ఇండియాలో బుకింగ్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ఈ కొద్ది రోజుల్లోనే ఇది ఏకంగా 3000 బుకింగ్స్‌ను సాధించింది. ప్రస్తుతం మార్కెట్లో కియా కార్నివాల్‌కు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, కొత్త కార్నివాల్ కోసం వెయిటింగ్ పీరియడ్ ఒక సంవత్సరానికి దగ్గరగా ఉందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఏడాది తరువాతే డెలివరీ జరుగుతుంది. ఏడాదికి సంబంధించి మొత్తం యూనిట్లు కూడా అమ్ముడయ్యాయి.
ఇది నాలుగో తరం 2024 కియా కార్నివాల్, అక్టోబర్ మొదటి వారంలో లాంచ్ అయింది. ప్రస్తుతం రూ.63.90 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ కారు ఏడు సీట్ల సీటింగ్ లేఅవుట్‌తో కుటుంబ వినియోగదారులకు బాగా సెట్ అవుతుంది. పెద్ద ఫ్యామిలీ వారు ఈ కారులో ఒకేసారి ప్రయాణించవచ్చు. దీనిలో ఉన్న ఫీచర్లు కస్టమర్లను ఆకర్షించడంతో రికార్డు స్థాయిలో బుకింగ్స్ సాధించింది.

2022లో మునుపటి తరం MPV సుమారు 3,500 యూనిట్లను విక్రయించగా, ఇప్పుడు ఈ కొత్త మోడల్ దానికి దగ్గరగా బుకింగ్స్‌ను నమోదు చేసింది. కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్‌కు అనుగుణంగా కంపెనీ ఏపీలోని అనంతపురంలో తన తయారీ ప్లాంట్‌లో విడిభాగాలను కలిపి అసెంబుల్ చేస్తుంది. ప్రస్తుతానికి, కంపెనీ ప్రతి నెలా దాదాపు 300 యూనిట్ల కొత్త కార్నివాల్ MPVని అసెంబుల్ చేయగలదు.
కొత్త కార్నివాల్ MPV ఎనిమిది-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిన 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇంజిన్ 190bhp పవర్ అవుట్‌పుట్ వద్ద, 441Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. కార్నివాల్ మైలేజ్ దాదాపు లీటర్‌కు 14.8 కి.మీ వరకు వస్తుంది. కారు గ్లేసియర్ వైట్ పెర్ల్, ఫ్యూజన్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

క్యాబిన్ ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్-పేన్ సన్‌రూఫ్, రెండవ వరుసలో ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల కెప్టెన్ సీట్లు, అదనపు లెగ్ సపోర్ట్ ఉన్నాయి. ప్రయాణంలో మంచి అనుభూతితో పాటలను వినిపించడానికి 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ కర్వ్డ్ డిస్‌ప్లేలు లోపల ఉన్నాయి. డిజిటల్ రియర్-వ్యూ మిర్రర్, హెడ్-అప్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ రికగ్నిషన్‌తో అప్‌డేట్ చేయబడిన డిజిటల్ కీ వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.
బయటి నుంచి కారు డిజైన్ అద్బుతంగా ఉంది. LED హెడ్‌ల్యాంప్‌లు, L-ఆకారపు LED DRLలు, కొత్త అల్లాయ్ వీల్స్ మొదలగునవి ఉన్నాయి. కార్నివాల్ పొడవు 5,155 మిమి, వెడల్పు 1,995 మిమి, ఎత్తు 1,775 మిమి, వీల్ బేస్ 3,090 మిమిగా ఉంది. ఈ కారులో ఎకో, నార్మల్, స్పోర్ట్స్, స్మార్ట్ డ్రైవింగ్ మోడ్‌లను ప్రత్యేకంగా అందించారు. యూత్ వినియోగదారులు ఆకట్టుకోడానికి కూడా లేటెస్ట్ ఫీచర్లు కారులో చాలా ఉన్నాయి.

ఇది 7-సీటర్ ఆప్షన్‌లో 2+2+3 వరుసలను కలిగి ఉంది. ప్రయాణికుల భద్రత పరంగా అధునాతన ఫీచర్లను అందించారు. కారులో 8-ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి. లోపల 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.



Click it and Unblock the Notifications








