Porsche Macan Turbo EV పోర్షే నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 600 కి.మీ పైగా రేంజ్
దేశంలో మరో కొత్త ఎలక్ట్రిక్ కారు లాంచ్ అయింది. జర్మన్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే.. కొత్త మకాన్ టర్బో ఎలక్ట్రిక్(New Porsche Macan Turbo EV) SUVని నేడు విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర, ఫీచర్లు, బ్యాటరీ రేంజ్ పూర్తి వివరాలు ఈ కథనంలో..
కొత్త పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్(Porsche Macan Turbo EV) SUV ధర రూ. 1.65 కోట్లు. పోర్షే మకాన్ ఎలక్ట్రిక్ కారును సంస్థ మకాన్ 4(Macan 4), మకాన్ టర్బో(Macan Turbo) అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం అవుతాయని సంస్థ తెలిపింది.

పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ SUV డిజైన్ విషయానికొస్తే.. ఇది పెట్రోల్ మోడల్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇందులో ప్రత్యేకంగా నాలుగు-పాయింట్ LED DRLలు, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రేమ్‌లెస్ డోర్లు ఉన్నాయి. ఇంకా వెనుకవైపు కనెక్ట్ చేయబడిన LED బార్, కూపే-స్టైల్ బాడీతో పాటు ఆకర్షణీయమైన 22-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
కొత్త పోర్షే మకాన్(Porsche Macan) టర్బో ఎలక్ట్రిక్ SUV ఇంటీరియర్ విషయానికొస్తే.. క్యాబిన్‌ను చాలా లగ్జరీగా విశాలవంతంగా రూపొందించారు. ఫీచర్ల పరంగా ఇందులో 12.6-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇంకా ఎయిర్‌కాన్ కంట్రోల్స్ కోసం ఫిజికల్ బటన్లు ఉన్నాయి.

హెడ్స్-అప్ డిస్‌ప్లే మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఆప్షనల్‌గా 10.9-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తోంది. కొత్త పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ SUVలో ఆప్షనల్ రియర్ వీల్ స్టీరింగ్ సదుపాయంతో వస్తుంది. ఇంకా పోర్షే యాక్టివ్ సస్పెన్షన్ మేనేజ్‌మెంట్‌తో పాటు పోర్షే ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.
పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ SUVని 800-వోల్ట్ PPE ఆర్కిటెక్చర్ ఆధారంగా నిర్మించారు. ఇందులో 100 kWh బ్యాటరీ ప్యాక్‌ను స్టాండర్డ్‌గా ఉపయోగించారు. కాగా పోర్షే మకాన్ 4 613 కి.మీ రేంజ్‌ను ఇస్తుండగా. ఇంకా మకాన్ టర్బో వేరింయట్‌లో పూర్తి ఛార్జింగ్‌పై 591 కి.మీ రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది.

ఛార్జింగ్ ఆప్షన్లను పరిశీలిస్తే పోర్షే మకాన్ టర్బో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 11 kW AC ఛార్జింగ్ మరియు 270 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తున్నారు. వీటిలో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కేవలం 21 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. కాగా ఈ టర్బో ఎలక్ట్రిక్ SUV రెండు వేరియంట్లలో డ్యూయల్-మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది.
పోర్షే మకాన్ టర్బో వేరియంట్ 630 బీహెచ్‌పీ మరియు 1,130 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 3.3 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. ఈ SUV గరిష్ఠంగా గంటకు 260 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

కాగా మరో వేరియంట్ పోర్షే మకాన్ 4, 402 bhp పవర్ వద్ద 650 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.2 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగా.. గరిష్ఠంగా గంటకు 220 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ కారు బూట్ స్పేస్ 540 లీటర్లు.


Click it and Unblock the Notifications








