ఈ కారు ధర అక్షరాలా రూ. 209 కోట్లు.. తయారీ కోసం రెండేళ్ల రీసెర్చ్.. ఒక్కో ఫీచర్ మహా అద్భుతం
రోల్స్ రాయిస్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ల కంపెనీ. ఈ కారు రోడ్డుపై వెళ్తుంటే ఎవరూ కూడా చూపు తిప్పుకోలేరు. అటువంటి లగ్జరీ సంస్థ మరో అత్యంత ఖరీదైన కారును ఆవిష్కరించింది. 'ఆర్కాడియా డ్రాప్‌టెయిల్'(Rolls Royce Arcadia Droptail) ను పరిచయం చేసింది. దీని ధర సుమారు రూ. 209 కోట్లు. సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ వేడుకలో దీనిని ఆవిష్కరించారు.
'ఆర్కాడియా' అంటే భూమిపై స్వర్గం. రోల్స్ రాయిస్ ఈ పేరును గ్రీకు నగరమైన ఆర్కాడియా నుంచి తీసుకున్నట్లుగా సమాచారం. ఆకర్షణీయమైన డిజైన్, లుక్స్, ప్రీమియం ఫీచర్లతో నిండిన ఈ అల్ట్రా-కస్టమైజ్డ్ కారు దాని పేరుకు తగ్గట్లుగా ఉంటుంది. కాగా రోల్స్ రాయిస్ ఆర్కాడియా డ్రాప్‌టెయిల్ తయారీలో ఉపయోగించిన మెటీరియల్ గురించి ఇక్కడ మనం చాలా చెప్పుకోవాలి.

ఈ 'రోల్స్ రాయిస్ ఆర్కాడియా డ్రాప్‌టెయిల్' కారులో 233 శాంటాస్ స్ట్రెయిట్ గ్రెయిన్ రోజ్‌వుడ్ హార్డ్‌వుడ్ ముక్కలను ఉపయోగించారు. వీటిలో 76 ముక్కలను వెనుక డెక్‌లో అమర్చారు. ఇది రోల్స్ రాయిస్‌లో ఉపయోగించే అన్ని చెక్క జాతుల్లో అత్యుత్తమమైనవిగా సంస్థ తెలిపింది. అంతేకాకుండా ఈ లగ్జరీ కారులో డిజైన్ చేసి ఉంచిన 'వాచ్' మరో ప్రత్యేకమైనది. ఈ కారులో శాంటాస్ స్ట్రెయిట్ రోజ్‌వుడ్ ఎక్కువగా ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ఇక ఈ కలప నుంచి ఆర్కాడియా డ్రాప్‌టెయిల్ లోపలి భాగాన్ని సిద్ధం చేయడానికి దాదాపు 8 వేల గంటల కంటే ఎక్కువ సమయం పట్టిందట. ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్‌లో రోల్స్ రాయిస్ స్వంత డిజైన్ గడియారాన్ని రూపొందించి అమర్చింది. ఇది కారులో అత్యంత క్లిష్టమైన భాగం. కేవలం ఈ క్లాక్‌ను తయారుచేయడానికే రెండేళ్లు పరిశోధన చేశారు. కారు డ్యాష్‌బోర్డ్‌లో అసెంబ్లింగ్ చేయడానికి 5 నెలల సమయం పట్టింది.

రోల్స్ రాయిస్ ఆర్కాడియా డ్రాప్‌టెయిల్(Rolls Royce Arcadia Droptail Unveil)ను ఫార్ములా 1 రేసింగ్ కార్ల డిజైన్ ఆధారంగా ప్రేరణ పొంది రూపొందించారు. ఈ కారు కంపెనీ AOL ప్లాట్‌ఫారమ్(AOL Platform)పై మోనోకోక్ ఛాసిస్‌తో రూపొందించగా.. రోడ్‌స్టర్ బాడీ స్టైల్‌తో కంపెనీ మొదటి కారు ఇదే కావడం విశేషం.

రోల్స్ రాయిస్ ఆర్కాడియా డ్రాప్‌టైల్ లగ్జరీ కారు పెయింటింగ్ విషయానికొస్తే.. రోల్స్ రాయిస్ కోచ్‌బిల్డ్ డిజైనర్లు సహజమైన డ్యూటోన్ కలర్‌వేని ఉపయోగించి అద్భుతంగా పెయింటింగ్ చేశారు. బాడీవర్క్ కోసం అల్యూమినియం, కార్బన్ ఫైబర్ టబ్, ముందు భాగంలో బ్లాక్ కలర్ వంటి వాటితో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇతర డ్రాప్‌టైల్‌ల మాదిరిగా కాకుండా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.
విలాసవంతమైన ఆర్కాడియా డ్రాప్‌టైల్(Arcadia Droptail Price) ముందు భాగంలో మిర్రర్ ఫినిషింగ్ ఎక్స్‌టీరియర్ గ్రిల్, కంపెనీ సిగ్నేచర్ ఫ్లోటింగ్ RR లోగోతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 22-అంగుళాల అల్లాయ్ వీల్స్ అమర్చారు. 2-డోర్, 2-సీటర్ కాన్ఫిగరేషన్‌తో ఈ లగ్జరీ కారు వస్తుంది.

రోల్స్ రాయిస్ ఆర్కాడియా డ్రాప్‌టెయిల్ ఇంజిన్ పనితీరు విషయానికొస్తే ఇందులో 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V12 పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజిన్ 593bhp శక్తిని మరియు 840Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాదాపు 5 సెకన్లలో 0 నుంచి 100 Kmph వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








