స్కోడా నుంచి కొత్త ఎస్‌యూవీ రాబోతుంది.. పేరు, ఫీచర్లు, ప్రత్యర్థులు ఇవే!
భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీలను కస్టమర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఆటోమొబైల్ తయారీదారులు ఈ సెగ్మెంట్‌లో వాహనాలను తయారు చేయడానికి మరియు విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా స్కోడా కూడా ఈ సెగ్మెంట్‌లో ఒక కొత్త కారును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అందులో భాగంగా త్వరలో విడుదల చేయబోయే కారు పేరును ప్రకటించింది. స్కోడా తీసుకురాబోయే ఈ కారులో కొత్తగా ఏముంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
ప్రస్తుతం, కాంపాక్ట్ ఎస్‌యూవీలు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెగ్మెంట్‌గా ఉంది. దేశంలో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కార్లు ఇవే. ముఖ్యంగా మొదటిసారి కారు కొనే వారు ఈ కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. సెడాన్ కార్లకు బదులుగా ప్రజలు ఎస్‌యూవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత కొన్ని నెలులుగా ఎస్‌యూవీ సేల్స్ భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. కార్ల తయారీ సంస్థలు కూడా దీనిపైనే ఫోకస్ చేస్తున్నాయి.

ఈ రోజుల్లో వివిధ కంపెనీలకు చెందిన ఎస్‌యూవీలకు మధ్య డిమాండ్ పెరుగుతుండటంతో స్కోడా తన కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని కూడా విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ కారు పేరును కూడా ప్రకటించారు. స్కోడా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి కైలాక్ (Skoda Kylaq) అని పేరు పెట్టింది. స్కోడా భారతదేశంలో తన బ్రాండ్‌ని పూర్తిగా అప్‌డేట్ చేస్తోంది. ఈ కారును 2.0 బ్రాండ్ పేరుతో కొత్త ఉత్పత్తిగా లాంచ్ చేయనుంది.
ఈ కారును MQB-AO-IN ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. స్కోడా కుషాక్, స్లావియా కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై తీసుకువచ్చింది. స్కోడా కైలాక్ వచ్చే ఫీచర్లు ఇతర విషయాలపై పెద్దగా సమాచారం లేదు. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఇది 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది. అంతే కాకుండా ఇది 1.0-లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేయనుంది. ఇది 114bhp పవర్ మరియు 178nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేయనుంది.
దీని డిజైన్‌కి సంబంధించి తెలియరాలేదు. భారత మార్కెట్‌లో ఇంకా ఆవిష్కరించబడలేదు. అయితే ఇప్పటివరకు విడుదలైన టీజర్లు, స్పై ఫొటోల ద్వారా ఈ కారు గురించి కొంత సమాచారం లభించింది. ఈ కారులో స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, LED DRLs ఉన్నాయి. ముందు భాగంలో కొత్త గ్రిల్ డిజైన్‌ని అందించారు. ఈ ప్రాంతాన్ని మరింత మెరుగ్గా కనిపించేలా రూపొందించారు.
కారు వెనుక భాగంలో L ఆకారంలో ఉన్న టెయిల్‌లైట్లను తలకిందులుగా అమర్చారు. కొత్త అల్లాయ్ వీల్స్ కూడా అందించారు. ఈ కారులో రూఫ్ పట్టాలను అమర్చారు. ఈ కారు ఇంటీరియర్ ఫీచర్లు, టెక్నికల్ ఫీచర్ల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ కారు లాంచ్ సమయంలోనే తెలుస్తుంది.
భారతదేశంలో కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పటికే విపరీతమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇందులో మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా 3XO, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, టాటా నెక్సాన్ ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ కార్లుగా ఉన్నాయి. వీటి జాబితాలో స్కోడా కైలాక్ కూడా చేరే అవకాశం ఉంది. ఒకసారి ఈ కారు పోటీలోకి వస్తే మార్కెట్లో పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నారు.
స్కోడాకు ఇండియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగినట్లుగానే ఈ కారును డిజైన్ చేసి విక్రయించాలని భావిస్తున్నారు. స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఆకర్షణీయంగా కైలాక్ అని పేరు పెట్టింది. కైమాక్, కైరాగ్, గరిక్, క్విక్ వంటి వివిధ పేర్లను కంపెనీ ఈ కారు కోసం ఆలోచించింది. చివరకు ఈ పేరుని ఫైనల్ చేసింది.


Click it and Unblock the Notifications








