మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. సింగిల్ ఛార్జ్‌లో 500 కిమీ రేంజ్.. టాటా, ఎంజీ మోటార్స్‌లకు చెక్!
సుజుకి తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. ఇటలీలోని మిలాన్‌లో ప్రపంచంలోనే పేరొందిన ఆటో షో 'ఈఐసీఎంఏ 2024' (EICMA)లో ఈ కారుని సుజుకి ఆవిష్కరించింది. ఈ కారుని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఎవరూ ఊహించని విధంగా సుజుకి ఈ కారును ప్రవేశపెట్టింది. 'ఇ-విటారా' (eVitara) పేరుతో దీనిని ప్రవేశపెట్టింది. ఈ కారు పేరుని సైతం ఎవ్వరూ ఊహించలేదు. దీనిని మొదటగా ఈవీఎక్స్ (eVX) పేరుతో విడుదల చేయాలని భావించింది. ఇదే పేరుతో భారతీయ మార్కెట్‌లోకి వస్తుందని భావించారు. అంతే కాకుండా ఇదే పేరుతో భారత్ 2023 ఆటో ఎక్స్ పోలో కారుని ప్రదర్శించింది. అయితే ఇప్పుడు ఈవీఎక్స్ పేరు స్థానంలో ఈ-విటారా పేరుని పెట్టింది.
తాజాగా సుజుకి ప్రదర్శించిన ఈ కారుని భారత్, జపాన్, యూరప్‌లో విడుదల చేయనుంది. భారత్‌లో ఉన్న మాస్ మార్కెట్‌ని ఒడిసి పట్టుకునేందుకు ఈ కారుని త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నారు. అయితే ఇదే పేరుతో భారత్‌లో అమ్మకానికి వస్తుందా? లేక వేరే పేరుతో విక్రయిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఇ-విటారా పేరుతో విక్రయించే అవకాశం ఉంది.

భారత్‌లో విడుదల చేయబోయే ఇ-విటారాను మారుతి సుజుకి గుజరాత్ ప్లాంటులో తయారు చేయనున్నారు. అంతే కాకుండా జపాన్, యూరోపియన్ మార్కెట్‌కి ఎగుమతి చేసే ఇ-విటారాను కూడా భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్నారు. ఇది ప్రపంచ మార్కెట్ కోసం తీసుకువస్తుండటంతో ప్రస్తుతం ఇటలీలోని మిలాన్ ఆటోషోలో ఆవిష్కరించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ కారుని మార్చి 2025 లో భారత్‌లో అమ్మకానికి తీసుకువచ్చే అవకాశం ఉంది.
ఆ తర్వాత యూరప్ సహా ఇతర మార్కెట్లలో ఈ కారును లాంచ్ చేయనున్నారు. అయితే లాంచ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. ఈ సమాచారం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. 2025 జనవరిలో రాజధాని ఢిల్లీలో జరిగే భారత్ మొబిలిటీ షోలో ఇ-విటారా ఈవీని మరోసారి ఆవిష్కరించనున్నారు. తాజా ఆవిష్కరణతో భారత్‌లో ఎలక్ట్రిక్ విటారా రాక ఖాయమై పోయింది.

మారుతి సుజుకి ఈ కారుని ప్రస్తుతం ఉన్న ఏ కార్ మోడళ్లతో ఆధారంగా అభివృద్ధి చేయలేదు. తమ కొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫామ్‌పై (Skateboard Platform) ద్వారా ఇ-విటారాను తయారు చేయనుంది. దీనికి 'హార్ట్‌టెక్-ఇ' అని పేరు పెట్టారు. ఇందులోని ప్రయాణీకుల రైడింగ్ ఆహ్లాదకరంగా మార్చేందుకు సుజుకి కొత్త టెక్నాలజీతో అధునాతన ఫీచర్లను జోడించనుంది. ఈ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు.
ఈ సరికొత్త ఈవీని 49 కిలోవాట్లు, 61 కిలోవాట్లలలో ప్రవేశపెట్టనుంది. పెద్ద బ్యాటరీ ప్యాక్ డ్యూయల్ మోటార్ ద్వారా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌తో రానుంది. ఇందులో లిథియం ఐరన్ ఫాస్పేట్ టైప్ బ్లేడ్ సెల్‌ని ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం బీవైడీలో ఈ రకాన్ని వినియోగిస్తున్నారు. ఇక రేంజ్ పరంగా బిగ్ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని చెబుతున్నారు.

ఇక 49 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 350 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని భావిస్తున్నారు. మంచి రేంజ్‌తో పాటు, ఫీచర్ల పరంగా కూడా ఈ కారు ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర కార్ల హై ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఇ-విటారాలో రెండు స్క్రీన్లు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం కాగా.. మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌గా పనిచేయనుంది.
అంతే కాకుండా ఇ విటారాలో స్టోరేజ్‌లో USB పోర్ట్, డ్యూయల్ స్పోక్స్‌తో ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదర్‌తో చుట్టిన సీట్లు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా టాటా మోటార్స్ ఈ సెగ్మెంట్లో అగ్రగామిగా కొనసాగుతోంది. టాటాకు ఎంజీ ఈవీ కార్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పుడు ఇ-విటారా మార్కెట్‌ని తన వైపుకి తిప్పుకునే అవకాశం లేకపోదు.


Click it and Unblock the Notifications








