ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను పెంచనున్న టాటా మోటార్స్.. ఆ విదేశీ సంస్థతో ఒప్పందం
భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ ప్రత్యేకతను కలిగి ఉంది. ఇప్పటికే ఈ దేశీ దిగ్గజం నాలుగు ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ క్రమంలో టాటా మోటార్స్ భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ కార్ల కోసం ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచే పనిలో ఉంది. ఇందులో భాగంగా సంస్థ.. షెల్‌తో చేతులు కలిపింది.
భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ 71 శాతం వాటాతో ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం టాటా నెక్సాన్ EV, టాటా పంచ్ EV, టాటా టియాగో EV మరియు టాటా టిగోర్ EV అనే 4 ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వీటికి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

దీని తరువాత, టాటా మోటార్స్ 2024 చివరి నాటికి 2 లేదా 3 కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. ఈ క్రమంలో టాటా మోటార్స్ మరియు షెల్ ఇప్పుడు భారతదేశం అంతటా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి. ఇందుకోసం అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. ఇంగ్లండ్‌లో ఉన్న పెట్రోలియం కంపెనీ ఇది.
ఈ కూటమి ద్వారా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నవారు బ్యాటరీ ఛార్జింగ్ సమస్య నుంచి బయటపడతారని టాటా మోటార్స్ వెల్లడించింది. అయితే టాటా మోటార్స్-షెల్ కూటమిలో భారతదేశం అంతటా ఎన్ని ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తారనే సమాచారంపై స్పష్టత లేదు. అయితే, షెల్స్ పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రిక్ కార్ల యజమానులకు చాలా దోహద పడతాయి.

కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం 12,146 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో టాటా పవర్ ఒక్కటే దాదాపు 8 వేలు ఉన్నాయి. షెల్ కంటే ముందే టాటా మోటార్స్ హిందుస్థాన్ పెట్రోలియంతో పొత్తు పెట్టుకుంది. ఈ కూటమి ద్వారా హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీకి చెందిన పెట్రోల్ బంకుల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.
పరిమిత సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్‌ల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి వెనుకాడుతున్నారు. అయితే టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈవీ యజమానులకు సమస్య తీరనుంది. ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. భవిష్యత్తులో చాలా మంది ధైర్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

టాటా మోటార్స్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ముడిచమురు దిగుమతులను తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయానికి కూడా ఇది దోహదపడుతుంది. పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల పర్యావరణం దెబ్బ తింటోంది. అలాగే పెట్రోలు, డీజిల్‌కు ముడిసరుకు అయిన ముడిచమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి రూ. లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.
ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అందుకే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం బాహాటంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దీని కారణంగా, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచడానికి టాటా మోటార్స్ తీసుకున్న చర్యలు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలకు కూడా దోహదపడతాయి.
ప్రపంచంలోనే ముడి చమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగి, ముడి చమురు దిగుమతులు తగ్గితే, అది చాలా ముడి చమురు ఉత్పత్తి దేశాలపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. ఆ దిశగా ఆటో మొబైల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications








