Tata Punch EV టాటా పంచ్ ఈవీ ధర లీక్.. స్పందించిన టాటా మోటార్స్.. ఏం చెప్పిందంటే.!!
టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును ఇటీవల టాటా మోటార్స్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కాగా టాటా పంచ్ EV బుకింగ్‌లు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. Tata Punch EV కి డిమాండ్ కూడా బాగానే ఉంది. అయితే ఈ కారుకి సంబంధించి ధర వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.
భారత మార్కెట్లో కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఈవీ కారు రివీల్ అయినప్పటి నుంచి ఈ కారును కొనుగోలు చేసేందుకు డిమాండ్ ఆశాజనకంగానే ఉంది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ ధరను ఇప్పటివరకు టాటా మోటార్స్ వెల్లడించలేదు. కాగా ఈ కారును బుక్ చేసిన కొందరు వ్యక్తులు.. తాము బుక్ చేసుకున్న టాటా పంచ్ ఈవీ ధరలను ఇమెయిల్ ద్వారా పొందినట్లు పేర్కొన్నారు.

టాటా పంచ్ EV ధరలు టెస్లా క్లబ్ ఇండియా వారి X (గతంలో ట్విట్టర్) పేజీలో లీక్ అయ్యాయి. పంచ్ EV యొక్క రెండు వేరియంట్‌ల ధర వివరాలను ఈ పేజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. మొదటి పోస్ట్‌లో "మా స్నేహితుడు మరియు టీమ్ సభ్యుడు @Hariraj_Rathod ఇప్పుడే సన్‌రూఫ్‌తో టాటా పంచ్ EV లాంగ్ రేంజ్ ఎంపవర్డ్+ని బుక్ చేసుకున్నారు.
ఇది 3.3kW ఛార్జర్‌తో టాప్ మోడల్ వేరియంట్. అయితే టాటా మోటార్స్ ఇంకా టాటా పంచ్ ఈవీ ధరలను వెల్లడించనప్పటికీ, మొత్తం ధర రూ. 16,13,729ని చూపుతూ అతనికి ఇమెయిల్ వచ్చింది" అని పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు Tesla Club India నుండి వచ్చిన మరో పోస్ట్ పంచ్ EV అడ్వెంచర్ LR వేరియంట్.

టాటా పంచ్ ఈవీ అడ్వెంచర్ LR వేరియంట్ 3.3 kW ఛార్జర్‌తో వస్తుంది. బుక్ చేసిన ఈ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,73,846 గా పోస్ట్‌లో పేర్కొన్నారు. టాటా పంచ్ ఈవీ అడ్వెంచర్ వేరియంట్ సెకండ్-టు-బేస్ వేరియంట్.
కాగా ఈ పోస్ట్‌లను టాటా మోటార్స్ గుర్తించింది. టెస్లా క్లబ్ ఇండియా షేర్ చేసిన పోస్ట్‌పై స్పందించింది. ఇదంతా సాంకేతిక సమస్యగా పేర్కొంది. సిస్టమ్ లోపం కారణంగా ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చిందని, సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపింది. అధికారిక ధరలను లాంచ్ సమయంలో వెల్లడిస్తామని స్పష్టం చేసింది.

ఈ పోస్ట్‌పై టాటా స్పందించిన తీరును చూస్తుంటే.. టాటా పంచ్ ఈవీ ధర ఖచ్చితంగా ఇలా ఉంటుందని చెప్పలేం. అయితే టాటా మోటార్స్ నుంచి అత్యంత సరసమైన ధరలో లభిస్తున్న కారు Tata Tiago EV ధర రూ. 8.69 లక్షల నుండి రూ. 12.04 లక్షల మధ్య ఉంది.
దాని EV లైనప్‌లో అత్యంత ఖరీదైన మోడల్, Nexon EV ధర రూ. 14.74 లక్షల నుంచి రూ. 19.94 లక్షల మధ్య ఉంది. కాగా సరికొత్త పంచ్ EV ఈ రెండు మోడళ్ల మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కంపెనీ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది.

అయితే టాటా పంచ్ ఈవీ ఫీచర్ ప్యాక్‌గా రానుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్‌లు, వెంటిలేటెడ్ లెథెరెట్ ఫ్రంట్ సీట్లు, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఇన్‌బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, మల్టీ-మోడ్ రీజెన్, LR వెర్షన్ కోసం కంట్రోల్ నాబ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్ట్ చేయబడిన కారు ఫీచర్లు ఇంకా డజన్ల కొద్దీ ఫీచర్లు ఉన్నాయి. అయితే టాటా పంచ్ EV పవర్‌ట్రెయిన్ వివరాలు అందుబాటులో లేవు.

టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుందని సమాచారం. ఈ కారు MR (మీడియం రేంజ్) మరియు LR (లాంగ్ రేంజ్) ఆప్షన్లతో రానుంది. MR 25 kWh బ్యాటరీతో 330 కి.మీ రేంజ్‌తో వస్తుందని అంచనా.. LR 35 kWh బ్యాటరీతో 460 కి.మీతో రావొచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications








