డ్రైవర్ లేకుండానే రోడ్లపై వెళ్తా అంటున్న ఎలాన్ మస్క్ రోబో ట్యాక్సీ
చాలా కాలంగా ఎదురుచూస్తున్న డ్రైవర్‌లెస్ రోబో ట్యాక్సీ(Cybercab robotaxi), రోబో వ్యాన్(Robo Van) మోడల్స్‌ను ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా ఆవిష్కరించారు. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్‌లో నిర్వహింంచిన 'వీ రోబోట్(we robot)' కార్యక్రమంలో మస్క్ వీటిని ప్రపంచానికి పరిచయం చేశారు. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా డ్రైవర్ లేకుండా ప్రయాణించే ట్యాక్సీని తీసుకొస్తామని గతంలోనే ప్రకటించిన మస్క్ ఎట్టకేలకు గర్వంగా ఆ మోడళ్లను విడుదల చేశారు. ఈ కొత్త వెహికల్ రాకతో టెస్లా కంపెనీ ఆర్థిక వృద్ధిపై బలమైన విశ్వాసాన్ని పొందింది. కంపెనీ అభివృద్ధికి ఇవి మరింత తోడ్పాటు అందిస్తాయని టెస్లా అధికారులు పేర్కొన్నారు.
ఈ ఈవెంట్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), అటానమస్ డ్రైవింగ్ పట్ల టెస్లా చేస్తున్న ఆవిష్కరణలను ప్రపంచానికి తెలియజేశారు. డ్రైవర్‌లెస్ రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌లో ఒక్క స్క్రీన్ తప్ప ఇంకేమీ ఉండవు. ఇతర వాటితో పోలిస్తే ఈ కొత్త మోడల్స్ చాలా సురక్షితమైనవని మస్క్ ప్రకటించారు.

రోబో ట్యాక్సీ(సైబర్ క్యాబ్): గతంలో సెల్ఫ్ డ్రైవింగ్ చేసే రోబో టాక్సీ లను ప్రపంచానికి పరిచయం చేస్తానని చెప్పిన మస్క్, ఇప్పుడు వాటిని ఆవిష్కరించారు. రెండు డోర్లతో ఉన్న దీనిలో స్టీరింగ్, వీల్ పెడల్ లేదు. ఒక్క స్క్రీన్ తప్ప ఇంకేమీ ఉండవు. దీనిలో ఇద్దరు ప్రయాణించవచ్చు. 2026 కల్ల వీటి ఉత్పత్తి ప్రారంభం అవుతుందని మస్క్ చెప్పారు. దీని ధర రూ.25 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది.
రోబో వ్యాన్: ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉండే విధంగా ఈ డ్రైవర్‌లెస్ వ్యాన్‌ను తీసుకొచ్చారు. దీని డిజైన్ ఇతర వాటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. వీటి చక్రాలు బయటకు కనిపించవు. ఈ వ్యాన్‌లో 20 మంది వరకు ప్రయాణించవచ్చు. దీనిని వచ్చే ఏడాదికల్లా టెక్సాస్, క్యాలిఫోర్నియా నగరాల్లోని రోడ్ల మీదకు తీసుకు రావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

లాంచ్ సందర్భంగా జరిగిన ఈవెంట్ ఎలాన్ మస్క్ X సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీనిలో భాగంగా రోబో ట్యాక్సీలో ఒకదానిలో స్టేజ్ పైకి వచ్చారు. ఈ ఈవెంట్ ఇప్పుడు డ్రైవర్‌లెస్ రవాణాపై ఉన్న అనుమానాలను, సందేహాలను నివృత్తి చేయడంతో పాటు పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంది.
ఇదే ఈవెంట్‌లో ఆప్టిమస్ రోబోట్స్‌ను కూడా పరిచయం చేశారు. మనుషుల మధ్య నడుస్తూ మనిషికి కావాల్సిన అన్ని పనులు చేయగలిగే సామర్థ్యాన్ని ఆప్టిమస్ రోబోట్స్ కలిగి ఉంటాయని మస్క్ ప్రకటించారు. ఇవి బరువులు బరువులు మోయడం వంటి పనులు చేస్తాయి. ఒక ఆప్టిమస్ రోబోట్ విలువ 20 వేల నుంచి 30 వేల డాలర్లు ఉంటుంది.

గతంలోనే మస్క్ మాట్లాడుతూ 2020 నాటికి టెస్లా కంపెనీ నుంచి రోబో ట్యాక్సీ ఉత్పత్తి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అయితే, అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత మస్క్ దీనిపై వివరణ ఇస్తూ, కంపెనీ మరింత నాణ్యమైన, సరసమైన రోబో ట్యాక్సీని తయారు చేయడంపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఆలస్యమైందని చెప్పారు.
పలు దఫాలుగా వాయిదాల తరువాత తాజాగా మస్క్ రోబో ట్యాక్సీ మోడల్‌ను ఆవిష్కరించారు. ఈ రోబో టాక్సీని నిర్మించే ప్రక్రియలో పాల్గొన్న పలువురు కీలక అధికారులు కంపెనీని విడిచిపెట్టినట్లు గతంలో కూడా వార్తలు వచ్చాయి. ఈ రోబో ట్యాక్సీ 100% పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని కలిగి ఉందని కంపెనీ చెబుతుంది.

అయితే ఇది రోడ్లపై వచ్చిన తర్వాత దాని సక్సెస్ ఎలా ఉంటుందో అని నిపుణులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ ప్లేస్‌లో రోబో ట్యాక్సీలను మోనటైజ్ చేయడానికి అవసరమైన రెగ్యులేటరీ అనుమతులలో టెస్లా వెనుకబడి ఉంది. ఈ రోబో ట్యాక్సీ ప్రాజెక్ట్ విజయవంతమైతే భవిష్యత్తులో టెస్లా రేంజ్ ఎక్కడికో చేరుతుంది.


Click it and Unblock the Notifications








