కొత్త ఏడాదిలో టాప్ ఎలక్ట్రిక్ కార్లపై ఓ లుక్కేయండి.. వీటి రాక కోసం చాలా మంది వెయిటింగ్..
భారతదేశం ప్రస్తుతం కొత్త భవిష్యత్తును చూస్తుంది. ఆటోమొబైల్ రంగంలో సాధారణ ఇంధనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుంది. కొత్త కార్లను కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న వారిలో చాలా మంది ఈవీ కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటం కారణంగా అందరూ కూడా తమ పాత కార్ల స్థానంలో కొత్త ఈవీలను చేర్చుకుంటున్నారు. దీంతో దేశీయంగా ఉన్నటువంటి కంపెనీలే కాకుండా అంతర్జాతీయంగా పేరుగాంచిన కార్ల తయారీ కంపెనీలు వరుసగా అధునాతన ఫీచర్లతో ఈవీలను లాంచ్ చేస్తున్నారు. రాబోయే కాలం మొత్తం కూడా ఎలక్ట్రిక్ వాహనాలదే. ఇప్పటికే టాప్ కంపెనీలు కొన్ని ఈవీ కార్లను విడుదల చేయగా, వాటిలో చాలా వరకు మెరుగైన సేల్స్‌ను సాధించాయి. దీంతో ఇదే ఊపును కొనసాగించడానికి వచ్చే ఏడాదిలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమయ్యాయి.
భారత ఆటోపరిశ్రమలో ప్రముఖ కంపెనీలుగా ఉన్నటువంటి టాటా మోటార్స్ (Tata Motors), మారుతీ సుజుకీ (Maruti suzuki),హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors), మహీంద్రా (Mahindra)కొత్త ఏడాదిలో దేశంలో ఈవీ కార్లతో దండయాత్ర చేయడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఉన్న కార్లకు కొనసాగింపుగా ఎలక్ట్రిక్ వెర్షన్లను తెస్తున్నారు. ఈ ఈవీలను 2025 ఏడాదిలో జరగబోయే ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో తీసుకురావడానికి కంపెనీలు సిద్ధం అయ్యాయి. రాబోయే కొత్త ఈవీలను క్రింది కథనంలో తెలుసుకుందాం..

Tata Harrier ev: టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారు వచ్చే ఏడాదిలో కొనుగోలుకు లభిస్తుంది. దీనిలో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. అంచనాల ప్రకారం దీని ప్రారంభ ధర రూ.30 లక్షలు(ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇది సింగిల్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో లభిస్తుంది. హారియర్ సింగిల్ ఛార్జింగ్‌పై దాదాపు 500 కి.మీ వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీని డిజైన్ సరికొత్తగా ఉంటుంది.
కారు లోపల డజన్ల కొద్ది లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, AC వెంట్‌లు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్ 2 ADAS, కారులో నుంచి చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా వంటి ఇతర పలు ఫీచర్లను హారియర్ ఈవీలో అందించే అవకాశం ఉంది.

Maruti Suzuki e vitara: మారుతీ సుజుకీ ఇ విటారా బడ్జెట్ ధరలో విడుదల కాబోతుంది. ఇది 49Kwh, 61Kwh బ్యాటరీ ఆప్షన్లతో లభించే అవకాశం ఉంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌తో 400 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఇంతకుముందు దీన్ని ఇటలీలోని మిలాన్ ఆటో షో 2024 ఈవెంట్‌లో ప్రదర్శించారు. 5 మంది ప్రయాణించడానికి కంఫర్ట్‌గా ఉంటుంది. అంచనాల ప్రకారం, ప్రారంభ ధర రూ.20 లక్షలకు పైనే ఉంటుంది.
Mahindra XUV700 EV: మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఈవీ రాబోయే కొత్త ఏడాది జనవరిలో మార్కెట్లోకి వస్తుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభించే అవకాశం ఉంది. దీన్ని XEV 7eగా పిలుస్తారు. ఈ కారులో 59 kWh, 79 kWh బ్యాటరీ ప్యాక్‌లను అందించవచ్చు. సింగిల్ ఛార్జింగ్‌తో దాదాపు 650 కి.మీ వరకు ప్రయాణిస్తుందని సమాచారం.

Hyundai creta ev: హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు 2025 జనవరిలో మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. క్రెటా ఇంధన వెర్షన్‌లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇది దేశంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న కార్లలో మెరుగైన స్థానంలో ఉంది. దీని డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఇదే కారును ఎలక్ట్రిక్ వేరియంట్‌లో తీసుకువస్తుంది. ఇది మార్కెట్లోకి వచ్చిన తరువాత ఇతర ఈవీ కార్లకు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీ ఎస్‌యూవీ రూ.22 లక్షల(ఎక్స్‌షోరూమ్) ప్రారంభ ధరతో వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. దీనిలో 45Kwh బ్యాటరీని అందించే అవకాశం ఉందని సమాచారం. సింగిల్ ఛార్జింగ్‌తో క్రెటా ఈవీ దాదాపు 500 కి.మీ వరకు ప్రయాణిస్తుందని తెలుస్తుంది. క్రెటా ఎస్‌యూవీలో ఉన్న విధంగానే ఈవీలో కూడా అధునాతన ఫీచర్లను అందించారు. అయితే ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను మాత్రం కొత్తగా మార్చారు.


Click it and Unblock the Notifications








