ఇండియా నం.1గా ఫోక్స్‌వ్యాగన్ వర్టుస్.. రోజూ 60 కార్ల అమ్మకాలు
దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా(Volkswagen India) నుంచి వచ్చిన ఒక మోడల్ అమ్మకాల పరంగా కీలక మైలు రాయిని సాధించింది. గతంలో విడుదలైన వర్టుస్(Virtus) తాజాగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. లాంచ్ అయిన 28 నెలల్లోనే ఈ మోడల్ ఇప్పటి వరకు హోల్‌సేల్‌గా 50,000 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇదే సమయంలో 2024 క్యాలెండర్ సంవత్సరంలో మొత్తం 17,000 యూనిట్ల అమ్మకాలను సాధించి, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం సెడాన్‌గా ఇది అవతరించింది. ప్రతిరోజూ దాదాపు 60కి పైగా అమ్మకాలు నమోదు అయ్యాయి. లాంచ్ అయిన కొద్ది కాలంలోనే ఈ రికార్డును నెలకొల్పడం ఫోక్స్‌వ్యాగన్‌కు చాలా సంతోషం కలిగించే విషయం.
ఈ మోడల్‌తో పాటు టైగున్(Taigun) వేరియంట్ సైతం అమ్మకాల పరంగా దూసుకుపోయింది. ఈ ఏడాది రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో వర్టుస్, టైగున్ మోడళ్లు రెండు కూడా అమ్మకాల పరంగా లక్ష మైలురాయిని అధిగమించాయి. ముఖ్యంగా వర్టుస్ డిజైన్, దాని ఆకట్టుకునే పనితీరు, అధునాతన ఫీచర్లు, అధిక భద్రత ప్రమాణాల కారణంగా భారతీయ వినియోగదారులలో బలమైన నమ్మకాన్ని పొంది ప్రీమియం సెడాన్‌గా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

దీనిలో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే , వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఆధునిక అప్‌డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ వంటి అదనపు ఫీచర్లను దీనిలో అందించారు.
ముఖ్యంగా వర్టుస్ భారత వినియోగదారుల భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగులు, 40కిపైగా సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. ప్రమాద సమయంలో పెద్దలు, పిల్లల రక్షణకు సంబంధించి ఈ మోడల్ గ్లోబల్ ncap(GNCAP)క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. పెద్దల భద్రత పరంగా 34కి 29.42 పాయింట్లు, పిల్లల భద్రతలో 49కి 42 పాయింట్లు సాధించింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఫోక్స్‌వ్యాగన్ వర్టుస్ GT లైన్, GT ప్లస్‌ను విడుదల చేసింది. వీటిలో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. వేరియంట్‌లను బట్టి ధరలు రూ. 11.56 లక్షల నుండి రూ. 19.41 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. బడ్జెట్ ధరలో లభించడం, అదిరిపోయే డిజైన్, అత్యాధునిక సదుపాయాలతో మార్కెట్లో అందుబాటులో ఉండటంతో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి.
ఈ మైలురాయిని సాధించడంపై ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, వర్టుస్ మోడల్ అమ్మకాల్లో ఇండియా నం.1 ప్రీమియం సెడాన్‌గా అవతరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన కస్టమర్లందరికీ కృతజ్ఞతలు. ఈ మోడల్‌ను విడుదల చేసినప్పటి నుంచి ప్రతి 24 గంటలకు 60 వర్టస్ సెడాన్‌లను విక్రయించామని అన్నారు.
కస్టమర్ల ఇష్టాలకు అనుగుణంగా, వారి విశ్వాసాన్ని పొందుతూ 50,000 కార్ల విక్రయాలను నమోదు చేయడం ఫోక్స్‌వ్యాగన్ విజయానికి నిదర్శనం. ఎదురుగాలులు ఎదుర్కొన్నప్పటికి కూడా వర్టుస్, టైగున్ మోడళ్లు ప్రజల ఆదరాభిమానాలను పొందాయని ఆశిష్ గుప్తా అన్నారు. భారత్ 2.0 క్రింద 3 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో ఈ రెండు మోడల్‌లు మొత్తం అమ్మకాల్లో దాదాపు 18.5 % వాటాను అందించాయి.
2024 మూడవ త్రైమాసికం(జులై-సెప్టెంబర్) ముగింపులో ఫోక్స్‌వ్యాగన్ మొత్తం వాహన అమ్మకాల్లో భారత్‌లో 6.5 లక్షల హోల్‌సేల్ మైలురాయిని అధిగమించింది. ఇది కంపెనీకి చాలా ప్రోత్సాహాన్ని అందించే విషయం. పండుగల సీజన్ నడుస్తున్న తరుణంలో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. తదుపరి త్రైమాసికం ముగింపు నాటికి ఈ సంఖ్య పెరుగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వర్టుస్ హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా మోడళ్లకు ప్రత్యర్థిగా ఉంది.


Click it and Unblock the Notifications








