దూకుడు మీదున్న షావోమి కొత్త ఎలక్ట్రిక్ కారు.. విడుదలైన 24 గంటల్లోనే 89 వేల బుకింగ్స్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తాజాగా తన తొలి ఎలక్ట్రిక్ కారు షావోమి ఎస్‌యూ7ను విడుదల చేసింది. తక్కువ ధరలో అధునాతన సాంకేతిక ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకురావడం ద్వారా భారత్‌లో Xiaomi ప్రసిద్ధి చెందింది. కాగా ఇప్పుడు Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు తిరుగులేని రికార్డును సాధించింది.
ఈ Xiaomi ఎలక్ట్రిక్ కారు చైనాలో విడుదలైన 24 గంటల్లోనే 88,898 యూనిట్ల బుకింగ్‌లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇంత త్వరగా ఓ కారుకు రికార్డు స్థాయిలో బుకింగ్స్ రావడం గ్లోబల్ మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కొత్త Xiaomi SU7 ఎలక్ట్రిక్ సెడాన్ చైనాలోని 29 నగరాల్లో షోరూమ్‌ల్లో అందుబాటులో ఉంది.

ఏప్రిల్‌లో ఈ కారు డెలివరీలను ప్రారంభించాలని సంస్థ యోచిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు.. BYD మరియు టెస్లాతో Xiaomi SU7 ఎలక్ట్రిక్ సెడాన్ పోటీపడుతోంది. దీనిని సంస్థ రూ. 2,15,900 యువాన్లు (సుమారు రూ. 25.34 లక్షలు) ప్రారంభ ధరతో విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇది అతి తక్కువ ధరలో విడుదల చేసింది.
ఈ కొత్త Xiaomi SUV ఎలక్ట్రిక్ కారు 3 వేరియంట్లు మరియు 9 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. Xiaomi SU7 ఆకర్షణీయమైన డిజైన్ మరియు అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. డిజైన్ పరంగా స్పోర్టీ మరియు యంగ్ డిజైన్ లక్షణాలతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. లో-స్లంగ్ డిజైన్ మరియు కూపే లాంటి రూఫ్‌లైన్ ద్వారా మరింత మెరుగ్గా కనిపిస్తుంది.

రాత్రి సమయంలో మెరుగైన విజిబిలిటీ అందించేలా.. అడాప్టివ్ LED హెడ్‌లైట్‌లను అమర్చారు. పెద్ద 56-అంగుళాల హెడ్స్-అప్ డిస్‌ప్లేతో పాటు ఈ ఎలక్ట్రిక్ కారులో 16 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉంది. అదనంగా, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 2 Xiaomi Pod 6S Pro టాబ్లెట్‌లను సంస్థ అందించింది.
Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారులో వైర్‌లెస్ ఛార్జింగ్ కోసం ఫోన్ హోల్డర్‌ను అందించడం ద్వారా ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో స్టాండర్డ్ 50W ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఉంటుంది. దీని కోసం డోర్ ప్యాడ్‌లో ప్రత్యేక పాకెట్స్ ఉన్నాయి. ఇది 4.6-లీటర్ రిఫ్రిజిరేటర్‌తో పాటు యాంటీ-వోబుల్ మ్యాట్, అండర్-సీట్ గొడుగు హోల్డర్, 25-స్పీకర్ ఆడియో సిస్టమ్ మరియు పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఫీచర్లు ప్రత్యేకం.

బ్యాటరీ ప్యాక్ విషయానికొస్తే ఈ Xiaomi SU7 ఎలక్ట్రిక్ సెడాన్‌లో బేస్-స్పెక్ SU7 73.6kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది 700 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. మోడల్ 295 bhp ఎలక్ట్రిక్ మోటారు ద్వారా శక్తిని సరఫరా చేస్తుంది. 5.28 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 210 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు మిడ్-స్పెక్ SU7 ప్రో వేరియంట్, ఈ మోడల్ అత్యధికంగా 94.3 kWhని ప్యాక్‌తో వస్తుంది. గరిష్ఠంగా 830 km రేంజ్‌ను అందిస్తుంది. ఈ మోడల్ 5.7 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుండగా.. ఈ వేరియంట్ ధర 2,45,900 యువాన్లు (రూ. 28.87 లక్షలు)గా ఉంది.

టాప్ స్పెక్ SU7 మ్యాక్స్ 101 kWh బ్యాటరీ ప్యాక్.. AWD సామర్థ్యంతో పనిచేస్తుంది. ఇది 663 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది గంటకు 265 కి.మీ గరిష్ట వేగంతో, కేవలం 2.78 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. SU7 గరిష్ఠంగా 800 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఈ మోడల్ ధర 2,99,900 యువాన్లు (రూ. 35.20 లక్షలు).
ఈ కొత్త Xiaomi SU7 ఎలక్ట్రిక్ సెడాన్ పొడవు 997mm, వెడల్పు 1963mm, ఎత్తు 1440mm మరియు 3000mm వీల్‌బేస్ కలిగి ఉంది. దాదాపు 5-మీటర్ల పొడవు ఉన్నప్పటికీ, Xiaomi ఎలక్ట్రిక్ కారు 5.7 మీటర్ల చిన్న టర్నింగ్ రేడియస్‌ని కలిగి ఉంది. ఎలక్ట్రిక్ కారులో 517 లీటర్ల బూట్ స్పేస్ మరియు ముందు భాగంలో 105-లీటర్ బూట్ స్పేస్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








