20 లక్షల మంది నమ్మారు.. మీరు ఇంకా ఎలక్ట్రిక్ వాహనం కొనేందుకు ఆలోచిస్తున్నారు ?
మనదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం కొనసాగుతోంది. 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు ఉన్న ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 20 లక్షల మార్కును దాటాయి. జేఎంకే రీసెర్చ్ అందించిన నివేదిక ప్రకారం.. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15.31శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 20,26,184 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది 2024 ఆర్థిక సంవత్సరం కంటే 2,69,075 వాహనాలు ఎక్కువ.
ఈ దూకుడులో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ ముందుంది. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో వీటి వాటా 59.38శాతంగా ఉంది. 12,03,223వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ విభాగం గతేడాదితో పోలిస్తే 18.76శాతం వృద్ధిని సాధించింది. ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ వాటా స్వల్పంగా 4.74శాతం తగ్గి 29.76శాతానికి చేరుకుంది. ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వాటికి దగ్గరదగ్గరగా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ అమ్మకాలు కూడా గణనీయమైన పెరుగుదలను చూపించాయి. మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో వీటి వాటా 34.69శాతంగా ఉంది, అంటే 7,02,799 వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ విభాగం వార్షికంగా 9.63శాతం మేర వృద్ధిని సాధించింది. ముఖ్యంగా ప్యాసింజర్ మోడళ్ల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది.
ఈ జాబితాలో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ ప్యాసింజర్ విభాగంలో 10.23శాతం, గూడ్స్ విభాగంలో 8.42శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. బజాజ్ ఆటో, వైసి ఎలక్ట్రిక్ రెండు విభాగాల్లోనూ వాటికి దగ్గరల్లోనే ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్ల వాటా తక్కువగా 4.57శాతం ఉన్నప్పటికీ, వాటి ప్రభావం గణనీయంగా ఉంది. 1,10,748 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 9.86శాతం పెరుగుదల నమోదైంది. టాటా మోటార్స్ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే, దాని మార్కెట్ వాటా 15.9శాతం తగ్గినప్పటికీ, ఇప్పటికీ 53.10శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. MG, మహీంద్రా వరుసగా 28.17శాతం, 7.73శాతం మార్కెట్ వాటాతో వాటిని ఫాలో అవుతున్నాయి.
అయితే, ఎలక్ట్రిక్ బస్సుల విభాగం స్వల్పంగా క్షీణించింది. అమ్మకాలు 3.64శాతం తగ్గి 3,570 బస్సులకు చేరుకున్నాయి. టాటా మోటార్స్ మార్కెట్‌ను నడిపించినప్పటికీ, దాని ప్రజాదరణ గణనీయంగా తగ్గింది. మార్కెట్ వాటా తగ్గి 29.64శాతానికి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తన మార్కెట్ వాటాను 10.36శాతం పెంచుకుని 25.83శాతానికి చేరుకుంది.

గత 11ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల వృద్ధి అద్భుతంగా ఉంది. 2015ఆర్థిక సంవత్సరంలో కేవలం 2,344 వాహనాలు అమ్ముడవగా, ఈ గ్యాప్‌లో మొత్తం 61,65,964 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ పెరుగుతున్న రవాణా విధానానికి మద్దతుగా, భారతదేశం అంతటా 26,367 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు అయ్యాయి. ఇది ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలుపుతుంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : భారతదేశ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ బలమైన వృద్ధిని కనబరుస్తోంది. ఎలక్ట్రిక్ టూ-వీలర్లు, త్రీ-వీలర్లు ఈ వృద్ధికి నాంది పలుకుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాల్లో స్వల్ప క్షీణత ఉన్నప్పటికీ మొత్తం ట్రెండ్ చాలా సానుకూలంగా ఉంది. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ రవాణాకు ఉజ్వల భవిష్యత్తును సూచిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








