గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆల్టో! మంచి మైలేజ్, సేఫ్టీ ఫీచర్స్, హైబ్రిడ్ ఇంజిన్.. అక్కడ లాంచ్!
ఇండియాలో మారుతీ సుజకీకి చెందిన ఆల్టో అంటే తెలియని వారు ఉండరు. దేశంలో పేద, మధ్య తరగతి వారికి బాగా ఇష్టమైన మోడల్. ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు ఇది కనిపిస్తుంది. ఇక్కడ మాదిరిగానే మారుతీ సుజుకీ మాతృసంస్థ అయిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ జపాన్‌లో ఇదే కారును విక్రయిస్తుంది. అక్కడి మార్కెట్లో ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్‌కి ఉన్న గిరాకీకి మాములుగా ఉండదు. అక్కడి ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా మరింత ఆధునికంగా, ఆకర్షణీయంగా మార్చి కంపెనీ విక్రయిస్తుంది. ఇప్పటికే 9వ తరం ఆల్టో 2021 చివరిలో మార్కెట్లోకి వచ్చిన తర్వాత మంచి స్పందనను పొందింది. దీంతో దీనికి కొనసాగింపుగా కంపెనీ 2025 సుజుకి ఆల్టోను మరింత కొత్తగా అప్‌డేట్ చేసి తాజాగా విడుదల చేసింది.
ఈ కొత్త మోడల్ డిజైన్ పరంగా చెప్పాలంటే కొన్ని కీలక మార్పులతో లేటెస్ట్‌గా మారింది. మెరుగైన హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, బంపర్ కారుకు కొత్తగా కనిపిస్తాయి. ఇది కొత్తగా టెర్రకోట పింక్ అనే మోనోటోన్ షేడ్లో కూడా లభిస్తోంది. ఈ కలర్ జపనీస్ మార్కెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చిన్నకారు అయినా స్టైల్ విషయంలో ఏమాత్రం రాజీపడట్లేదని కలర్ చెబుతుంది.

కొత్తగా జపాన్‌లో విడుదలైన 2025 సుజుకీ ఆల్టో డిజైన్ మార్పులతోనే కాదు, భద్రతా రంగంలోనూ మెరుగై వచ్చింది. ముఖ్యంగా, రాడార్ ఆధారిత ADAS(Advanced Driver Assistance Systems) వంటి సురక్షిత డ్రైవింగ్ ఫీచర్లను కారులో అందించారు. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం వంటి ఫీచర్ లభిస్తుంది. దీంతో ముందు వస్తువును గుర్తించి, వాహనమే ఆటోమేటిక్‌గా బ్రేక్ వేయగలదు. అంతేకాకుండా లేన్ డిపార్చర్ అసిస్ట్ వంటి వివిధ సాంకేతిక అంశాలు ఉన్నాయి.
ఇది వాహనం లేన్‌ను తప్పించి వెళ్తున్నట్లయితే వెంటనే హెచ్చరికలు ఇస్తుంది లేదా స్వల్పంగా స్టీరింగ్ సరిచేస్తుంది. ఇవి సిటీలో నడుపుతున్నప్పుడు కాకపోయినా, హైవేలపై ఎక్కువ ప్రయోజనం కలిగించే ఫీచర్లు. ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఒకటి 58 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 658 సీసీ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్‌తో లభిస్తుంది. భద్రతపరంగా కొత్తగా మారినట్లే, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా సుజుకి ఆల్టో ముందు ఉంటుంది.

ఈ రెండు ఇంజన్ వేరియంట్లు కూడా CVT గేర్‌బాక్స్‌తోనే అందుబాటులో ఉన్నాయి, ఇది ట్రాఫిక్‌లో స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కారులో ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) లాంటి రెండు డ్రైవ్‌ట్రైన్ వేరియంట్లు అందించారు. ఇది జపాన్ మార్కెట్‌కి ప్రాధాన్యతనిస్తూ, నగర ప్రయాణాలకూ, కొంత వరకు రఫ్ రోడ్లకూ సరిపోయేలా రూపొందించబడింది. ఇది మైలేజ్ విషయంలో కూడా బాగానే ఇస్తుంది.
మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే ఫ్రంట్-వీల్ డ్రైవ్ వేరియంట్లు, లీటరుకు సుమారు 28.2 కి.మీ మైలేజీని అందిస్తాయని కంపెనీ చెబుతోంది.మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కారణంగా కారు టార్క్‌లో హెల్ప్ చేయడమే కాక, ఇంధనాన్ని పొదుపుగా వాడేలా చేస్తుంది. ధర విషయానికి వస్తే, తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త ఆల్టో ప్రారంభ ధర 1,142,900 యెన్, అంటే సుమారుగా రూ. 6.75 లక్షలు (ఇండియన్ కరెన్సీ)గా ఉంది.

అయితే ఈ ధర జపాన్ మార్కెట్‌కి సంబంధించినదే గమనించాలి. భారత్‌లో విడుదల అయితే, అక్కడి స్థానిక ఉత్పత్తి, పన్నులు, ఫీచర్ కట్స్ ఆధారంగా ఇది మరింత అందుబాటు ధరకు ఉండే అవకాశం ఉంది. భారతదేశంలో కొనుగోలుకు ఉన్న మారుతీ సుజుకీ ఆల్టో ప్రారంభ ధర రూ.4 లక్షల నుంచి మొదలుకుని గరిష్ట ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications








