కొత్త ఫీచర్లతో వచ్చేసిన టాటా కొత్త సెడాన్ కారు.. రూ.6 లక్షల్లో కొనేయొచ్చు!
దిగ్గజ సంస్థ టాటా మోటార్స్... కస్టమర్లను తమ వాహనాలతో ఆకట్టుకుంటూ భారత ఆటో మొబైల్ మార్కెట్లో టాప్‌లో కొనసాగుతోంది. అందుబాటు ధరలో ఉండే వాహనాలను తయారు చేస్తూ అన్ని వర్గాల వారికి చేరువైంది. ఈ కంపెనీ నుంచి కొత్త లాంఛింగ్స్ కోసం వినియోగదారులే కాదు, ప్రత్యర్థి సంస్థలు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తుంటాయి. ఈ 2025లో కొత్త ప్లాన్స్‌తో ముందుకు వస్తోందీ సంస్థ. ఇందులో భాగంగా.. టాటా టిగోర్ సెడాన్ కారు 2025 కొత్త మోడల్‌ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. రూ.6 లక్షల ఎక్స్ షో రూమ్ ధరలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కొత్త సెడాన్‌లో స్పెషాలిటీస్ ఏం ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఈ టిగోర్ 2025 కారు రూపంలో ఎలాంటి మార్పులు చేయకపోయినా దీని డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చేసి, కొన్ని కొత్త ఫీచర్లను జోడించి మార్కెట్లోకి తీసుకువచ్చారు. డిజైన్ విషయానికి వస్తే.. దీని ఫ్రంట్ గ్రిల్, బంపర్‌లో కొద్ది మార్పులు చేశారు. దీని రియర్ బంపర్‌ను రీడిజైన్ చేశారు. అయితే... దీని 15- అంగుళాల అలాయ్ వీల్స్, coupe-like డిజైన్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

కొత్త ఫీచర్లు ఇవే: 2025 టాటా టిగోర్ మోడల్ ఫీచర్లలో కొన్ని కీలకమైన మార్పులు చేశారు. బేస్ మోడల్ నుంచి దీంట్లో ప్రస్తుతం ఇల్యూమినేషన్‌తో కూడిన స్మార్ట్ స్టీరింగ్ వీల్, పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అంతేగాకుండా.. దీంట్లో కొత్త ఫ్యాబ్రిక్ సీట్లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, LED టెయిల్ లైట్లు వంటివి ఉన్నాయి.
ఇక టాప్ వేరియంట్లు అయిన XZ plus Lux లో వైర్లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.25 అంగుళాల ఫ్లోటింగ్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం ఉంటుంది. దీంట్లో 360 డిగ్రీ కెమెరా, షార్క్ ఫిన్ యాంటెనా, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, లెదర్- ర్యాప్ డ్ స్టీరింగ్ వీల్, రెయిన్- సెన్సింగ్ వైపర్లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉంటాయి.
టాటా టిగోర్ ఇంజిన్ పరిశీలిస్తే.. ఈ కొత్త మోడల్‌లోనూ అంతకుమందు ఉన్నట్లుగా 1.2 లీటర్ 3- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5- స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటెడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానించి ఉంటుంది. పెట్రోల్ వెర్షన్ 85bhp పవర్, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్ 72bhp పవర్, 95Nm torque ఉత్పత్తి చేస్తుంది.
ఈ టిగోర్ కారు ధర గమనిస్తే.. ఇది వేరియంట్‌ను బట్టి వేరువేరుగా ఉంటుంది. అంతకుముందు ఉన్న బేస్ వేరియంట్ XE ని ప్రస్తుతం కొనసాగించడం లేదు. ప్రస్తుతం XM వేరియంట్‌తో రేంజ్ మొదలవుతుంది. దీని (ఎక్స్- షోరూమ్) ధర రూ.6 లక్షలుగా ఉంది. అయితే ఇది అంతకుముందు ఉన్న XM వేరియంట్ ధర రూ.6.60 లక్షల కంటే తక్కువ కావడం గమనార్హం.
దీంట్లో కొత్త టాప్-ఎండ్ వేరియంట్‌గా XZ Plus Lux ను పరిచయం చేశారు. దీని ధర (ఎక్స్- షోరూమ్) రూ.8.50 లక్షలుగా ఉంది. అదే సమయంలో XZ plus వేరియంట్ ధర రూ.7.90లక్షలుగా ఉంది. ఇది అంతకుముందు కంటే రూ.10,000 అధికం.
సీఎన్‌జీ ఆప్షన్లలో చూస్తే.. రెండు కొత్త వర్షన్లను జోడించారు. XM స్థానంలో XT వేరియంట్‌ను తీసుకువచ్చారు. దీని (ఎక్స్ షోరూమ్) ధర రూ.7.70 లక్షలుగా ఉంది. దీంట్లో టాప్ వేరియంట్ అయిన XZ plus Lux రూ.9.50 లక్షలకు అందుబాటులో ఉంది. ఇక దీంట్లో XZ plus ధర రూ.8.90 లక్షలుగా ఉంది.
డ్రైవ్ స్పార్క్ వ్యాఖ్య: డిజైన్ పరంగా అంతకుముందు వెర్షన్లలో ఉన్న అంశాలనే ఈ కొత్త మోడల్ లో కొనసాగించినప్పటికీ.. అప్డేట్ అయి వచ్చిన ఈ కారుతో మార్కెట్లో పోటీ గట్టిగానే ఉంటుందని చెప్పవచ్చు. అందుబాటు ధరలో ఉంటూ, మంచి పర్ఫెర్మెన్స్ అందిస్తున్న కారణంగా భారత వినియోగదారులను ఈ కారు ఆకర్షిస్తోంది.


Click it and Unblock the Notifications








