కారు వేనుమా కారు ఇరుకు.. సేఫ్టీ వేనుమా సేఫ్టీ ఇరుకు.. 2024లో కళ్లు మూసుకుని కొనేకార్లు ఇవే!
కార్లను కొనేముందు ఎవరైనా సరే అనేక విషయాలను పరిశీలిస్తారు. డిజైన్, ధర, ఫీచర్లను మొదలుకొని ప్రతీది చూస్తారు. ముఖ్యంగా కారులో ప్రయాణం సేఫ్టీనా కాదా అనేది అందరూ తెలుసుకోవాలనుకుంటారు. ఈ విషయంలో కార్ల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన కొత్త విధానం భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP/ BNCAP - Bharat New Car Assessment Programme). ఈ ఏడాది 10 కార్లను భారత్ ఎన్‌క్యాప్ ద్వారా టెస్టింగ్ చేయగా.. ఒక్క ఎస్‌యూవీ మినహా అన్ని కార్లు, ఎస్‌యూవీలు 5 స్టార్ రేటింగ్ పొందాయి. ఆ వివరాలు మీకోసం...
టాటా మోటార్స్ సంస్థ నుంచి ఈ ఏడాది ఐదు కార్లను ఎన్‌క్యాప్ విధానంగా క్రాష్ టెస్ట్ చేయగా.. ఐదు కార్లు కూడా సేఫెస్ట్ కార్ల జాబితాలో చోటు సంపాందించాయి. అలాగే మహీంద్రా సంస్థ నుంచి మూడు కార్లను హ్యూందాయ్, సిట్రోయెన్ సంస్థ నుంచి ఒక్కో కారును పరీక్షించారు. ఏఏ కార్లు సేఫ్టీలో అదరగొట్టాయో ఇక్కడ తెలుసుకుందాం..

టాటా నెక్సాన్, నెక్సాన్ ఈవీ: ఈ ఏడాది టాటా నెక్సాన్ ఐసీఈ వెర్షన్‌తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కార్లను భారత్ ఎన్‌క్యాప్ లో టెస్టింగ్ చేశారు. ఈ రెండు కార్లు కూడా 5 స్టార్ రేటింగ్ దక్కించుకున్నాయి. నెక్సాన్ అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకుగాను 29.41 స్కోర్ చేసింది. చిన్నపిల్లల రక్షణ విషయంలో 49 పాయింట్లకు గాను 43.88 పాయింట్లు దక్కించుకుంది.
టాటా కర్వ్, టాటా ఈవీ: కర్వ్ పేరుతో టాటా మోటార్స్ సంస్థ ఎలక్ట్రిక్ కారుతో పాటు, ICE వెర్షన్ కారు మోడళ్లను లాంచ్ చేసింది. ఈ రెండు కార్లను భారత్ ఎన్‌క్యాప్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. ఈ రెండూ ఒకే రకమైన బాడీ వర్క్ కలిగి ఉంటాయి. అందువల్ల ఈ కార్లు సేఫ్టీలో దుమ్మురేపాయి.

కర్వ్ ఎస్‌యూవీ కారు పెద్దల రక్షణ 32 పాయింట్లకు గాను 29.5 పాయింట్లు సాధించింది. చిన్నపిల్లల రక్షణకు సంబంధించి 49 పాయింట్లకు గాను 43.66 స్కోర్ చేసింది. కర్వ్ ఈవీని చూస్తే అడల్ట్ ప్రొటెక్షన్ విషయంలో 30.81 పాయింట్లు, చిన్నపిల్లల రక్షణ విషయంలో 44.83 పాయింట్లు సాధించింది.
పవర్ ఫుల్ పంచ్: టాటా నుంచి పంచ్ ఈవీ భారత ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో అడల్ట్ విభాగంలో 32 పాయింట్లకు గాను 31.46 పాయింట్లు సాధించి, అన్నీ ఈవీల కంటే అత్యధిక స్కోర్ సాధించిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. చైల్డ్ ప్రొటెక్షన్ విషయంలో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు సాధించింది.

మహీంద్రా థార్ రాక్స్: దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా నుంచి థార్ రాక్స్ మోడల్ కూడా ఈ ఏడాది 5 స్టార్ రేటింగ్ సాధించింది. పెద్దవాళ్ల రక్షణ విషయంలో థార్ రాక్స్ 32 పాయింట్లకు గాను 31.09 పాయింట్లు సాధించగా... చైల్డ్ ప్రొటెక్షన్‌కు సంబంధించి 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు సాధించింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ: ఈ ఏడాది భారత్ ఎన్‌క్యాప్ విధానంలో పరీక్షించగా 5 స్టార్ రేటింగ్ సాధించిన నాలుగో కారు ఇది. అడల్ట్ ప్రొటెక్షన్ విషయంలో 32 పాయింట్లకుగాను 30.38 పాయింట్లు సాధించింది. చిన్న పిల్లల రక్షణ విషయంలో 49 పాయింట్లకు గాను 43 పాయింట్లు స్కోర్ చేసింది.

మహీంద్రా XUV3XO: మహీంద్రా నుంచి ఈ ఏడాది విడుదలైన లెటెస్ట్ సబ్- కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన మహీంద్రా XUV3XO మోడల్ కారు కూడా 5 స్టార్ రేటింగ్ సాధించి తగ్గేదేలా అనిపించింది. అడల్ట్ ప్రొటెక్షన్ విషయంలో ఈ కారు 32 పాయింట్లకుగాను 29.36 పాయింట్లు సాధించగా.. చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో 49 పాయింట్లకుగాను 43 పాయింట్లు సాధించింది.
హ్యూందాయ్ టక్సన్: హ్యూందాయ్ నుంచి సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలికారు హ్యూందాయ్ టక్సన్ ఎస్‌యూవీ. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 32 పాయింట్లకు గాను 30.84 పాయింట్లు సాధించగా... చైల్డ్ ప్రొటెక్షన్ విషయంలో 49 పాయింట్లకుగాను 41 పాయింట్లను ఈ కారు స్కోర్ చేసింది.
సిట్రోయెన్ బసాల్ట్: భారత్ ఎన్‌క్యాప్ టెస్టింగ్‌లో సిట్రోయిన్ సంస్థ చేదు ఫలితాలు చూసింది. ఈ టెస్టింగ్‌లో సిట్రోయెన్ బసాల్ట్ 5 స్టార్ రేటింగ్ దక్కించుకోలేకపోయింది. అడల్ట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకుగాను 26.19 పాయింట్లను ఈ కారు సాధించగా.. చైల్డ్ ప్రొటెక్షన్ విభాగంలో... 49 పాయింట్లకుగాను 35.90 పాయింట్లు స్కోర్ చేసింది.


Click it and Unblock the Notifications








