ఒక్క ఛార్జ్ తో 500కి.మీ.. ఫుల్ లగ్జరీ..మార్కెట్లను కొల్లగొట్టేందుకు రాబోతున్న టాటా నుంచి మరో సంచలనం
టాటా మోటార్స్ నుంచి మరో పెద్ద అడుగు పడబోతోంది. భారత మార్కెట్లో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా, సంస్థ సరికొత్త 'టాటా సియెరా' ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆకట్టుకునే డిజైన్, లగ్జరీ ఫీచర్లుతో రానున్న ఈ కారు ముందుగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో వచ్చి, ఆ తర్వాత పెట్రోల్/డీజిల్ ఆప్షన్లలో కూడా అందుబాటులోకి రానుంది. ఈ కారు ధర, ఫీచర్లు, లాంచ్ తేదీ వివరాల గురించి తెలుసుకుందాం.
టాటా మోటార్స్ (Tata Motors) అంటే నమ్మకానికి మరో పేరు. ఇటీవల కాలంలో మన దేశ మార్కెట్లో టాటా ఎస్‌యూవీలు విదేశీ కార్లకు గట్టి పోటీ ఇస్తూ, ప్రజలు కూడా ఎగబడి కొంటున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు రాబోయే కొద్ది నెలల్లో సరికొత్త ఎస్‌యూవీని అట్టహాసంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

టాటా కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త 'సియెరా' (Sierra) కారును విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట ఎలక్ట్రిక్ వెర్షన్ (EV) లో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత, పెట్రోల్/డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తయారీ దశలో ఉన్న టాటా సియెరా ఎస్‌యూవీని ప్రదర్శించారు. బయట నుంచి చూస్తే ఇది చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు బాడీ కలర్ బి-పిల్లర్స్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ సియెరా, పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి, ఎక్కువ దూరం వెళ్లడానికి వీలుగా 75 కిలో వాట్ (kWh) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది 500 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజ్) ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు.
ఇక ఇంధనంతో నడిచే సియెరా మోడల్ పవర్ఫుల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉండవచ్చు. దీనికి 6-స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్ లేదా 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఉండొచ్చు. మైలేజ్ విషయానికి వస్తే లీటరుకు 18 నుండి 20 కిలో మీటర్ల వరకు ఇవ్వగలదని అంచనా.

ఇంధనంతో నడిచే సియెరా మోడల్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని, దాదాపు రూ.10 లక్షల ప్రారంభ ధరతో రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ మోడల్ మాత్రం కాస్త ఖరీదైనదిగా ఉంటుంది. దీని ధర రూ.25 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
కొత్త టాటా సియెరా కారులో పదుల సంఖ్యలో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉండవచ్చు.
కొత్త టాటా సియెరా ఎస్‌యూవీ భద్రతకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ప్రయాణికుల రక్షణ కోసం 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఈఎస్‌పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఏడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), టీపీఎంఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్) మరియు 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఈ సియెరా కారు 5 సీట్ల ఆప్షన్‌తో వస్తుంది. ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించవచ్చు. మొత్తంమీద, టాటా సియెరా భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ విభాగంలో ఒక సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








