క్రాష్ టెస్ట్‌లో అసలు నిజం తెలిసింది.. విదేశాలకు పంపిన ఇండియన్ కారు సేఫ్టీ టెస్ట్‌లో ఫెయిల్!
ఆఫ్రికన్ మార్కెట్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసి అక్కడి ఎగుమతి చేస్తున్న భారతదేశంలో తయారైన హ్యుందాయ్ గ్రాండ్ i10 (Hyundai grand i10) తాజాగా నిర్వహించిన గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లలో నిరాశాజనకమైన ఫలితాన్ని నమోదు చేసుకుంది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను ఆధారంగా చేసుకుని నిర్వహించిన ఈ తాజా పరీక్షల్లో గ్రాండ్ i10కి జీరో-స్టార్ రేటింగ్ లభించింది. సాధారణంగా, హ్యుందాయ్ కార్లు భద్రత పరంగా మంచి పేరును సంపాదించినా, ఈ మోడల్ మాత్రం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోవడం విశేషంగా మారింది. దేశంలో అమ్మే గ్రాండ్ i10, ఎగుమతి వెర్షన్‌లంటే భద్రత పరంగా పెద్ద తేడా ఉండదనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆఫ్రికన్ మార్కెట్‌కు బయలుదేరిన మోడల్ టెస్ట్‌లో ఇలా తక్కువ స్కోరు రావడం వినియోగదారుల్లో ఆందోళన కలిగించే అంశం. ఆఫ్రికాలోని చాలా పేద ప్రజలకు ఇది ప్రమాదకరమని GNCAP పరీక్ష తేల్చింది.
ఈ టెస్ట్ గురించిన ఇతర వివరాలను చూసినట్లయితే, ఆఫ్రికా మార్కెట్ల కోసం తయారు చేసిన హ్యుందాయ్ గ్రాండ్ i10 హ్యాచ్‌బ్యాక్ పెద్దల కోసం అందించే రక్షణ పూర్తిగా తీరని స్థాయిలో ఉండడంతో ఈ మోడల్ వయోజన ప్రయాణీకుల భద్రతలో సున్నా స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది. మరోవైపు, పిల్లల భద్రత విషయానికి వస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండి, మూడు నక్షత్రాలు సాధించగలిగింది.

స్కోర్‌లను పరిశీలిస్తే, పెద్దల రక్షణ విభాగంలో ఈ కారు 34లో 0 పాయింట్లు మాత్రమే నమోదు చేసింది. అంటే ప్రమాదం సంభవించిన సమయంలో డ్రైవర్, ముందర కూర్చున్న ప్రయాణికులకి గల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఇది సూచిస్తుంది. బాడీ స్ట్రక్చర్ బలం, ఫ్రంట్ ఇంపాక్ట్ సమయంలో ఛాతీ, తలకు కలిగే దెబ్బల టెస్ట్ వంటి కీలక అంశాల్లో మోడల్ పూర్తిగా విఫలమైందని గ్లోబల్ NCAP స్పష్టం చేసింది.
పిల్లల కోసం అందించే భద్రత కొంతమేర మెరుగ్గా ఉన్నప్పటికీ అది పూర్తిగా సంతృప్తికరం అనిపించే స్థాయిలో లేదు. పిల్లల రక్షణ విభాగంలో కారు 49లో 28.57 పాయింట్లు సంపాదించింది. దీనితో 3 స్టార్ రేటింగ్ వచ్చినప్పటికీ, మరింత స్థాయి రక్షణ కోసం అవసరమైన ఫీచర్లు, సీటింగ్ సిస్టమ్‌లు అమలులో లేవని నిపుణులు అభిప్రాయపడ్డారు. పిల్లల భద్రత పరంగా ఒక మోస్తరు స్థాయిలో నిలిచినా, పెద్దల రక్షణ అత్యంత దారుణంగా ఉంది.

ఫ్రంటల్ ఇంపాక్ట్ పరీక్షలో, ముఖ్యంగా డ్రైవర్ ఛాతీకి ఇవ్వబడే రక్షణ చాలా బలహీనంగా ఉందని నిర్ధారించబడింది. ప్రమాద సమయంలో ఛాతీ భాగంపై పడే ఒత్తిడి, గాయాల స్థాయి అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉండటం వల్ల, ప్రాణాంతక గాయాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు తేల్చారు. సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
పెద్దవారి శరీరంలో కీలకమైన భాగమైన ఛాతీపై పడే దెబ్బల గాయం పరిమితులను మించి ఉండటం వల్ల, ఈ పరీక్షలో కూడా పెద్దల కోసం రక్షణ అత్యంత పేలవంగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ కారణంగా, వయోజన ప్రయాణీకుల రక్షణ విభాగంలో ఈ వాహనం సున్నా పాయింట్లకే పరిమితమైంది. ఇక బాడీ స్ట్రక్చర్ విషయానికి వస్తే, ఫ్రంటల్ ఇంపాక్ట్ సమయంలో బాడీషెల్, ఫుట్‌వెల్ భాగాలు అస్థిరంగా ప్రవర్తించాయి.
ఢీకొన్న తర్వాత ఈ భాగాలు మరింత లోడింగ్‌ను తట్టుకునే స్థిరత్వం చూపకపోవడం వల్ల, ప్రమాదం సమయంలో కాళ్లు, మోకాళ్లు, ఛాతీ వంటి భాగాలకు తీవ్రమైన గాయాలు సంభవించే అవకాశం పెరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే ఇండియాలో తయారై ఆఫ్రికన్ మార్కెట్ల కోసం ఎగుమతి కారుకు ఈ స్థాయి రేటింగ్ రావడంపై కంపెనీ సైతం ఆలోచనలో పడింది.
ఈ క్రాష్ టెస్ట్ ఫలితాలపై GNCAP చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ వుడ్స్ మాట్లాడుతూ, తక్కువ, మధ్య-ఆదాయ దేశాలలో భద్రతపై ద్వంద్వ ప్రమాణాలను చూడటం ఆమోదయోగ్యం కాదు. ఆఫ్రికాలో వాహన భద్రతను ప్రజాస్వామ్యీకరించడం GNCAP ప్రాధాన్యత, ప్రపంచంలో ఎక్కడ నివసించినా ప్రజలు సురక్షితమైన వాహనాలు అందుకోవడం అవసరం అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








