ఓ రోజు ఛార్జింగ్ స్టేషన్ దగ్గర కలుసుకుందాం.. టెస్లా ఎంట్రీపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్!
అమెరికాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా (Tesla) ఇప్పుడు అధికారికంగా భారత మార్కెట్‌లో అడుగుపెట్టింది. ఇది భారత ఆటోమొబైల్ రంగానికి ఓ కీలక మలుపు అని చెప్పవచ్చు. సాధారణంగా టెస్లా కంపెనీ ప్రపంచంలోనే అదిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగా ఉంది. దీనికి ప్రధాన ప్రత్యర్థిగా చైనాకు చెందిన బీవైడీ (Byd) కంపెనీ అంతర్జాతీయంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లో కూడా అడుగుపెట్టి క్రమంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటుంది. ఈ క్రమంలో టెస్లా ఇంత కాలం భారత్‌లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేసినప్పటికి పలు కారణాల వల్ల ఇది జరగలేదు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు టెస్లా తన మొదటి అడుగు వేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా రాకపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తనదైన శైలిలో స్పందించారు.
ఆయన ఎక్స్(X) ద్వారా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. "భారత్‌కు స్వాగతం టెస్లా. అవకాశాల గని అయిన ఈ దేశంలో మీ రాక సరికొత్త ఉత్సాహానికి దారితీస్తోంది. పోటీ వాతావరణంతో మరిన్ని ఆవిష్కరణలు వెలుగులోకి రానున్నాయి. మన ప్రయాణం ఇంకా చాలా ముందుంది. ఓ రోజు ఛార్జింగ్ స్టేషన్లో కలుసుకుందాం!" అంటూ సంతోషాన్ని పంచుకున్నారు. అంతేకాకుండా, గతంలో టెస్లా CEO ఎలాన్ మస్క్‌తో జరిగిన 2017 సంభాషణను కూడా పంచుకున్నారు.

2030 నాటికి భారత్‌ను ఎలక్ట్రిక్ వాహనాల దిశగా మారుస్తామని భారత ప్రభుత్వం ప్రకటించిన సమయంలోనే ఆనంద్ మహీంద్రా, ఎలాన్ మస్క్‌ను భారత్‌కు రావాలని ఆహ్వానించారు. మా దేశానికి ప్రత్యామ్నాయాలు కావాలి. మార్కెట్ కేవలం ఒక బ్రాండ్ చేత నియంత్రించబడకూడదు, అనే ఉద్దేశంతో అప్పుడు మస్క్‌ను ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ ఆహ్వానించారు. ఆ వ్యాఖ్యను "Good point!" అంటూ మస్క్ స్పందించారు. అది కూడా ఈ పోస్ట్‌లో కనబడుతుంది.
గతంలోనే భారత్‌లో టెస్లా ప్రవేశానికి ఆతురతగా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొనడం తెలిసిందే. ఇప్పుడు ఆ కల నిజమవుతున్న సందర్భంలో ఆయన స్పందన ప్రత్యేకంగా నిలిచింది. దేశీయ ఆటోమొబైల్ రంగంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హృదయపూర్వకంగా స్వాగతం పలకడం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఆరోగ్యకరమైన పోటీ పరిశ్రమకు మంచిదని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు మహీంద్రా వ్యాఖ్యలు పరిశ్రమకు సరైన సంకేతాలు పంపుతున్నాయి.

ఇదిలా ఉంటే, టెస్లా ప్రవేశంతో పాటు, దేశీయ సంస్థలు కూడా తమ గేమ్‌ను మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంటుంది. భారత ఆటోమొబైల్ రంగం గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా మారుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల దిశగా తీసుకుంటున్న అడుగులు గణనీయమైనవే. టెస్లా ప్రవేశం ఈ మార్పును మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ, ఎకో-ఫ్రెండ్లీ మొవ్‌మెంట్స్‌కు ఇది బలమైన ప్రోత్సాహం.
ఇక దేశీయ తయారీ సంస్థలు కూడా ఈ పోటీని ఎదుర్కొంటూ తమ సాంకేతికతను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నాయి. ఆనంద్ మహీంద్రా స్పందన కూడా అదే దిశగా సాగింది. పోటీలో ప్రగతికి స్థానం ఉండే భావనతో, విదేశీ కంపెనీల రాకను స్వాగతించడంలో ఆయన చూపిన మార్గం పరిశ్రమలో ఎంతో ఆశాజనకంగా మారింది.



Click it and Unblock the Notifications








