Auto Expo 2025 ఆటో ఎక్స్‌పోలో అదిరగొట్టే కార్లు ఇవే.. 2025లో రాజ్యం వీటిదే!
న్యూఢిల్లీలో జనవరి 17న నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 (Bharat Mobility Auto Expo 2025) ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో భారతీయ ఆటో కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరించే అవకాశం ఉంది. పలు సంస్థలు భవిష్యత్తులో తాము ప్రకటించబోయే లేదా విడుదల చేసే వెహికిల్స్‌ని ప్రదర్శించనున్నారు. దీంతో ఈ ఎక్స్‌పో పై ఆటోమోబైల్ ఔత్సాహికులు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ ఎక్స్‌పోలో భారత మార్కెట్‌లో విడుదల కాబోయే ఎలక్ట్రిక్ వాహనాలకు (EV) అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఎక్స్‌పోలో విడుదల కాబోయే కార్లపై ఓ లుక్కేయండి.
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలోకి ఇ-విటారాతో (eVitara)తో అడుగుపెడుతోంది. ఇది 49 కిలోవాట్ల, 61 కిలోవాట్ల రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఇందులోని ఇది 500 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ని అందిస్తుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. మారుతి నుంచి తొలి ఈవీ కావడంతో దీనిపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.

దీని తర్వాత హ్యుందాయ్ క్రెటా ఈవీ కోసం కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ICE వెర్షన్ కారు డిజైన్‌తోనే వస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రేంజ్, ఫీచర్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. హ్యుందాయ్ కోనా ఈవీ, అల్కాజర్ ఎస్‌యూవీ వంటి ఇతర వాహనాల నుంచి ఈ కారు ప్రత్యేక ఫీచర్లను తీసుకుంటుంది. ఇందులో 51.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఫుల్ ఛార్జ్‌లో 473 కి.మీ రేంజ్‌ని ఇవ్వనుంది.
ఆ తర్వాత టాటా మోటార్స్ 2025 టాటా టియాగో, టిగోర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్స్ విడదుల చేయనుంది. ఈ కొత్త టియాగో పెట్రోల్ ఇంజిన్, అదే గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో రానుంది. అయితే దీని థీమ్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇందులోని కొత్త ఫీచర్లు, అప్‌డేటెడ్ డిజైన్, అధునాతన టెక్నాలజీ ద్వారా దీని ధర స్వల్పంగా పెరగనుంది. టిగోర్‌లోనూ ఇటువంటి మార్పులే ఉండనున్నాయి.

ఇక టాటా హారియర్ ఈవీ కూడా ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టనుంది. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి ఇ-విటారా వంటి ఇది గట్టి పోటీని ఇస్తుంది. V2L, V2V ఛార్జింగ్ ఆప్షన్‌తో రానుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇది 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లతో సహా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది.
మహీంద్రా కొత్తగా విడుదల చేసిన రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు BE 6, XEV 9e లను మరోసారి ప్రదర్శించనుంది. ఇవి INGLO ప్లాట్ ఫామ్‌పై ఆధారపడి వస్తాయి. ఈ రెండు కార్లలోని 59 కిలోవాట్ల, 79 కిలోవాట్ల రెండు బ్యాటరీ ప్యాక్స్ 535 నుంచి 682 కి.మీ రేంజ్‌ని అందించనున్నాయి. ఇవి మార్చి నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉండనున్నాయి.

ఎంజీ సైబర్ స్టర్ పేరుతో రెండు డోర్ల ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేస్తోంది. 77 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 580 కిలోమీటర్ల రేంజ్‌ని అందించనుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది. ఇందులోని స్పీడ్ పికప్ యాక్షన్ ప్రత్యేక ఫీచర్‌తో వస్తుంది. ఈ మోడళ్లన్నీ ఎంజీ 'సెలెక్ట్' స్పెసిఫిక్ సేల్స్ సెగ్మెంట్ ద్వారా విక్రయించబడతాయి.
ఈ ఎక్స్‌పోలో స్కోడా 4th జనరేషన్ స్కోడా సూపర్బ్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కారుని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇది టయోటా కామ్రీ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. ఇదే సమయంలో కియా కొత్తగా విడుదల చేసిన సైరోస్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఎస్‌యూవీని ప్రదర్శించనుంది. ఫిబ్రవరి 1న ధరలను ప్రకటిస్తామని కియా పేర్కొంది.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నాయి. వీటితో పాటు రెగ్యులర్ వాహనాల అప్‌డేట్స్ అందించనున్నాయి. ఈ కొత్త ఉత్పత్తులతో మార్కెట్‌ని తమవైపుకి తిప్పుకునే ప్రయత్నం చేయనున్నాయి. వీటితో పాటు టూవీలర్ సంస్థలు సైతం మంచి జోరుని చూపెట్టనున్నాయి.


Click it and Unblock the Notifications








