ఆటో ఎక్స్‌పోలో ‘గోదావరి' స్కూటర్లు, ఆటో ఆవిష్కరణ.. ఈ ఈవీలు రోజువారీ అవసరాల కోసం ఫర్‌ఫెక్ట్!
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ సత్తా చాటింది. ఈ సంస్థ మూడు కొత్త ఈవీలను ఆవిష్కరించి ఆకట్టుకుంది. ఇబ్లూ ఫియో జెడ్ ఇ- స్కూటర్, ఇబ్లూ రోజీ డీఎక్స్ (ఇ-స్కూటర్), ఇబ్లూ రోజీ ఈకో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ పేర్లతో ఈ వాహనాలను తీసుకువచ్చింది. పర్యావరణ హితంగా ఉంటూనే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు జోడించి వీటిని తీసుకువచ్చింది. ఈ వాహనాలు భారతీయ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఉంటాయని చెబుతోంది గోదావరి సంస్థ. దాంతో పాటు ఓ యాప్‌ను కూడా లాంఛ్ చేసింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇబ్లూ ఫియో డీఎక్స్(Eblu Feo DX) స్కూటర్ పవర్‌ఫుల్ 5.0 KW మోటార్‌తో ఉంటుంది. ఇది హై- పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది గరిష్ఠంగా 140 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్.. 80 km/h టాప్ స్పీడ్ అందిస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ.ల దూరం వరకు ప్రయాణిస్తుంది. దీని పర్ఫార్మెన్స్, ఎఫీషియన్సీ కారణంగా ఇది పట్టణంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ స్కూటర్ మూడు డ్రైవింగ్ మోడ్స్‌లో వస్తుంది. అవి ఎకానమీ, నార్మల్, పవర్. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీతో 11 అంగుళాల TFT స్క్రీన్ ఉంటుంది. ఈ స్కూటర్ 28 లీటర్ల బూట్ స్పేస్ అందిస్తుంది. దీంట్లో ఉండే 4.2 kW బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 3.5 గంటల సమయం తీసుకుంటుంది. ఇది రోజువారీ ఉపయోగానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఇక ఇబ్లూ ఫియో జెడ్(Eblu Feo Z) స్కూటర్‌ను భారతీయ కుటుంబాల అవసరాలకు తగ్గట్టుగా తీసుకువచ్చింది గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ సంస్థ. ఈ స్కూటర్ 25 లీటర్ల భారీ బూట్ స్పేస్‌తో ఉంటుంది. దీంట్లో LMFP బ్యాటరీ సిస్టం(48V/30Ah) ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ.ల దూరం వరకు ప్రయాణిస్తుంది.

ఈ Eblu Feo Z స్కూటర్.. డ్యూయల్ LED లైటింగ్‌తో వస్తుంది. దీని ద్వారా మెరుగైన విజిబిలిటీ, సేఫ్టీ దొరుకుతుంది. అంతేగాకుండా ఈ స్కూటర్‌పై 3 సంవత్సరాలు లేదా 30,000 కి.మీ.ల వారంటీ ప్యాకేజీ అందిస్తోంది గోదావరి సంస్థ. దీని బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీ.ల వారంటటీ అందిస్తోంది.
ఇక ఇబ్లూ రోజీ ECO( Eblu Rozee ECO) త్రీ-వీలర్ విషయానికి వస్తే ఇది వ్యాల్యూ- ఫర్- మనీ వాహనం అని చెప్పవచ్చు. కమర్షియల్ వినియోగానికి అనుకూలంగా ఉండే ఈ వాహనం.. 150 Ah Li-ion బ్యాటరీతో ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ.ల దూరం వరకు ప్రయాణించగలదు.

ఈ త్రీవీలర్ స్టీల్ స్కెలెటల్ ఫ్రేమ్, అన్ని చక్రాలకు ఉండే హైడ్రాలిక్ బ్రేక్స్ డ్యూరబిలిటీ, సేఫ్టీ అందిస్తాయి. ఇందులోని 7.8 kWh బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ కావడానికి 58.4V 40 Amp ఛార్జర్‌తో 3.5 గంటల సమయం తీసుకుంటుంది. సుదీర్ఘ ప్రయాణాలకు అనువుగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.
ఈ మూడు వాహనాలతో పాటు గోదావరి సంస్థ తమ వినియోగదారుల కోసం EbluCare అనే యాప్ కూడా లాంఛ్ చేసింది. దీని ద్వారా వాహనాలకు సంబంధించి అత్యవసర సర్వీసులు, సమాచారం అందిస్తుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా రైడ్ ట్రాకింగ్, బ్యాటరీ మానిటరింగ్, సర్వీస్ మేనేజ్మెంట్ వంటి సదుపాయాలు పొందవచ్చు.
ఈ మూడు వాహనాల లాంఛ్.. భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో తమ ప్రయాణానికి కీలక మైలురాయి అని గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్ డైరెక్టర్, సీఈఓ హైదర్ ఖాన్ పేర్కొన్నారు. భారతీయుల అవసరాలను తీర్చుతూ, దేశ సుస్థిరత లక్ష్యాలకు అనుగుణంగా వీటిని రూపొందించినట్లు చెప్పారు. రీజనరేటివ్ బ్రేకింగ్, అడ్వాన్స్‌డ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, నాణ్యమైన తయారీతో ఈవీ రంగంలో తమ వాహనాలు ఒక మార్గదర్శిలా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications








