ఉలిక్కి పడ్డ చిత్ర పరిశ్రమ..భూటాన్ కార్ల స్మగ్లింగ్ కేసు.. మలయాళీ సూపర్ స్టార్ల ఇళ్ల పై ఈడీ మెరుపుదాడులు
భూటాన్ నుంచి లగ్జరీ కార్ల అక్రమ రవాణా కేసు ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది. మలయాళ సూపర్ స్టార్స్ అయిన మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, నటుడు అమిత్ చొక్కాలక్కల్ ఇళ్లతో సహా మొత్తం 17 చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ఈ దాడులు విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలకు సంబంధించి జరుగుతున్నాయి.
ఎందుకు ఈడీ దాడులు?
భూటాన్, నేపాల్ మార్గాల ద్వారా ల్యాండ్ క్రూయిజర్, డిఫెండర్ వంటి ఖరీదైన కార్లను అక్రమంగా దేశంలోకి దిగుమతి చేసుకుని, నకిలీ పత్రాలతో రిజిస్టర్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీని వెనుక కోయంబత్తూరుకు చెందిన ఒక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందని తేలింది.

వీరు ఫోర్జరీ చేసిన పత్రాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నకిలీ ఆర్‌టీఓ రిజిస్ట్రేషన్లు చేయించి, ఆ కార్లను సినీ ప్రముఖులకు, సంపన్నులకు తక్కువ ధరలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో ఫెమా చట్టంలోని సెక్షన్లు 3, 4, 8 ఉల్లంఘనలు జరిగాయని, హవాలా మార్గంలో డబ్బు చెల్లింపులు జరిగాయని ఈడీ చెబుతోంది.
కస్టమ్స్ ఆపరేషన్ నూమ్‌ఖోర్
రెండు వారాల క్రితం కస్టమ్స్ అధికారులు ఆపరేషన్ నూమ్‌ఖోర్ పేరుతో కేరళలో పెద్ద ఎత్తున దాడులు చేసి 39 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. భూటాన్ నుంచి సుమారు 200 కార్లు ఇలా అక్రమంగా భారత్‌లోకి వచ్చి ఉంటాయని కస్టమ్స్ అంచనా వేస్తోంది. ఈ దాడుల్లో దుల్కర్ సల్మాన్, అమిత్ చొక్కాలక్కల్ ఇళ్ల నుంచి కూడా కార్లను సీజ్ చేశారు. కస్టమ్స్ సీజ్ చేసిన ఇళ్లలోనే ఈడీ కూడా ఇప్పుడు తనిఖీలు చేయడం గమనార్హం.

కోర్టులో దుల్కర్ సల్మాన్
తన కారును స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ నటుడు దుల్కర్ సల్మాన్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసు ప్రాథమిక దశలో ఉందని, తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. సీజ్ చేసిన వాహనాన్ని తిరిగి ఇవ్వాలంటే, దుల్కర్ కస్టమ్స్ చట్టం ప్రకారం సంబంధిత అథారిటీని ఆశ్రయించాలని కోర్టు సూచించింది. తాను కారును సక్రమమైన పద్ధతిలోనే కొనుగోలు చేశానని, అన్ని పత్రాలు ఉన్నాయని దుల్కర్ కోర్టుకు తెలిపారు.
ఎక్కడెక్కడ సోదాలు?
ఈడీ అధికారులు కేరళ, తమిళనాడులోని 17 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు చేశారు. ఇందులో మమ్ముట్టి కుటుంబానికి చెందిన కొచ్చిలోని పాత ఇల్లు, ఇళంకుళంలో ఉన్న కొత్త ఇల్లు, చెన్నైలోని దుల్కర్ సల్మాన్ ఇల్లు, పృథ్వీరాజ్ ఇల్లు, అమిత్ చొక్కాలక్కల్ నివాసం ఉన్నాయి.
అలాగే, ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఐదు జిల్లాల ఆటోమొబైల్ డీలర్ల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం.
కేసులో మలుపు
మలయాళ సినీ పరిశ్రమలో కార్లంటే పిచ్చి ఉన్న స్టార్స్ చాలా మంది ఉన్నారు. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో కనిపించిన ఖరీదైన నిస్సాన్ పట్రోల్ కారు కూడా ఇలా అక్రమంగా వచ్చిందేమోనని అధికారులు అనుమానిస్తున్నారు. కస్టమ్స్ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగడంతో, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న పూర్తి స్థాయి మనీ ట్రాకింగ్, లబ్ధిదారుల వివరాలు బయటపడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








