ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ ధరల మధ్య తేడా ముందే తెలుసుకోండి.. కారు కొనేటప్పుడు మోసపోకుండా ఉంటారు
కొత్త కారు లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. షోరూంకు వెళ్లే ముందు రెండు రకాల ధరల గురించి వినే ఉంటారు. అవే ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ధర. ఈ రెండు పదాలు వాహనం ధరను తెలియజేసేవే అయినప్పటికీ వాటి మధ్య చాలా తేడా ఉంటుంది.
ఈ ధరలు అంటే ఏమిటి, వాటిలో ఏవేవి కలుపుతారు.. ఎక్స్ షోరూం ధర కంటే మనం కట్టే ఎక్కువ డబ్బులు ఎక్కడికి వెళ్తాయనే విషయాలను ఈ వార్తలో తెలుసుకుందాం. ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందో కూడా చూద్దాం.

ఎక్స్-షోరూమ్ ధర అనేది వాహన తయారీదారు లేదా డీలర్ నిర్ణయించే బేసిక్ ప్రైస్. ఇది షోరూమ్‌లలో వాహనాల ప్రకటనలు, బ్రోచర్‌లు లేదా ఆన్‌లైన్ లిస్టింగ్‌లలో కనిపించే ధర. ఇందులో కొన్ని ఖర్చులు ఉంటాయి.
వాహనం ఉత్పత్తి, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, లాజిస్టిక్స్ ఖర్చులు ఇందులో ఉంటాయి. తయారీదారు వాహనాన్ని తయారు చేయడానికి ఖర్చు చేసిన మొత్తం ఇది. అలాగే భారతదేశంలో కార్లపై 28% GST వర్తిస్తుంది. ఈ పన్ను ఎక్స్-షోరూమ్ ధరలో చేరుతుంది.

డీలర్ మార్జిన్ : డీలర్ తన మెయింటెనెన్స్ ఖర్చులు, ఉద్యోగుల జీతాలు, లాభం కోసం 2-5శాతం వరకు మార్జిన్‌ను యాడ్ చేస్తారు. దీని కారణంగా వేర్వేరు నగరాల్లో ఎక్స్-షోరూమ్ ధర అటూ ఇటూ మారుతుంది. ఉదాహరణకు, కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7లక్షలు అనుకుంటే, ఇందులో తయారీ ఖర్చు, GST, డీలర్ మార్జిన్ ఉంటాయి. అయితే, ఈ ధర వాహనాన్ని రోడ్డుపై నడపడానికి సరిపోదు. ఎందుకంటే ఇందులో అదనంగా ఛార్జీలు ఉంటాయి.
ఆన్-రోడ్ ధర అనేది వాహనాన్ని షోరూమ్ నుండి ఇంటికి తీసుకురావడానికి, దానిని చట్టబద్ధంగా రోడ్డుపై నడపడానికి చెల్లించాల్సిన మొత్తం ధర. ఇది ఎల్లప్పుడూ ఎక్స్-షోరూమ్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో అనేక అదనపు ఛార్జీలు, ట్యాక్సులు ఉంటాయి.

రోడ్ టాక్స్ : ఇది రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను, ఇది ఎక్స్-షోరూమ్ ధరలో 4-15% వరకు ఉండవచ్చు. ఇది రాష్ట్రం నుండి రాష్ట్రానికి, వాహనం రకాన్ని బట్టి (పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్) మారుతూ ఉంటుంది. ఉదాహరణకు, హైదరాబాదులో 10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన కార్లపై 10%, అంతకంటే ఎక్కువ ధర కలిగిన కార్లపై 12.5% రోడ్ టాక్స్ వసూలు చేస్తారు.
రిజిస్ట్రేషన్ ఫీజు : భారతదేశంలో ప్రతి వాహనాన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియలో నంబర్ ప్లేట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడానికి అయ్యే ఖర్చు ఉంటుంది. ఈ పన్ను వాహనం ఇంజిన్ సైజు, రాష్ట్రం ఆధారంగా రూ.5,000 నుండి రూ.20,000 వరకు ఉండవచ్చు.
ఇన్సూరెన్స్ : మోటార్ వాహన చట్టం, 1988 ప్రకారం కనీసం థర్డ్-పార్టీ బీమా ప్రతి వాహనానికి తప్పనిసరి. అదనంగా, కాంప్రహెన్సివ్ ఇన్సురెన్స్ కూడా తీసుకోవచ్చు, ఇది ప్రమాదం, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాల నుంచి వాహనానికి రక్షణను అందిస్తుంది. బీమా ప్రీమియం వాహనం ధర, మోడల్ , డ్రైవింగ్ హిస్టరీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణంగా ఎక్స్-షోరూమ్ ధరలో 2-3% వరకు ఉండవచ్చు.
హ్యాండ్లింగ్, లాజిస్టిక్ ఛార్జీలు : కొన్ని డీలర్లు వాహనాన్ని ఫ్యాక్టరీ నుండి షోరూమ్‌కు తీసుకురావడానికి లేదా కస్టమర్‌కు డెలివరీ చేయడానికి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ ఛార్జీలు ఐచ్ఛికం డీలర్‌తో చర్చల ద్వారా తగ్గించుకోవచ్చు.
ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ : రూ.10 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన కార్లపై డీలర్ 1% TCS వసూలు చేస్తాడు, ఇది ప్రభుత్వానికి వెళ్తుంది. కొన్ని రాష్ట్రాల్లో డీజిల్ వాహనాలపై 25% వరకు గ్రీన్ సెస్ కూడా విధిస్తారు.
ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ ధర మధ్య తేడా అనేక తప్పనిసరి, అదనపు ఛార్జీల కారణంగా వస్తుంది. రోడ్ టాక్స్, GST, TCS, గ్రీన్ సెస్ వంటి పన్నులు నేరుగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ఈ పన్నులు రోడ్ల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ఇతర ప్రజా సేవల కోసం ఉపయోగిస్తారు.
రిజిస్ట్రేషన్ ఫీజు RTOకి వెళ్తుంది, ఇది వాహనం రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్ జారీ చేయడానికి ఉపయోగపడుతుంది. బీమా ప్రీమియం ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు వెళ్తుంది. ఇది వాహనం, థర్డ్ పార్టీకి జరిగే నష్టాలను భర్తీ చేయడానికి బాధ్యత వహిస్తుంది.
హ్యాండ్లింగ్ ఫీజులు, యాక్సెసరీస్, నిర్వహణ ప్యాకేజీల ఖర్చులు డీలర్‌కు వెళ్తాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ డబ్బును చర్చల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఆన్-రోడ్ ధర ఎక్స్-షోరూమ్ ధర కంటే సుమారు 17% వరకు ఎక్కువగా ఉండవచ్చు. అయితే, ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఆన్-రోడ్, ఎక్స్-షోరూమ్ ధర నగరం, డీలర్‌షిప్‌ను బట్టి మారుతూ ఉంటుంది.
ఎక్స్-షోరూమ్, ఆన్-రోడ్ ధరల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులో బీమా మొత్తం, యాక్సెసరీస్ ధర, ఇతర విషయాలు ఉంటాయి. ఎల్లప్పుడూ ఆన్-రోడ్ ధరను దృష్టిలో ఉంచుకొని మీ బడ్జెట్‌ను ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి చెల్లించాల్సిన మొత్తం అదే.


Click it and Unblock the Notifications








