ఈ కారుతో గంటలోపే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లొచ్చు..వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన ఎలక్ట్రిక్ కారు
ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ సెగ్మెంట్లో కంపెనీలు నిరంతరం కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాకు చెందిన బీవైడీ (BYD) సంస్థ ఈ సెగ్మెంట్లో అనేక మైలురాళ్లను అధిగమిస్తోంది. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారు టెక్నాలజీని తాము తయారు చేశామని బీవైడీ ప్రకటించింది.
ఆ సంస్థ రూపొందించిన యాంగ్‌వాంగ్ యూ9 (Yangwang U9) ట్రాక్ వెర్షన్ ఏకంగా 472.41 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుని కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం నెల రోజుల క్రితం రిమాక్ నెవెరా ఆర్ (Rimac Nevera R) పేరిట ఉన్న రికార్డును ఈ కారు బద్దలు కొట్టింది. ఈ అద్భుతం ఎలా సాధ్యమైందో పూర్తి వివరాలు చూద్దాం.

బీవైడీ యాంగ్‌వాంగ్ యూ9 ఈ రికార్డు ప్రయత్నం జర్మనీలోని ఆటోమోటివ్ టెస్టింగ్ పాపన్‌బర్గ్ (ATP) ప్లాంట్‌లో జరిగింది. ఈ ట్రాక్‌లోనే జూలై 2025లో రిమాక్ నెవెరా ఆర్ హైపర్‌కార్ అనేక రికార్డులను సృష్టించింది. అత్యధిక వేగంతో పాటు 0 నుండి 60, 0 నుండి 100, 0 నుండి 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే విషయంలో ఆ కారు రికార్డులు నెలకొల్పింది.
అయితే, ట్రాక్-ఫోకస్డ్ బీవైడీ యాంగ్‌వాంగ్ యూ9 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. యాంగ్‌వాంగ్ యూ9 ట్రాక్ వెర్షన్ గంటకు 472.41 కి.మీ వేగాన్ని సాధించగా, దానికి ముందు రిమాక్ నెవెరా ఆర్ గంటకు 431.45 కి.మీ టాప్ స్పీడు అందుకుంది.

ఈ కొత్త రికార్డుతో యాంగ్‌వాంగ్ యూ9 స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. స్టాండర్డ్ యాంగ్‌వాంగ్ యూ9 కారుతో పోలిస్తే, ఈ ట్రాక్-ఫోకస్డ్ వెర్షన్ దాదాపు 80 కి.మీ/గం వేగంగా ఉంది. నవంబర్ 2024లో జరిగిన ఒక ట్రాక్ రన్‌లో స్టాండర్డ్ యాంగ్‌వాంగ్ యూ9 గంటకు 391.94 కి.మీ గరిష్ట వేగాన్ని అందుకుంది.
ఈ ట్రాక్-ఫోకస్డ్ బీవైడీ యాంగ్‌వాంగ్ యూ9ను జర్మన్ రేసింగ్ డ్రైవర్ మార్క్ బాసెంజ్ నడిపారు. ఈ ఎలక్ట్రిక్ హైపర్‌కార్ నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో రూపొందించబడింది. ఒక్కో మోటార్ 555 కిలోవాట్ల లేదా 755 పీఎస్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. అంటే, మొత్తంగా 2,207 కిలోవాట్ల లేదా 3,000 పీఎస్‌లకు పైగా శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
దీని పవర్-టు-వెయిట్ నిష్పత్తి టన్నుకు 1,200 పీఎస్‌లుగా ఉంది. పోల్చి చూస్తే, రిమాక్ నెవెరా ఆర్ నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో కలిపి 1,571 కిలోవాట్ల లేదా 2,017 పీఎస్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దాని పవర్-టు-వెయిట్ నిష్పత్తి టన్నుకు 978 పీఎస్‌లుగా ఉంది.

ఇంత స్పీడు సాధించడానికి, యాంగ్‌వాంగ్ యూ9 ట్రాక్ వెర్షన్ అడ్వాన్సుడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీని అపారమైన శక్తిని కంట్రోల్ చేయడానికి, ఈ హైపర్‌కార్‌లో అధునాతన టార్క్ వెక్టరింగ్ టెక్నాలజీ ఉంది. అలాగే, మెరుగైన ట్రాక్షన్ కోసం బీవైడీ e4 ప్లాట్‌ఫారమ్‌లోని డిసస్-ఎక్స్ ఇంటెలిజెంట్ బాడీ కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది.
ఈ సిస్టమ్ సస్పెన్షన్‌లలో ఎప్పటికప్పుడు సర్దుబాట్లు చేస్తుంది. ఉదాహరణకు, అత్యంత వేగంతో మలుపులు తిరిగేటప్పుడు, వేగం పెంచేటప్పుడు, వాహనం స్థిరంగా ఉండేలా డంపింగ్ ఫోర్స్, రైడ్ హైట్‌ను ఇది అడ్జస్ట్ చేస్తుంది.
ట్రాక్-ఫోకస్డ్ యాంగ్‌వాంగ్ యూ9లో తీవ్రమైన పరిస్థితులలో కూడా ఇంజన్‌కు కూలింగ్‌ను అందించడానికి ఒక ప్రత్యేకమైన థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఈ హైపర్‌కార్ ప్రపంచంలోనే తొలిసారిగా 1200V అల్ట్రా-హై-వోల్టేజ్ వాహన ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి తయారు చేయబడిందని బీవైడీ సంస్థ పేర్కొంది.
దీని బాడీ ప్యానెలింగ్‌లోని ఖాళీలను డక్ట్ టేప్‌తో కవర్ చేయడం వంటి కొన్ని ప్రత్యేక అంశాలు కూడా ఈ కారులో ఉన్నాయి. ఇది గాలి నిరోధకతను (ఎయిరోడైనమిక్స్) మెరుగుపరచడానికి సహాయపడిందని అంచనా.


Click it and Unblock the Notifications








