టాటా..బైబై చెప్పిన కార్లు మళ్ళీ వచ్చేస్తున్నాయ్..ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా!
ఒకప్పుడు భారతీయ రోడ్లపై తమ స్థానాన్ని పదిలం చేసుకున్న అనేక కార్ బ్రాండ్‌లు(Car Brands) కఠినమైన పోటీ, సరైన ధరల నిర్ణయం లేకపోవడం, సర్వీస్ నెట్‌వర్క్ (Service Network) లోపాల కారణంగా మార్కెట్ నుంచి నిష్క్రమించాయి. అయితే, 2025 నాటికి భారతదేశపు వేగంగా అభివృద్ధి చెందుతున్న వాహన మార్కెట్ (Growing Indian Auto Market) ఇప్పుడు పాత బ్రాండ్‌లను మళ్లీ ఆకర్షిస్తోంది.
దేశీయ మార్కెట్‌లోకి తిరిగి రావడానికి తమకు అవకాశాలు మెరుగవుతున్నాయని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. కానీ, తిరిగి వచ్చినప్పుడు వినియోగదారుల స్పందన ఎలా ఉంటుందనేది వారికి ప్రధాన ఆందోళన. అయితే, టాటా సియెర్రా(Tata Sierra) వంటి పాత మోడల్‌కు లభించిన సానుకూల స్పందన, ఈ బ్రాండ్‌లకు ధైర్యాన్ని ఇస్తోంది.

ప్రస్తుతం ఫోర్డ్ (Ford) భారతదేశానికి తిరిగి రావడం గురించి చర్చలు ఊపందుకున్నాయి. ఈ బ్రాండ్ ఎగుమతి-కేంద్రీకృత తయారీతో పాటు, ఎంపిక చేసిన కొన్ని ఎస్‌యూవీ (SUV) మోడళ్లను పరిచయం చేయడం ద్వారా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని చూస్తోంది. ఒకప్పుడు విశ్వసనీయత పొందిన పేరు కాబట్టి, ఫోర్డ్ తిరిగి రాకపై వినియోగదారులలో అధిక అంచనాలు ఉన్నాయి.
అదేవిధంగా, షెవర్లే (Chevrolet), మిత్సుబిషి (Mitsubishi) వంటి బ్రాండ్‌లు కూడా భారతదేశానికి తిరిగి రావాలని ఆలోచిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగం ద్వారా కొత్త ఆరంభం చేయాలని చూస్తున్నాయి. ఈవీ సెగ్మెంట్‌లో పెరుగుతున్న వృద్ధి, పాత బ్రాండ్‌లకు కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందే అవకాశంగా కనిపిస్తోంది.

భారతీయ మార్కెట్ ఇప్పుడు మునుపటి కంటే చాలా మారిపోయింది. వినియోగదారులు ఇప్పుడు కేవలం బ్రాండ్ పాత కీర్తి లేదా సంప్రదాయాన్ని మాత్రమే చూడటం లేదు. వారు సేఫ్టీ, టెక్నాలజీ, అత్యుత్తమ సర్వీస్ (Best Service)కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
గతంలో మార్కెట్‌ను వదిలి వెళ్లిన బ్రాండ్‌లపై మళ్లీ మధ్యలో వదిలి వెళ్తారేమో? అనే సందేహం వినియోగదారులలో బలంగా ఉంది. ఈ నమ్మకాన్ని తిరిగి పొందడం బ్రాండ్‌లకు ప్రధాన సవాలు. సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, విడిభాగాల (Spare Parts) లభ్యతను పెంచడం, సరసమైన ధరలను అందించడం వంటి అంశాలు ఈ బ్రాండ్‌ల విజయానికి పునాదులు.
ఈ బ్రాండ్‌లకు అనుకూలంగా పనిచేసే ఒక అంశం నోస్టాల్జియా ఫ్యాక్టర్(Nostalgia Factor). ఒకప్పుడు ఈ కంపెనీల వాహనాలను ఉపయోగించిన వారికి వాటిపై ఉన్న నమ్మకం, అనుభవాలు తిరిగి కొనుగోలు చేయడానికి ఆకర్షించవచ్చు. సరైన ఉత్పత్తిని సరైన సమయంలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో (EV Segment) ప్రవేశపెట్టగలిగితే, కోల్పోయిన విశ్వాసాన్ని, పేరు ప్రఖ్యాతులను తిరిగి సంపాదించుకోవచ్చు.
వినియోగదారులకు తమ దీర్ఘకాలిక ప్రణాళికలు, బలమైన నిబద్ధతను (Commitment) బ్రాండ్‌లు హామీ ఇవ్వగలిగితేనే, భారతీయ మార్కెట్‌లో వారికి రెండో అవకాశం లభిస్తుంది. వారి ఈ తిరుగు ప్రయాణం విజయం సాధిస్తుందా అనేది, వారు భారతీయ మార్కెట్‌ను ఎంత తీవ్రంగా పరిగణిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఈ దిగ్గజ బ్రాండ్లు ఇప్పుడు 2025-26లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈసారి వారు కేవలం పాత జ్ఞాపకాలతో కాకుండా, అత్యాధునిక సాంకేతికత, ఎలక్ట్రిక్ వాహనాల (EV) వ్యూహంతో వస్తున్నారు.


Click it and Unblock the Notifications








